– హంగు ఆర్భాటాలు లేకుండా నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
– ఆశ్చర్యపోయిన పోలీసులు, భక్తులు
-నిమజ్జన ఏర్పాట్లపై భక్తులతో ఆరా
– ఏర్పాట్లు బాగున్నాయన్న భక్తులు
హైదరాబాద్: అక్కడ పోలీసులు, అధికారులు నిమజ్జన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. వచ్చే వాహనాలను దారిమళ్లించే పనిలో ఉన్నారు. ఈలోగా చడీచప్పుడు లేకుండా వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచారు. సహజంగా సీఎం బయటకు వస్తే భారీ కాన్వాయ్‌తోపాటు, స్థానిక పోలీసు వాహనాల హడావిడి కనిపిస్తుంటుంది. కానీ రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా.. కొద్దిమంది సెక్యూరిటీతో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు.
ఆ సందర్భంగా అక్కడున్న భక్తులు, చిన్నారులను పలకరించారు. నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా.. గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఇళ్లకు జాగ్రత్తగా చేరుకోవాలి రేవంత్ వారికి సూచించారు. అనంతరం భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటుచేసిన వేదికపై నుంచి అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులను అభినందించారు. సీఎం వెంట డిసిసి అధ్యక్షుడు డాక్టర్ రోహిన్‌రెడ్డి ఉన్నారు.