– నేపాల్ బాధితులకు యువనేత లోకేష్ బాసట
– ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి చేర్చిన కార్యదక్షుడు
– ఢిల్లీలో ఎంపీ సాన సతీష్‌తో మానటరింగ్ సెల్
– కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును పరుగులు పెట్టించిన యవనేత లోకేష్
– నాడు హిమాచల్‌ప్రదేశ్‌లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల్లో ఏపీకి చేర్చిన తండ్రి చంద్రబాబునాయుడు
– నేడు నేపాల్ బాధితులను ఏపీకి చేర్చిన యువతరంగం లోకేష్
– లోకేష్‌కు కృతజ్ఞతలు చెప్పిన బాధితులు
– మీ మేలు జీవితాంతం గుర్తుంచుకుంటామని కృతజ్ఞతలు
– రాజకీయాల్లో పరిణతి చెందుతున్న యువనేత లోకేష్
– అవకాశం వచ్చినా పిసినారితనంతో దూరం చేసుకున్న జగన్
(మార్తి సుబ్రహ్మణ్యం)
మళ్లీ విశాఖ వస్తామని అనుకోలేదు
విశాఖ ‘‘నేపాల్‌లో మేం ఉంటున్న హోటల్‌కి నిప్పుపెట్టారు. మా లగేజ్ అంతా హోటల్లోనే ఉంది. కట్టుబట్టలతో తప్పించుకున్నాం. మళ్లీ విశాఖ వస్తామని అనుకోలేదు. ఏపీ ప్రభుత్వం చొరవతో బయటపడ్డాం. మంత్రి నారా లోకేష్‌కి ధన్యవాదాలు
మేం ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరిగింది. కర్రలు, రాడ్లతో బస్సును ధ్వంసం చేశారు. అక్కడి క్యాబ్ డ్రైవర్లు మాకు సహకరించారు. మూడు రోజులు హోటల్లోనే ఉండిపోయాం. మా హోటల్లోకి ఆందోళనకారులు చొరబడ్డారు. దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు ’’ ఇవి .నేపాల్ నుంచి తిరిగివచ్చిన యాత్రికుల గోస!
* * *
నరకం అంటే ఏమిటో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. కష్టం అంటే ఏమిటో అది ఎదుర్కొన్న వారికే అర్ధమవుతుంది. వీటికిమించి.. అసలు బతుకుతామా? లేదా? బతికినా ఇంటికి చేరతామా?లేదా?.. ఈలోగా అరాచకవాదులు అంతమొందిస్తే? మన ఆనవాళ్లు జన్మభూమికి తెలిసేదెలా?
ఇక జీవితంలో ఇది చివరి మజిలీనా? జన్మభూమితో బంధం తెగినట్లేనా? మాకిక భూమ్మీద నూకలు చెల్లినట్లేనా? అన్న జీవన్మరణ విషాద దృశ్యాల నడుమ, ఆ నరకం ఏమిటన్నది బందీలయిన బాధితులకే తెలుసు.. ఆ విషమ పరిస్థితి తీవ్రత ఏమిటన్నది?!
మరి అలాంటి జీవన్మరణ సమస్య నుంచి.. దేశం కాని దేశంలో భూమ్మీద నూకలు చెల్లిపోతాయోమోనని, ప్రాణాలుగ్గబట్టుకుని బితుకుబితుకుమని బతికిన ఆ ప్రాణాలకు ఎవరైనా ఊపిరి పోస్తే..?
వారి వేదన విని నేనున్నానంటూ ముందుకొచ్చి నయాపైసా ఖర్చు లేకుండా సొంతూరికి చేర్చి, వారికి పునర్జన ప్రసాదిస్తే..?
ఆ బాధితుల దృష్టిలో వారేమవుతారు?
నిస్సందేహంగా దేవుడవుతారు.. ఆపద్బాంధవుడవుతారు.. అనాధ రక్షకుడవుతారు!
యస్..
ఇప్పుడు నేపాల్‌లో జరిగింది అచ్చం అదే!
ఆ దేవుడు.. ఆపద్బాంధవుడే.. టీడీపీ ఉత్తరాధికారి మంత్రి నారా లోకేష్!
అవును.. ఇది పొగడ్త కాదు. నిఝంగా నిష్ఠుర నిజం!!
కావాలంటే చావు తలనోట్లో నుంచి బయటపడి.. విషాదాన్ని జయించి విశాఖకు వచ్చిన ఆ బాధితుల మాటలే దానికి నిలువెత్తు నిదర్శనం.
