తన కోసం వేచి వున్న వారి గదిలోకి గాజు డోరు తీసుకుని లోకేష్ వస్తుండగా, ఆయన ముఖంలో ఏదో తీరికలేని పనుల ఒత్తిడి కనిపించింది. ఢిల్లీలో ప్రధానితో సమావేశమై, వెంటనే వచ్చి గురుపూజోత్సవం రోజు తన విద్యా శాఖ ఫలితాలు చూపించాలనే తపన ఆయనలో స్పష్టమైంది.
పనుల మీద పనుల అలసట లోకేష్ ముఖంలో కనిపించినా, అది క్షణాల వ్యవధిలోనే ఆనందంగా, గర్వంగా వెలిగిపోయింది. బహుశా అక్కడ వేచి ఉన్న వారి భావోద్వేగాలకు తగ్గట్టుగా ఆయన ముఖం వెంటనే మారిపోయింది. వారిని చూసిన వెంటనే అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చాడో ఆయనకు గుర్తుకు వచ్చి వుంటుంది.
ఆ గదిలో వేచి వున్న వారంతా జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులు. సాధారణంగా, జర్మన్ భాష నేర్చుకోవడానికి లక్షకు పైగా ఖర్చు అవుతుంది. కానీ, మన ప్రభుత్వ కార్యక్రమం వల్ల ఈ యువతకు ఉచితంగా శిక్షణ లభించింది. వీరు ఇప్పుడు డాక్టర్లతో సమానమైన జీతాలు అందుకోబోతున్నారు. పైగా, షెంజెన్ వీసాతో 29 యూరోపియన్ దేశాలు చుట్టే అవకాశం లభిస్తుంది. అందుకే వారిలో ఆ ఆనందం తొణికిసలాడుతోంది.
సాధారణంగా నర్సింగ్‌లో మలయాళీ విద్యార్థులే ఎక్కువగా కనిపిస్తుంటారు. దీనికి కారణం అక్కడ ఈ రంగంలో అవకాశాలు తక్కువగా ఉండటం, ఫీజులు ఎక్కువగా ఉండటం. నర్సింగ్‌ను మన దగ్గర కొందరు తక్కువగా చూస్తారు కానీ, అది విదేశాలకు వెళ్లడానికి అత్యంత సులభమైన మార్గం. అక్కడ వారికి డాక్టర్ల కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది.
మనవారు జేఈఈ, ఎంసెట్ అంటూ లక్షలు ఖర్చు పెట్టి ఇంజినీరింగ్ చేయించి, ఆ తర్వాత ఎమ్మెస్‌కు అమెరికా పంపిస్తుంటారు. అక్కడ ఇంటర్న్‌షిప్ దొరక్క లోన్లు తడిసి మోపెడవుతుంటాయి. ఈ కష్టాలు బయటకు చెప్పుకోలేక, ఏదో పని చేసుకుంటూ బతుకుతుంటారు.
కానీ, ఈ ప్రభుత్వంలో బీ2 లెవెల్ వరకు జర్మన్ భాషా శిక్షణ ఉచితం. ఈ శిక్షణ ద్వారా ఎంతోమంది యువతకు భరోసా లభించింది.
ఉద్యోగం పొందిన వారి మాటల్లో…
మైలారి వినోదిని (కపాడిపాలెం, నెల్లూరు జిల్లా): “నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను. విజయవాడ భవానీపురంలోని సీడాప్, ఐఈఎస్ (Indo Euro Synchronization) శిక్షణా కేంద్రంలో 8 నెలల పాటు జర్మన్ భాషపై B2 లెవల్ వరకు ఉచితంగా శిక్షణ అందించారు. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. శిక్షణతో పాటు హాస్టల్, భోజన వసతి కూడా కల్పించారు. నెలకు ₹2.70 లక్షల ప్యాకేజీతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం లభించింది. ఇది నాకొక గోల్డెన్ అవకాశం. రేపు నేను జర్మనీ వెళ్తున్నాను. చాలా సంతోషంగా, ఉద్విగ్నంగా ఉంది.”
ఒక యువతి: “పిన్నమనేని ఆసుపత్రిలో ఏడాది పాటు నర్సుగా పనిచేశాను. వార్తాపత్రికలో సీడాప్, నైపుణ్య విభాగం ద్వారా ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారని చూసి దరఖాస్తు చేశాను. ఇక్కడ పది నెలల పాటు శిక్షణ, వసతి, భోజనం, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. నాన్నగారు రైతు, మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. ‘ఆడపిల్లలకు చదువు ఎందుకు’ అని హేళన చేసిన వారే ఇప్పుడు నేను విదేశాలకు వెళ్తుంటే గర్వపడుతున్నారు. ఇది కలలో కూడా ఊహించని అవకాశం.”
కనికె లోకేష్ (కల్లూరు, కర్నూలు జిల్లా): “ఎల్‌వీటీజీ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదివి, కర్నూలులోని విజయ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేశాను. సీడాప్, ఐఈఎస్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఉచిత శిక్షణ పొందాను. విదేశాల్లో నర్సింగ్ జాబ్ చేయాలనే నా కల ఈ అవకాశంతో సాకారమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ యువతకు ఇలాంటి మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను.”
దెబ్బె శివరాజు (బోగోలు, కర్నూలు జిల్లా): “నేను ఈ నెల 22న నర్సింగ్ జాబ్ కోసం జర్మనీ వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. పేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం పొందడం ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. వారికి మంచి జీవితం ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సీడాప్కు కృతజ్ఞతలు. భవిష్యత్తులో నాలాంటి పేద విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాను.”
కార్యక్రమం వివరాలు:
సోసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP), ఇండో యూరో సింక్రనైజేషన్ (IES) & జర్మన్ హెల్త్‌కేర్ సంయుక్త భాగస్వామ్యంతో ‘ఓవర్సీస్ ప్లేస్మెంట్ స్కీమ్’ కింద 14 మంది నర్సింగ్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు జర్మనీలో ఉద్యోగాలు లభించాయి. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ వీరికి కాల్ లెటర్స్ అందజేశారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా, ఇప్పటికే 40 మంది వివిధ విభాగాల్లో ఎంపికయ్యారని, 14 మంది జర్మనీ వెళ్తున్నారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఇతర దేశాల్లో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
జర్మనీలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు మాట్లాడుతూ.. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తాము స్థానిక ఆసుపత్రుల్లో నెలకు ₹15,000–₹20,000 జీతానికి పనిచేసేవాళ్లమని, సీడాప్ ద్వారా శిక్షణ తర్వాత నెలకు ₹2.8 లక్షల శాలరీతో జర్మనీలో ఉద్యోగం లభించడం ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు.