– యుపిఏ అభ్యర్ధి సుదర్శన్‌రెడ్డి పరాజయం
– యుపిఏకు చేయిచ్చిన విపక్షాలు
– ఓటు వేయడం రాని ఎంపీలు 15 మంది
– చెల్లని ఓట్లు 15
– ఓటింగుకు దూరంగా 14 మంది ఎంపీలు
ఢిల్లీ: అంతా అనుకున్నట్లే జరిగింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్ధి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. యుపిఏ అభ్యర్ధి సుదర్శన్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలినట్లు స్పష్టమయింది. యుపిఏకు ఓట్లు వేస్తామన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు చేయిచ్చినట్లు వెల్లడయిన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తం 767 ఓట్లలో రాధాకృష్ణన్ ఏకంగా 452 ఓట్లు సాధించి సుదర్శన్‌రెడ్డి ని చిత్తు చేశారు. ఈ ఎన్నికల్లో 752 ఓట్లు చెల్లుబాటు అవగా.. 15 చెల్లని ఓట్లు నమోదయ్యాయని రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ ప్రకటించారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా.. ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. 781 అర్హులైన ఎంపీలలో 767 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 98.2 ఓటింగ్ శాతం నమోదైంది.
ఎన్డీయే అభ్యర్థికి వచ్చిన ఓట్లు – 452
ఇండీ కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు- 300
ఎన్డీయే అభ్యర్థి మెజార్టీ- 152 ఓట్లు
చెల్లని ఓట్లు- 15
మొత్తం ఓట్లు- 781
విజయానికి కావాల్సిన ఓట్లు- 377
ఎన్నికల్లో ఓటు వేయని ఎంపీలు- 14 మంది
మొత్తం పోలైన ఓట్లు- 767 మంది
చెల్లుబాటు ఓట్లు- 752