అవి ఉత్తుత్తి మాటలు కావు.. గుండెలోతుల నుంచి పెల్లుబికిన, కృతజ్ఞతతో కూడిన ఆవేదనాభరిత వ్యాఖ్యలు!
మరి కృతజ్ఞత ఎందుకుండదు?!.. ఉంటుంది!!
పుట్టెడు కష్టాల్లో కూరుకుని.. బతుకుతామా? చస్తామా? అన్న వేదన నుంచి బయటపడేసి.. మళ్లీ పునర్జన్మ ప్రసాదించిన యువ నేత లోకేష్‌కు, మనసులో నిండిపోయిన ఆరాధానాభావాన్ని కళ్లు చెమడ్చిన కృతజ్ఞత రూపంలో.. బయట ప్రపంచానికి చెప్పడానికి బాధితులకు మొహమాటం ఎందుకుంటుంది? అది చెప్పకపోతే కృత జ్ఞులకు-కృతఝ్ఞులకు తేడా ఏముంటుంది?
మరి వారికి యువనేత లోకేష్ చేసింది మామూలు సాయమా? .. కానేకాదు. జీవితాంతం గుండెల్లో గుడి కట్టుకునేంత సాయమది!
అప్పుడు తండ్రి చంద్రబాబునాయుడు విపక్షంలో ఉన్నా.. ఓట్లు-ప్రతిఫలంతో పనిలేకుండా.. అధికార కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకునేలా.. చివరకు అధికారంలో ఉన్న పాలకులకూ దక్కని విమానాలు వెదికి పట్టుకుని, హిమాచల్‌ప్రదేశ్ వరదల్లో చిక్కుకుని రక్షించే నాధుడి కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకుని, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న సమయంలో.. అక్కడికి విమానాలు పంపించి, వారిని ఢిల్లీ చేర్చిన మానవతావాది చంద్రబాబునాయుడు.
ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతికిన తెలుగువారిని ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేర్చడంతో, చంద్రబాబు తన పనయిపోయిందనుకోలేదు. మళ్లీ ఢిల్లీ నుంచి విమానాలు-బస్సుల్లో బాధితులను సొంత ఊరికి చేర్చేవరకూ విశ్రమంచని కార్యదక్షుడు చంద్రబాబునాయుడు. పనిలో ఆయనొక పట్టువదలని విక్రమార్కుడు. ఎందుకంటే.. పని ఆయనకు ఒక వ్యవసనం. ఆ వ్యవసనం ఆయనకు దాసోహం. ఇంతే. అంతకుమించి మాటల్లేవ్!
కర్నూలు వరద బాధితులకు సాయం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు నుంచి.. లారీలకు లారీల సాయం పంపించింది. బాబు అర్ధాంగి భువనేశ్వరి దగ్గరుండి మరీ ఆ వ్యవహారాలు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమానికి సారథి మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు.
ఒక పని పెట్టుకుంటే దానిని పూర్తి చేసేవరకూ చంద్రబాబు ఎలాగయితే విశ్రమించరో.. గరికపాటి కూడా అంతే! ఆయన కూడా కార్యదక్షుడు. కాకపోతే పబ్లిసిటీకి దూరంగా, చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతారు. ఒక ఆర్గనైజర్ పబ్లిసిటీ ఆశించరు. బాబు రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్, గరికపాటి మోహన్‌రావు కూడా అంతే! ఇలాంటి వాళ్లు నాయకుడి క్షేమం కోసం పనిచేసే తెరవెనుక పాత్రధారులు.
నాకు బాగా గుర్తు. కర్నూలు వెళుతున్న బృందానికి నాయకత్వం వహిస్తున్న గరికపాటి అండ్‌కోతో చంద్రబాబు టెలీఫోన్ కాన్ఫరెన్స్. ఎలా వెళుతున్నారు? ఏ రూట్లో వెళుతున్నారని బాబు ఆరా. ‘‘సార్.. ఈ చిన్న చిన్న విషయాలు మేం చూసుకుంటాం కదా? మీరు నిశ్చింతగా ఉండండి’’ అన్నది గరికపాటి సమాధానం. ‘కాదమ్మా. మనం ఏ పనిచేసినా క్లారిటీ ఉండాలి. మనతో వచ్చిన వాళ్లు ఇబ్బంది పడకూడదు. మీరు వెళ్లే రూట్లో ఫలానా హోటల్ ఉంటుంది. అక్కడ ఫ్రెష్ అవండ’’ని బాబు నిర్దేశం. జలగం వెంగళరావులో కూడా అలాంటి నిర్దేశమే కనిపించేది. వీటికి నాడు టీడీపీ ఎఫైర్స్ చూసిన నాలాంటి జర్నలిస్టులు ఒక సజీవ సాక్ష్యం.
