– తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సంక్షేమానికి, సాధికారతకు పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుతం అమలు అవుతున్న పథకాలు అందుకు నిదర్శనమని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాల హామీలను ఎంతో పారదర్శకంగా, తక్కువ కాలంలోనే అమలు చేసి చూపించారన్నారు.
వైసీపీ ప్రభుత్వం వీటి అమలుపై ఎన్నో దుష్ప్రచారాలు చేసిందని కానీ కూటమి ప్రభుత్వం వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించిందని అన్నారు. ముఖ్యంగా పెన్షన్ను రూ.3,000 నుండి రూ.4,000కు పెంచి, తొలి నెలలోనే ఏప్రిల్ నెలతో కలిపి రూ.7,000 ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని తెలిపారు. గత ప్రభుత్వానికి పెన్షన్ను రూ.3,000 చేయడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారని, ఇది మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేసిందని వివరించారు. ఇటీవల ప్రారంభించిన ఉచిత బస్సు పథకం ద్వారా విద్యార్థినులు, ఉద్యోగినులు, చిన్న వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, ఇది వారి రోజువారీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోందన్నారు.
దీపావళి సందర్భంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందించడం ద్వారా మహిళల కళ్ళల్లో ఆనందం నింపారని అన్నారు. కోటి 10 లక్షల మంది డ్వాక్రా మహిళలను ప్రోత్సహించడానికి ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం రూ.30,000 కోట్లు బడ్జెట్ కేటాయించిందని, డ్రోన్స్ పంపిణీకి కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళల డబ్బులు కూడా కాజేశారన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడిన అంగన్వాడీలకు ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని వారి జీతాలు రూ.4,200 నుండి రూ.10,500కు పెంచారని, హెల్పర్ల జీతాలు కూడా పెంచారని చెప్పారు.
అంతేకాకుండా, గ్రాడ్యుటీని అమలు చేయడం, ఫోన్లలో పనిభారాన్ని తగ్గించి కొత్త ఫోన్లు ఇవ్వడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారని వివరించారు. లక్షమంది అంగన్వాడీలకు తల్లికి వందనం, పెన్షన్ వంటి పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళలపై హింస, అత్యాచారాలు జరిగినప్పుడు కూడా పట్టించుకోలేదని, మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ప్రజలు ఈ మాటలను నమ్మరని స్పష్టం చేశారు. మహిళల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా పది కాలాల పాటు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.