– ఇన్సూరెన్స్ మోడల్ నూటికి నూరుశాతం ఫెయిల్యూర్ మోడల్
– ఇన్సూరెన్స్ విధానం ద్వారా తమ వారికి కేటాయించుకునే కుట్ర
– మాజీ మంత్రి రజని
తాడేపల్లి: జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా.. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఆరోగ్యశ్రీ అంటే దివంగత నేత వైయస్సార్ మాత్రమే గుర్తుకు వస్తారని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన నాడు-నేడు, నూతన వైద్య కాలేజీల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో చిరస్ధాయిగా నిల్చిపోతుందని స్పష్టం చేసారు. ప్రజల్లో ఆ మంచి పేరును చెరిపివేయాలన్న కుట్రతో పాటు, ఇన్సూరెన్స్ పేరుతో తమ వారికి కట్టబెట్టడానికే కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పాల్పడుతోందని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేస్తే… ఆ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులు కన్సెల్టెన్సీతో పాటు మందులు, సీటీ, ఎమ్మారై స్కాన్ లాంటి వైద్య పరీక్షలకూ మందులు కట్టుకోవాల్సిన దుస్థితి. ఆపరేషన్ చేయాల్సి వస్తే అది ఆ పేదరోగుల మీద మరింత భారం పడి.. అప్పుల పాలయ్యే పరిస్థితి. ఈ పాపం కూటమి ప్రభుత్వానిదే. వైద్యం పేరుతో పేదవాడి నడ్డి విరిచి సొమ్ము చేసుకోవాలనుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువస్తోంది.
ఇన్సూరెన్స్ మోడల్ అనేది నూటికి నూరుశాతం ఫెయిల్యూర్ మోడల్. ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ విధానంలోకి మార్చాలన్న ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సొమ్ము చేసుకునే స్కామ్ కి పాల్పడుతున్నారని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.