– సెప్టెంబర్ 6న యూరియా కొరత, రైతాంగం సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవోలకు వినతి పత్రాలు
– రైతులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలపై రైతుల పక్షాన సంఘీభావం
– రైతాంగ సమస్యలపై ఆయా జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో రెండు రోజుల పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్) , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రాష్ట్ర రైతు విభాగం కమిటీ సభ్యులు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
– పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి).
తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలపై ప్రధానంగా యూరియా సమస్యపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనిపై రైతుల పక్షాన నిలబడి అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాం. జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు అన్నీ అందుబాటులో ఉండేవి కానీ ఇప్పుడు విత్తనాలు, ఎరువులు రెండూ కొరతగా ఉన్నాయి. పైకి మాత్రం యూరియా వచ్చిందని కూటమి ప్రభుత్వం చెబుతున్నా వచ్చిన స్టాక్ అంతా కూటమి నాయకులు పక్కదారి పట్టించడంతో రైతులు రోడ్లెక్కుతున్నారు.
దీనిపై మనం కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై అందరం చర్చించి సెప్టెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ యూనిట్‌గా ఆర్టీవోలకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నాం. రైతు విభాగంలో కమిటీల నియామకాలు త్వరగా పూర్తిచేయాలి, అందరూ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు సమన్వయం చేసుకోవాలి. అన్ని అనుబంధ విభాగాల సమన్వయంతో బలంగా మన వాణి వినిపించాలి. సెప్టెంబర్ 2 న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం రోజు మనం అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పిద్దాం.
టెలికాన్ఫరెన్స్‌లో బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే… రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రధానంగా యూరియా సమస్య, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులు ఇలా వారందరికి మద్దతుగా మనం ఈ కార్యక్రమం రూపొందించి ముందుకెళదాం. రెవెన్యూ డివిజన్ యూనిట్‌గా మనం ఆయా ప్రాంతాల రైతుల సమస్యలపై రైతులతో కలిసి ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేద్దాం. క్రాప్ ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యపై కూడా పోరాడుదాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతుల పక్షమేనన్న విధంగా మనం ముందుకెళదాం.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నారంటే… భారీ వర్షాలకు పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరి పంట కోతకు వస్తున్న దశలో గాలివాన కురవడంతో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. రైతులు అప్పు చేసి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతినడంతో వారు లబోదిబోమంటున్నారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు అధికారులు చెబుతున్నా మాటలకే పరిమితమవుతుంది. రైతులు అధిక రుణభారంతో సతమతమవుతున్నారు, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటలు అమ్ముకోలేక నష్టపోతున్నారు, వారికి అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుంది
కారుమూరి నాగేశ్వరరావు ఏమన్నారంటే… సీఎం చంద్రబాబు పాలనలో రైతుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. పంటల దిగుబడి, మద్దతు ధర రాకపోవడంతో సాగు కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూటమి పాలనలో రైతులకు అప్పులు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. వైయస్ జగన్ హయాంలో రాజుగా బతికిన రైతు ఇప్పుడు కుదేలయ్యాడు, వారికి అండగా నిలిచి వైఎస్సార్సీపీది రైతు పక్షం అని నిలుద్దాం.