– శ్రీశైలం పాతాళగంగ నుంచి 738 కిలోమీటర్లు కృష్ణాజలాలు పారించి కుప్పం జనాలకు చేర్చిన అపరభగీరధుడు
– కుప్పం రుణం తీర్చుకున్న చంద్రబాబు
– గంగమ్మజాతర జరిగే కుప్పం లో ఇప్పుడు ‘జలజాతర’
– కుప్పం ప్రజల్లో ఆనంద‘సాగరం’
మీరు ఆశ్చర్యపోయినా.. రాయలసీమలో ఒక పోటీ ఉండేది, కొన్ని దశాబ్దాల పాటు అది కొనసాగింది!
అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు మా పరిధిలో మండలాలను, కరువు మండలాలుగా ప్రకటించండి అని ఒక ప్రజాప్రతినిధి అడిగితే.. మావి కూడా చేర్చండి అని డిమాండ్లు వచ్చేవి. కరువు మండలాల లిస్టులో వారి పరిధిలోని పేర్లు చేరిస్తే.. అప్పట్లో గొప్ప నాయకులు అన్నమాట. ఒక్కోసారి జిల్లాల మధ్య పోటీలాగా కూడా తయారైంది.
పాతాళంలో వెయ్యి అడుగులకు పైగా బోర్లు వేసి, అప్పులు చేసి, ఆత్మహత్యలు చేసుకొన్న అన్నదాతలు ఎందరో వున్నారు.
ఇదో ఎడారి అని గల్ఫ్‌కు వెళ్లారు. భూములను తెగమ్ముకొని సమీప పొరుగు రాష్ట్ర పట్టణాలకు వలసలు పోయాయి లక్షలాది కుటుంబాలు. కొందరు కేరళలో భిక్షగాళ్లుగా వుంటే కలెక్టర్లను పంపి తీసుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
పాతికేళ్ల క్రితం హంద్రీ నీవా ప్రాజెక్టుకు 1999 జులై 9న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు. సీమలో ఏ జిల్లాలో నమ్మలేదు. డెల్టా, కోస్తాలకు లెక్కన కాలువల ద్వారా పొలాలకు రాకున్నా, చెరువులకు రాకున్నా.. కనీసం మనుషుల గొంతులు, పశువుల గొంతులు తడుస్తుంది అని నమ్మిన వారు ఎవరూ లేరు.
ఏదో ఒక కర్చీఫ్ అయితే వేశాం అనే ఒక ఆశ మాత్రమే.
ఎందుకంటే.. శ్రీశైలం డ్యాం సముద్ర మట్టానికి 980 అడుగుల ఎత్తున నల్లమల కొండలలో నిర్మించబడింది. అటు చిత్తూరు కుప్పం సముద్ర మట్టానికి 2,293 అడుగుల ఎత్తులో ఉంటుంది.
అంటే కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి అటు చిత్తూరు తరలించడానికి, వివిధ ప్రాంతాలలో ఎత్తిపోతల పథకాలు అవసరం వుంది. మరో వైపు క్రిష్ణా జిల్లాలో అన్నదాతలకే సరిపోయేది కావు. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి చలి కాచుకొన్న రాజకీయ పార్టీలు వున్నాయి. ఇది అయ్యేదా పొయ్యేదా.. ఇదే గాని జరిగితే ఒక అద్భుతమే అని సీమ జనం అభిప్రాయం. రక్తం పారించే రాజకీయ పార్టీలు వున్న కాలంలో ఎవరు నమ్ముతారు, ఎలా నమ్ముతారు?
వాటిలో వారే అధికారంలో లేక పోతే.. రాయలసీమ పోరాటాలు చేసేవారు. ఇప్పటిలా సోషల్‌మీడియాలు లేవు కదా. అంతగా ఆ ముసుగులు ఎవరో తెలిసేవి కావు.
2005లో నిర్మాణం ప్రారంభం అయ్యింది. మల్యాల నుంచి జీడిపల్లి జలాశయం వరకు 216.30 కి.మీ. ప్రధాన కాలువ 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించబడ్డాయి.
2014-19 మధ్య రూ.12,500 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేస్తూ, చంద్రబాబు ప్రాజెక్టును వేగవంతం చేశారు. కృష్ణా నదికి కరువు వస్తే గోదావరి నుండి పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వడానికి ఏడాదిలో అందరూ నోరు వెళ్లబెట్టేలా నిర్మించి అక్కడి పంటలను కాపాడుతున్నారు. అక్కడ మిగిలే కొంతను, సముద్రం పాలవ్వకుండా.. శ్రీశైలం నుండి తీసుకొంటే గొడవలు రాకుండా సామరస్యంగా.. సానుకూలంగా ఆలోచించేలా చేశారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ పనులు ఆగిపోయాయి. కనీసం గ్రీసు కొట్టుకోలేక అన్నమయ్య డ్యాం కూడా కొట్టుకు పోయింది. కానీ అటు వెలిగొండలో ఒక ప్రారంభోత్సవం, ఇటు కుప్పంలో ఒక ప్రారంభోత్సవం చేసి హడావిడి చేశారు. రెండో రోజు చూసే సరికి సెట్టింగ్ సామగ్రిని తీసుకెళ్లిపోయేసరికి, తీవ్ర అవమానంగా భావించారు ప్రజలు. మేమంత తెలివితక్కువ వాళ్లమా అని మనసులో అనుకొన్నారు.
2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పనులను వేగవంతం చేశారు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచింది. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేశారు.
కృష్ణా జలాలు ప్రవహించే మార్గంలో 19 నియోజకవర్గాలను తాకుతూ 10 రిజర్వాయర్లను నింపుతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా 110 చెరువులను నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, కుప్పంలో 6,300 ఎకరాల ఆయకట్టుకు నీరు, 33 లక్షల మందికి తాగునీరు, కుప్పంలో 4 లక్షల జనాభాకు తాగునీరు అందుతుంది.
40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి
పాతికేళ్ల క్రితం కలగని శంకుస్థాపన చేసిన నాటి ఉమ్మడి సీఎం చంద్రబాబు నాయుడు, నేడు ఆంధ్రా సిఎంగా కుప్పంలో పరమసముద్రంలో కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు.
శ్రీశైలం పాతాళగంగ నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు, గంగమ్మ జాతర జరుపుకొనే కుప్పం చేరడంతో.. అక్కడ జల జాతర జరుపుకొంటున్నారు. సీమ జనం ఆనందబాష్పాల భావోద్వేగాలలో వున్నారు.
మధ్యలో ఆయన్ను ప్రతిపక్షనేతగా చేసి ఉండకపోతే.. పోలవరం కూడా పూర్తయ్యి, బనకచర్ల అనుసంధానాలు కూడా ఎప్పుడో మొదలై వుండేవి. మనం అనుకొన్నవి అన్నీ జరగవు కదా. ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు అలవాటు పడిపోయిన సమాజం ఇలాంటి పండగలలో పాలుపంచుకొంటే జరిగే మేలు మరింత ఉంటుంది.