– మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్‌ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూసమాజం సహించదని హెచ్చరించారు.
ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో, ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న దురాగతాన్ని న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్‌లకు ఎలా కేటాయిస్తారు? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శిధిలావస్థకు చేరిన ఈ ఈ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలు కేటాయించి వైయస్ జగన్ జీర్ణోద్దరణ చేశారు.
నేడు కూటమి ప్రభుత్వం మాత్రం విలువైన ఆ ఆలయ భూములు కబ్జా చేసేందుకు కలెక్టర్‌ని అడ్డం పెట్టుకుని పావులు కదుపుతోంది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కౌలుకిచ్చిన ఈ భూముల్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో రాత్రికిరాత్రే కంకర, మట్టి, ఇసుక తరలించి లెవలింగ్ చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ భూకేటాయింపులను హిందూ ధర్మపరిరక్షణ సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వం. ఈ భూముల వ్యవహారంపై అవసరమైతే న్యాయస్థానాల్లోనే వైఎస్సార్సీపీ పోరాడుతుంది.