ఎబిడిఎం మిషన్ డైరెక్టర్ వీరపాండియన్ ఎంపిక
– దేశం నుంచి నలుగురిని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
– ఆరోగ్య శాఖలో డిజిటలైజేషన్‌కు జాతీయ స్థాయిలో లభించిన అరుదైన అవకాశం
– వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అభినందనలు
అమరావతి: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డిజిటలైజేషన్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ రంగంలో స్ఫూర్తిగా ఉన్న డెన్మార్క్ ప్రభుత్వమిచ్చే శిక్షణా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడియం ) మిషన్ డైరెక్టర్లను ఎంపిక చేయగా, వీరిలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ఎబిడియం మిషన్ డైరెక్టర్ జి.వీరపాండియన్ కూడా ఉన్నారు. అసోం, జమ్యూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు వీరపాండియన్ తో కలిసి డెన్మార్క్ వెళ్లనున్నారు.
డెన్మార్క్ ప్రభుత్వం పూర్తి ఖర్చులతో నెల రోజుల పాటు డనీడా ఫెలోషిప్ సెంటర్ ప్రొగ్రాం కింద అక్టోబర్ 1 నుంచి 31 వరకు వీరికి శిక్షణ ఇవ్వనుంది. ప్రజారోగ్య సంరక్షణలో డిజిటలైజేషన్, సమాచార సేకరణ, వినియోగంను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ను అమలు చేయడంలో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు దీని అమలులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు రూ.20 కోట్లు ప్రోత్సాకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రోగ్రాం కింద రూ. 16 కోట్లు అందుకుంది. ఈ స్థాయిలో దేశంలో ఏ ఇతర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నిధుల్ని పొందలేదు.