(ఆత్మహత్యల నివారణ దినం)
ఆగు..
ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి..
నిన్ను నువ్వు ప్రశ్నించుకో..
ఈ దుందుడుకు చర్య
నీకు అవసరమాని..
ఇది నీకు మాత్రమే
వచ్చిన కష్టమా..
నీ చుట్టూ ఉన్న
ప్రపంచాన్ని చూడు..!
అన్నం లేని జనం..
దైన్యం నిండిన మనుషులు..
అప్పులు..ఆకలి..
అనారోగ్యాలు..
నిరుద్యోగం..
ఒంటరితనం..ఓటమి..
వ్యాపారంలో నష్టాలు..
ఇలాంటి ఎన్నో కష్టాలు..!
మరి అందరూ చచ్చిపోతున్నారా..
నిజమే..
మనుషులు మరణిస్తారు..
రోగమో..ప్రయోగమో..
హత్యో..ప్రమాదమో
మొత్తానికి ఆయువు చెల్లి..
తిరిగి రాడెవడు మళ్లీ..!
పుట్టినవాడు గిట్టక తప్పదు
మళ్లీ పుడతావో లేదో..
పుట్టినా ఇలాగే పుట్టేది లేదు
ఇదే పుట్టక..ఇదే జన్మ
బ్రతకడానికే ఈ ప్రయాస
కన్ను తెరిస్తే జననం..
కన్ను మూస్తే మరణం..
ఈ నడుమ సాగే నాటకం
మూణ్ణాళ్ల ఈ జీవితం
ఎలాగైనా బ్రతుకు
ఎలా బ్రతికినా
తప్పని చావు
ఒకనాటికి రానీ..
అంతవరకు పోరాడు
అంతేగాని నీ అంతట
నువ్వే చచ్చిపోయి ఓడిపోకు..!
అది చావు కంటే
హీనమైన చావు..!
అవసరమా నీకు…!?
ఉద్యోగం రాలేదని
వ్యాపారం దెబ్బతినిందని
స్నేహితుడొకడు మోసం చేశాడని..
ప్రేమించిన వాళ్ళు
వదిలి వెళ్ళిపోయారని
పరీక్ష తప్పావని..
ఇవా ఆత్మహత్యకు కారణాలు..
సిగ్గనిపించడం లేదూ..
నోరు లేని జీవాలూ
బతికేందుకు
తాపత్రయ పడతాయే
అంత కన్నా
హీనమా నువ్వు..!?
తలచుకుంటే నీ తలరాత
ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా
చేయగల సత్తా నీది..
అలాంటిది ఇంత చిన్న కారణానికే చచ్చిపోతే ఎలా?
పారే నది..వీచే గాలి..
ఊగే చెట్టు..
ఉదయించే సూర్యుడు
అనుకున్నది సాధించాలనే
తపన నీలో కసికసిగా ఉంది
ఆత్మహత్య ఆలోచన ఆపి
అక్కడి నుంచే
ముందు నడక..
ఆ తర్వాత
పరుగు మొదలెట్టు..
అదిగో మొదటి మెట్టు
అధిరోహించు..
గెలిచి చూపించు..!
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
7995666286