* గురుకులాల్లో ఆరోగ్య భద్రత కూడిన నాణ్యమైన విద్య
* టెన్త్, ఇంటర్ లోనూ అత్యుత్తమ ఫలితాలు
* బీసీల చదువు ఇష్టంలేని జగన్
* ఆ 5 ఏళ్లూ నిరాదరణకు గురైన బీసీ హాస్టళ్లు, గురుకులాలు
* పెనుకొండ ఎంజేపీ స్కూల్లో స్మార్ట్ పే ఫోన్లు ప్రారంభం
* 110 గురుకులాల్లో 700లపైగా ఫోన్ల ఏర్పాటు
* పే ఫోన్లతో విద్యార్థులకు ఎంతో మేలు
* తల్లిదండ్రులతో మాట్లాడుకునే అవకాశం
– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ: రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంతో కార్పొరేట్ విద్యా సంస్థలతో జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాల పోటీపడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ స్కూళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉందని వెల్లడించారు. బీసీ బిడ్డలకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. పెనుకొండలోని రొద్దం-2 ఎంజేపీ స్కూల్లో స్మార్ట్ పే ఫోన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో కలిసి మంత్రి సవిత సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 110 ఎంజేపీ స్కూళ్లో 700ల వరకూ స్మార్ట్ పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఫోన్ల ద్వారా తమ తల్లిదండ్రులతో విద్యార్థులు రోజూ మాట్లాడుకునే అవకాశం కల్పించామన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలలో ఆరు చొప్పున పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికీ స్మార్ట్ కార్డు అందజేస్తామని, ఆ కార్డులో తల్లిదండ్రులు సూచించిన నాలుగు నెంబర్లు పొందుపరుచుతామన్నారు.
ఆ నెంబర్లకే విద్యార్థులు తమకు కేటాయించిన సమయంలో మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలంటే గురుకుల పాఠశాలలకొచ్చే విజిటర్లు, ఇతరులకు సెల్ ఫోన్లు అడిగే వారన్నారు. విద్యార్థులకు ఇపుడిక ఈ కష్టాలు ఉండబోవన్నారు. వారికిచ్చిన కార్డులతో తమ తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడుకోవొచ్చునన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఇంటిపై బెంగపోవడంతో పాటు విద్యపై దృష్టి సారించడానికి అవకాశం కలుగుతుందన్నారు.
ఎంజేపీలో నాణ్యమైన విద్య
రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ విద్యా సంస్థలతో దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. టెన్త్, ఇంటర్ లో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మిగిలిన ప్రభుత్వ సంక్షేమ గురుకులా కంటే ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అందుకే బీసీ గురుకులాల రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత బీసీ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గురుకులాలకు నిరంతరం విద్యుత్ ఉండేలా ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్వో ప్లాంట్లు, కంప్యూటర్ లేబ్ లు నెలకొల్పామన్నారు.
బీసీల చదువుకోవడం ఇష్టం లేని జగన్
బీసీ బిడ్డలు ఉన్నత విద్య అభ్యసించాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలకు నాంది పలికారని మంత్రి సవిత తెలిపారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో బీసీ బిడ్డల చదువుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ స్కూళ్లను టీడీపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయన్నారు. 2019-24 మధ్య జగన్ హయాంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల నిరాదరణకు గురయ్యాయన్నారు. మరమ్మతులు పట్టించుకోలేదని, విద్యార్థుల డైట్ బకాయిలు కూడా చెల్లించలేదని మండిపడ్డారు. 2014-19 మధ్య సీఎం చంద్రబాబునాయుడు 28 గురుకులాల అనుమతులివ్వడంతో పాటు నిధులు మంజూరు కూడా చేశారన్నారు. తరవాత వచ్చిన జగన్ పట్టించుకోలేదన్నారు. బీసీ బిడ్డలు చదువు కోవడం జగన్ కు ఇష్టం లేదని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేయొద్దు
బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదవే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని మంత్రి సవిత సూచించారు. సమస్యలుంటే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని అటు తల్లిదండ్రులకు, బంధువులకు, ఇటు స్నేహితులకు, ఉపాధ్యాయులకు మానసిక క్షోభకు గురిచేయొద్దన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి
స్మార్ట్ పే ఫోన్లను ప్రారంభించిన అనంతరం మంత్రి సవిత విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పే ఫోన్ ఏర్పాటుతో తమ పిల్లలతో మాట్లాడుకునే సౌకర్యం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. నెలల తరబడి పిల్లల ముఖం చూడలేకపోతున్నామని, ఇప్పుడు ఫోన్ సౌకర్యం కల్పించడం వల్ల బిడ్డల గొంతు వినే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం విద్యార్థులకు మంత్రి సవిత స్మార్ట్ పే ఫోన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ చైర్మన్ బంగార్రాజు, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎంజేసీ స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.