నిజానికి ఆ పని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు- ఆయన సారథ్యం వహించే టీడీపీకి చేయాల్సిన బాధ్యత లేదు. సగటు ప్రతిపక్షపార్టీ మాదిరిగా.. తెలుగువారిని తీసుకురావడంలో అధికార పార్టీ విఫలమయిందంటూ నాలుగు రాళ్లు వేసి, జనం సానుభూతి పొందవచ్చు. సహాయ కార్యక్రమాల్లో అవినీతి తాండవిస్తోందని యాగీ చేసి పొలిటికల్ మైలేజీ పొందవచ్చు. అప్పుడు చంద్రబాబు అలా చేయలేదు.
సినిమా భాషలో చెప్పాలంటే.. చంద్రబాబు రొటీన్‌కు భిన్నం! ఒక రాజకీయ పార్టీగా, తనకూ ప్రజల ప్రాణాలపై ప్రేమ ఉందని చెప్పడానికే.. కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టి, నాడు హిమాచల్‌ప్రదేశ్‌లో చిక్కుకున్న తెలుగువారందరినీ క్షేమంగా మళ్లీ వారి ఇళ్లకు చేర్చిన కార్యదక్షుడు చంద్రబాబునాయుడు. నిజానికి అప్పుడు కాంగ్రెస్ సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు.
కానీ ఆయనకు సైతం ఒక్క విమానం బుక్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా, చంద్రబాబునాయుడే తన పలుకుబడితో అన్ని విమానాలు బుక్ చేసుకున్న ఆశ్చర్యం. ఒక విమానం సిమ్లా నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి విజయవాడ-విశాఖ-కర్నూలు జిల్లాలకు బుక్ చేయడమంటే తమాషా కాదు. బోలెడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాంటి ఆశ్చర్యానికి అప్పట్లో నాలాంటి జర్నలిస్టులు సజీవ సాక్ష్యం!
హిమాచల్‌ప్రదేశ్ వరదలు, విభజనకు ముందు చంద్రబాబు ఢిల్లీ ఏపీ భవన్లో చేపట్టిన దీక్షకు ఒక జర్నలిస్టుగా వెళ్లిన నేనూ ఓ సజీవ సాక్ష్యం!! అప్పటికే గరికపాటి మోహన్‌రావు ఢిల్లీలోని తెలుగు సంఘాలతో చర్చించారు. అప్పుడర్థమయింది.. చంద్రబాబును అందరూ పనిరాక్షసుడని ఎందుకంటారో?!
ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే కాదు. విపక్షంలో ఉండగా, కర్నూలును ముంచెత్తిన వరదల సమయంలో చంద్రబాబుది అదే స్ఫూర్తి! సర్వం కోల్పోయి, ఆదుకునే ఆపన్న హస్తాల కోసం బాధితులు బేలచూపులతో ఎదురుచూస్తున్న సమయంలో.. నాటి నేత గరికపాటి మోహన్‌రావు సారధ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు నుంచి పాలు, తిండి-బట్టలకు హైదరాబాద్ నుంచి లెక్కలేనన్ని లారీల్లో పంపి, బాధితుల కళ్లలో వెలుగు నింపిన వదాన్యుడు చంద్రబాబు!
అది ఆంధ్రానా? తెలంగాణ అని చూడరు. బాధితుడిది ఏ కులం? ఏ మతం అని చూడరు. తెలుగువాడి కోణంలోనే చూస్తారాయన! బాబు విపక్ష నేతగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో రోజుకు 100 మందికి వివిధ రూపాల్లో సాయం అందించేవారు. స్కూలు ఫీజులు.. ఆసుపత్రి బిల్లులు. అలా! పాపం.. నాటి ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పైనే ఆ భారమంతా పడేది. విచిత్రమేమిటంటే.. శ్రీనివాస్‌కు సైతం బాబు మాదిరిగానే భూదేవంత సహనం! బాసుపై మాటపడనంత విధేయత. ఇప్పుడు అంత చిత్తశుద్ధి-అంకితభావంతో పనిచేసే వాళ్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు.
కానీ విచిత్రంగా.. చంద్రబాబు కోసం అంతలా శ్రమించిన శ్రీనివాస్, అధికారంలోకి వచ్చినా, బాబుకు దూరంగా ఉండటమే ఆశ్చర్యం. ఎందుకంటే.. జగన్ జమానాలో చాలామందిలా శ్రీనివాస్ కూడా జగన్ బాధితుడే. నిజానికి జగన్ సీఎంగా ఉన్న కాలంలో.. బాబు పీఎస్ శ్రీనివాస్‌కు ఆశ చూపిస్తే ఏమయ్యేదో?!
