గుంటూరు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాదులోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జరిగిన ప్రతిష్ఠాత్మక టెడ్ ఎక్స్ కార్యక్రమంలో ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ వేదికపై మాట్లాడిన తొలి రాజకీయ నాయకురాలిగా నిలిచారు.
“సానుకూల మనస్తత్వం సమాజాన్ని మార్చగలదు. సమస్యలను దాటుకొని ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరి లోపలే శక్తి ఉంది” అని గళ్ళా మాధవి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. నేటి యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయాలు శక్తివంతమైన సాధనం అని, మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. “సమాజాన్ని సమగ్రంగా, సమానత్వంతో ముందుకు తీసుకెళ్లడం మన అందరి బాధ్యత అని , మార్పు మనలో నుంచే మొదలవ్వాలి” అంటూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.