– మెడికల్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మహబూబాబాద్ : ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందని అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు (16) ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు నిర్మించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడం కోసం నిబద్దతతో ముందుకు సాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నర్సింగ్ కాలేజీల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి కల్పించడం కోసం ఇతర దేశాల భాషలపై నైపుణ్యత కల్పించడం కోసం వినూత్న కార్యక్రమం చేపడుతుందన్నారు తద్వారా ఆర్థికంగా స్థిరపడతారని అన్నారు.
ఎన్సిడి నీ నియంత్రించాలని అందుకు వైద్యశాఖ కృషి చేయాలన్నారు. అవయవాల మార్పిడి ద్వారా ఈస్టర్న్ తెలంగాణ హబ్ గా మారాలని సూచించారు. వైద్య రంగంలో నూతన టెక్నాలజీ వినియోగించి ముందుకు సాగాలన్నారు, జిల్లా కేంద్రంలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో 186 కోట్ల వ్యయంతో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభించి, మూడవ సంవత్సరం చదువుతున్న దమయంతి, స్వాతి, ప్రకాష్ పాండే, మైదేహి వర్మ, అనీషా, యతేశం, తదితర వైద్య విద్యార్థిని, విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ , అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.