ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ప్రారంభానికి సూచికగా మోగించే గంటను ఆయన మోగించారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణ భారత నటుడిగా ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.
“ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టం. ఈ రోజు నేను మా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE India)ని సందర్శించడం జరిగింది.
ఆ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది. ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి, నాకు స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు… ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని, మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను” అంటూ బాలయ్య వినమ్రంగా స్పందించారు.