– ఈనెల 5న నియామక పత్రాలు అందజేయనున్న ముఖ్యమంత్రి
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం
– గ్రామ స్ధాయి వరకు రెవెన్యూ సేవలు
– రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : గ్రామస్ధాయిలో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామపాలనాధికారుల ( జీపీవో) నియామకంతో నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
భూ సమస్యలపై తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి మరింత మెరుగైన సేవలందించడానికి రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తున్నామని ఇందులోభాగంగా రెవెన్యూ సేవలను గ్రామ స్ధాయి వరకు అందించడానికి జీపీవో సేవలను ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు జీపీవోలకు హైటెక్స్‌లో నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.
గురువారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రిగారు మాట్లాడుతూ జీపీవోలుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన విఆర్వో, వి.ఆర్.ఎ లకు రెండు విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికయ్యారని తెలిపారు. వీరి రాకతో గ్రామస్దాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత బాగా అందుతాయన్నారు.
ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెబితే వినలేదన్న అక్కసుతో విఆర్వో , విఆర్ఎ వ్యవస్దను రద్దు చేశారని, ఈ చర్య వలన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా రెవెన్యూ సేవలు గ్రామ స్దాయి వరకు అందించాలనే లక్ష్యంతో గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నామని ప్రకటించారు. చారిత్రాత్మకమైన భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వే విభాగం బలోపేతం తోనే రెవెన్యూ వ్యవస్ధలో మెరుగైన సేవలు అందించగలుగుతామని దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వేవిభాగాన్ని బలోపేతం చేస్తున్నామని గత పదేళ్ళలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను కూడా వచ్చేనెల మొదటివారం నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో 7వేల మందికి శిక్షణ ఇవ్వడం అర్హత పరీక్ష నిర్వహించడం పూర్తయ్యాయని లో 40 రోజుల పాటు నిర్వహిస్తున్న అప్రెంటిస్ శిక్షణ కూడా త్వరలో పూర్తిచేసుకోబోతున్నారని తెలిపారు. గత నెల 18వ తేదీ నుంచి రెండవ విడతలో మూడు వేల మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభించడం జరిగిందన్నారు.