– జిల్లా కలెక్టర్, కమిషనర్లకు అభినందనలు
– శానిటేషన్ సిబ్బంది నుండి కరెంట్ సిబ్బంది వరకు పనితీరు బాగుంది
– ప్రసాదాల వితరణ సంస్థల సేవలు అభినందనీయం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్: నగరంలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు పాటుపడిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సహా పోలీస్, మున్సిపల్, శానిటేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, ఫిషరీస్ సహా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు.
హిందువులంతా ఒకే వేదికపై వచ్చి ధార్మిక వాతావరణంలో నిమజ్జనోత్సవాలను జరుపుకోడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా కౌంటర్లు ఓపెన్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాల వితరణ, మంచి నీళ్ల కౌంటర్లను ఏర్పాటు చేసి సేవ చేసిన వివిధ సంస్థలు, వ్యాపారులు, సంఘాలు, ధార్మిక సంస్థలకు అభినందనలు తెలిపారు. హిందూ ఐక్యతకు, ప్రశాంత వాతావరణంలో హిందువులంతా ఏకమై పండుగల ఉత్సవాల నిర్వహించడంలో కరీంనగర్ స్పూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.