– 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం
– కానీ 1980లోనే ఓటర్ల జాబితాలో సోనియా పేరు
– ఢిల్లీ కోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ఆంటోనియా మైనో.. అదేనండి సోనియాగాంధీ ఓటు వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఓట్ చోరీ నినాదంతో బిహార్‌లో ఉద్యమిస్తున్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ సహా ఆ పార్టీకి అనుకోని షాక్ తగిలింది. భారత సభ్యత్వం పొందకుండానే సోనియా ఎలా ఓటు వేశారో తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఒక పిటిషన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారతీయ పౌరసత్వం పొందక ముందే, 1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకు ముందే ఆమె ఓటరు ఎలా అయ్యారనే సందేహంతో ఈ పిటిషన్ దాఖలైంది.
కాస్ త్రిపాఠి అనే వ్యక్తి సీనియర్ అడ్వకేట్..పవన్ నారంగ్ ద్వారా ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఇందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారు. కానీ 1980లో న్యూఢిల్లీలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైంది.
1982లో సోనియా పేరు జాబితా నుంచి తొలగించబడింది. 1983లో మళ్లీ ఆమె పేరు జాబితాలో చేరింది. దీనిపై పిటిషనర్ కాస్ త్రిపాఠి అనుమానం వ్యక్తం చేస్తూ, సోనియా కు అప్పట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో సోనియా పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
