– తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కూటమి చర్యలు
– సచివాలయంలోని ఆర్టీజీఎస్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్
– ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేస్తున్న మంత్రి నారా లోకేష్
అమరావతి: నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నడుంబిగించారు. ఇందుకోసం నేడు అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షించనున్నారు.
ఈ మేరకు ఆర్టీజీఎస్ సెంటర్ లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగింది. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నెంబర్ ఏర్పాటుచేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో మంత్రి సమన్వయం చేస్తున్నారు. అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగువారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడంపై కార్యాచరణ ప్రారంభించనున్నారు.
నేపాల్ లో చిక్కుకున్న 187 మంది తెలుగువారు
నేపాల్ లో ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు. బఫాల్ లో చిక్కుకున్న 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సిమిల్ కోట్ లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవకు పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేశారు. తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.
హెల్ప్ లైన్ నెంబర్లు
నేపాల్ లో ఉన్న భారతీయుల కొరకు భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు), రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నెంబర్లు. నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు): +977 – 980 860 2881 / +977 – 981 032 6134 ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, EXT : 8001, 8005 మరియు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com మరియు info@apnrts.com,లనైనా సంప్రదించవచ్చును.
నేనున్నా… మీరు ధైర్యం ఉండిండి!
– తెలుగువారితో ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మంత్రి లోకేష్
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకరావడమే ఏకైక అజెండా అని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నేపాల్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్టు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వీరంతా నేపాల్ లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని, వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
నేపాల్ లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ లో వీరంతా ఉన్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి.. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. వారికి ఆహారం, భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలి. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు చెందిన వారు, వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని, కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిలో భరోసా నింపారు.
విశాఖకు చెందిన సూర్యప్రభతో వీడియో కాల్ మాట్లాడిన లోకేష్
సమీక్ష సందర్భంగా నేపాల్ లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి నారా లోకేష్ ఫోన్, వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సూర్యప్రభతో మాట్లాడిన మంత్రి లోకేష్.. నేపాల్ లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని, అక్కడ అందబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకబు చేశారు. తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్ లో చిక్కుకుపోయామని, ప్రస్తుతం ఓ హోటల్ లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు అధికారులు మీతో సంప్రదిస్తారని భరోసా ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని వారిలో ధైర్యం నింపారు