– రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్
– జ్యూరిచ్ లోని తెలుగు కమ్యూనిటీతో సమావేశమైన మంత్రి కొండపల్లి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని, సృజనాత్మక ఆలోచనలతో తమ స్వగ్రామాలలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల రూపంలో అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
వారం రోజులు పాటు స్విజర్లాండ్ పర్యటనలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యూరిచ్ లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్చర్లాండ్ (టిఏఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో జరుతున్న అభివృద్ధిలో భాగం కావాలని కోరారు.
ప్రవాసాంధ్రులు తమ మాతృభూమితో నిత్యం సంబంధాల కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడం ద్వారా పిల్లలను సాంస్కృతిక మరియు విధ్యా కార్యక్రమాలలో భాగం చేయాలని మంత్రి సూచించారు.
ఆహ్లాదకర వాతావరంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు స్విట్జర్లాండ్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో తాము భాగం అవుతామన్న ఆసక్తిని వ్యక్తం చేశారు.
టీఏఎస్ నుండి తాటికొండ కిషోర్, సన్నీ మూడనూరు, ఏ పీ యన్ ఆర్ టి నుండి శ్రీకృష్ణ వల్లూరి సమన్వయంతో ఏర్పాటైన ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ లో ఉంటున్న పలువురు తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.