– టోల్ ను దాటాలంటే రూ. 3 వేలు కట్టినవారికి రూ. 15 లు మాత్రమే చార్జ్
– కానీ ఓఆర్ఆర్ పై ప్రస్తుతం రూ. 100 నుంచి మొదలు రూ. 180 వరకు ట్యాక్స్ వసూలు
– అవినీతికి నిదర్శనంగా ఓఆర్ఆర్
– రేవంత్, తుమ్మల యూరియా కొరత లేదంటారు
– పీసీసీ అధ్యక్షుడేమో కొరత ఉందంటారు
– ముగ్గురి మాటల్లో నిజమెవరిది?
– తెలంగాణకు సంవృద్థిగా యూరియా అందిస్తున్న మోదీ సర్కారు
– మరి ఆ యూరియా ఎలా మాయమతోంది?
– తెలంగాణలో ప్రభుత్వం ఉందా?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం ఉందా? ఉందంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సమన్వయం ఉందా అనే సందేహం ప్రజల్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ యూరియా కొరత లేదని, సమస్య కేవలం పంపిణీలోనే ఉందని చెబుతున్నారు. కానీ టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ యూరియా కొరత ఉందని, దానికి కేంద్రమే బాధ్యత అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ కి వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంలేదా? లేక కేవలం కమ్యూనికేషన్ లో లోపమేనా అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 31 వరకు అవసరాల మేరకు 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందించింది, 2.8 లక్షల మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్‌లో ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మరి ఎరువుల కొరత ఇంకెక్కడిది?
జులైలోనే 20% మేర ఎక్కువ యూరియాను రాష్ట్రానికి కేంద్రం పంపించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ, అసలు లోపాన్ని బయటపెట్టడం లేదు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్‌లో ఎరువుల లారీలు పట్టుబడినట్లు, ఎరువుల దుకాణాలు మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్, పంపిణీ లోపాలు ఎక్కడ జరిగాయి అనే విషయం పరిశీలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతలను కప్పిపుచ్చుకోడానికి కేంద్రాన్ని, బిజెపి ని నిందించడం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం రైతుల, వ్యవసాయ రంగానికి నిరంతరం మద్దతు ఇస్తోంది. యూరియా, ఎరువుల సరఫరాలో కరోనా ఆపత్కాలంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా దేశంలో ఎరువుల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చూసింది.
మోదీ ప్రభుత్వం దేశంలో 5 కొత్త ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరించింది. మన తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6,300 కోట్లతో పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎరువుల సరఫరా విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ రీఫామ్స్ దేశ ప్రజలకు సంతోషం కలిగించాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో సామాన్య పేద, మధ్యతరగతి, వేతన జీవులు, చిన్న పరిశ్రమలకు మేలు జరగనుంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్‌పై జీఎస్టీ 28% నుండి 18%కి తగ్గించడంతో గృహనిర్మాణ ఖర్చులు, ఇతర నిర్మాణ కార్యకలాపాలు మరింత లాభదాయకంగా మారనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ రుసుములను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల ఒక్కో వాహనదారుడు ఏడాది మొత్తం సుమారు రూ.15,000 వరకు లాభపడతారు. కానీ తెలంగాణలో అవుటర్ రింగ్ రోడ్ పై ఇది అమలు కావడంలేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ ను ప్రైవేట్ కు అమ్ముకుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పై టోల్ రూ.100–రూ.180 వరకు వసూలు చేస్తున్నారు.
ఇవాళ ఒక్కటోల్ ను దాటాలంటే.. రూ. 3 వేలు కట్టినవారికి రూ. 15 లు మాత్రమే చార్జ్ అవుతుంది. కానీ ఓఆర్ఆర్ పై ప్రస్తుతం రూ. 100 నుంచి మొదలు రూ. 180 వరకు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ పై సిట్ విచారణ చేపడతామని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఏ విచారణ జరగడం లేదు. ఇందులో ఏమైంది, ఎక్కడ ఎంత డబ్బు ముట్టిందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు అమ్మేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రివ్యూ జరపకపోతే ప్రజల ఆగ్రహానికి భాద్యత వహించాల్సి వస్తుంది.
అవినీతికి నిదర్శనంగా ఓఆర్ఆర్ మారింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వాహనదారులపై భారం తగ్గిస్తుంటే, కాంగ్రెస్ సర్కారు అసమర్థతతో భారం పెరుగుతోంది. కేంద్రం జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను తగ్గించడంలో కీలక నిర్ణయం తీసుకుంది. అదే విధానాన్ని అవుటర్ రింగ్ రోడ్ పై కూడా అమలు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.