– మద్దతుధర లేక అల్లాడుతున్న రైతుల వ్యధ కనిపించడం లేదా. ?
– తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పోరాడతాం
– ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి, ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు. వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వైయస్ఆర్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు.
కర్నూలు మార్కెట్ యార్డ్‌లో ఉల్లిరైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.