– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన
కామారెడ్డి: జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్ కూడా పాల్గొన్నారు. వర్షాల కారణంగా రహదారులు కోతకు గురైన పరిస్థితులను, లోతట్టు గ్రామాల్లో ముంపు ముప్పును మంత్రి స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రవాణా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలి.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే…
పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలి. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు భరోసా కల్పించాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులు గ్రామాల్లోనే ఉండి ప్రతి కుటుంబానికి అవసరమైన సాయం అందించాలి. సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతాయి.