– ఆరోగ్యం విషమం
– బుకాయిస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యం – ఆరోగ్యం విషమం
– బుకాయిస్తున్న యాజమాన్యం
పాలకొల్లు: నారాయణ స్కూల్ లో హార్పిక్ యాసిడ్ పౌడర్ తిన్న చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పాలకొల్లులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాలకొల్లు టౌన్ బుధవారపు వీధి కి చెందిన చిన్నారి తల్లిదండ్రులు మామిడిపల్లి సంయుక్త, అనుదీప్ లు స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు.
నాలుగేళ్ల మా కుమార్తె హార్వి సహస్ర పాలకొల్లు నారాయణ స్కూల్ లో ఎల్.కే.జీ చదువుతోంది. గత గురువారం స్కూల్ కి వెళ్ళేటప్పుడు పాప బ్యాగ్ లో బిస్కెట్ ప్యాకెట్ వేసి పంపించాం. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చిన్నారికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మేము వెళ్ళాము.
ఆసుపత్రి లో చిక్సిత చేసిన వైద్యులు ఇక్కడ కష్టమని, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించాలని సూచించారు. విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తే.. స్కూల్ బ్రేక్ టైమ్ లో బిస్కెట్ ప్యాకెట్ అనుకొని హార్పిక్ యాసిడ్ పౌడర్ తినేసిందని, దీంతో నోటి నుంచి రక్తం వచ్చినట్టు తెలిసింది. చిన్నారి నాలుక, పేగులు, గొంతు లోపల భాగం లో కాలిపోయాయని వైద్యులు చెప్పారని చిన్నారి తల్లి సంయుక్త కన్నీరుమున్నీరవుతూ వివరించారు.
ప్రస్తుతం శరీరం లోకి పైపు ద్వారా ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు ఐదేసి చుక్కలు చుక్కలుగా వేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. మీ పాపే ఆ ప్యాకెట్ తెచ్చుకుందని బుకాయిసున్నారని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. సీసీ ఫుటేజీ తీయాలని అడుగుతుంటే కెమెరాలు పనిచేయడం లేదని చెబుతూ, ఎదురు వాదనకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై విజయవాడలో కేసు నమోదు చేయించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.