అందుకే జగన్ పెట్టే టార్చర్ వల్ల, చంద్రబాబుకు ఎక్కడ ఇబ్బంది అవుతుందేమోనని భయపడి.. ఏడాది పాటు అమెరికాలో అజ్ఞాతవాసం అనుభవించిన, రజనీకాంత్ ‘ముత్తు’ లాంటి పెండ్యాల శ్రీనివాస్.. ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడటమే విషాదం. ఇది దురదృష్ట పరిణామం. అది వేరే వ్యవహారం.
ఇలా చంద్రబాబు వదాన్యత చెప్పుకుంటూ పోతే రాస్తే రామాయణం. చెబితే మహాభారతం!! కానీ ఆయన దురదృష్టమేమో గానీ.. సాయం అందుకున్న చేతులేవీ బాబు గొప్పతనం గురించి చెప్పవు. మళ్లీ అదో చర్చ. నిజానికి వైఎస్ కంటే చంద్రబాబు చేసిన సాయమే ఎక్కువ.
మరి ఆయన కడుపున పుట్టిన తనయుడు లోకేష్ అందుకు భిన్నంగా ఎందుకుంటారు? ఆయనా అంతే! ఇదిగో నేపాల్ ఘటనే అందుకు నిలెవత్తు నిదర్శనం!!
నిజానికి అనంతపురంలో కూటమి నిర్వహించిన సూపర్‌సిక్స్-సూపర్‌హిట్ సభకు లోకేష్ హాజరుకావాలి. ఎందుకంటే కూటమికి సంబంధించినంతవరకూ, అది ప్రతిష్ఠాత్మకమైన పెద్ద ఈవెంట్. ఇక్కడ ఈవెంట్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే.. కాలానికి అనుగుణంగా టీడీపీ కూడా మారుతోంది. ఒకప్పుడు ఇలాంటి వాటిని సభలు అనేవారు. అంటే వాటికి దుంగలు పాతడం నుంచి.. స్టేజీ నిర్మించడం వరకూ కార్యకర్తలే చూసుకునే వారు.
ఇప్పుడు అలాంటి వాటితో కార్యకర్తలు-నేతలకు పనిలేదు. ఈవెంట్ కంపెనీనే అంతా చూసుకుంటుంది. అందుకే ఎవరూ పార్టీ నాది అని సొంతం చేసుకోలేకపోతున్నారు. అది వేరే కథ. 1989 నుంచి హిమాయత్‌నగర్‌లో ఉన్న టీడీపీ పార్టీ అఫైర్స్‌ను.. ఆంధ్రభూమి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ప్రతినిధిగా చూసిన నా అనుభవం అది. అది వేరే కథ.
నాకు ఆ అవకాశం ఇచ్చిన నాటి ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి గారికి, అప్పటి టీడీపీ బీట్ రిపోర్టరు దివంగత కెఎన్చారి, బుద్దా మురళి గారికి సర్వదా కృత జ్ఞుడిని. వైశ్రాయ్ సంక్షోభం, తర్వాత జరిగిన నాయకత్వ మార్పిడి.. అదో తీపి-చేదు గుర్తులు.
కానీ ఒక భవిష్యత్ నేతగా లోకేష్ ను ప్రమోట్ చేసే కార్యక్రమం అది. ఆ మేరకు జరిగిన ఏర్పాట్లు కూడా అద్భుతం. ఏమాటకామాట. రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కష్టం కూడా అందులో ఉంది. అనంతపురం సభ సక్సెస్‌లో అనగాని పాత్ర ‘అనంత’ం. అది వేరే వ్యవహారం. దానివల్ల లోకేష్‌కు వచ్చే పొలిటికల్ మైలేజీ మామూలుగా ఉండదు!
కానీ.. దానిని కూడా పక్కనపెట్టి, నేపాల్ తిరుగుబాటులో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా ఇళ్లకు చేర్చాలన్న సదాశయంతో, అనంతపురం వెళ్లకుండా అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లోనే రెండురోజులు తిష్ఠవేసి.. కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడును పరుగులు పెట్టించి.. ఢిల్లీలో యువ ఎంపి సాన సతీష్‌ను సమన్వయకర్తగా పెట్టి.. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని, ముందుగా ఢిల్లీకి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకేష్ కార్యదీక్షను ప్రత్యర్ధులు సైతం అభినందించాల్సిందే.
ఢిల్లీలో ఎంపి సాన సతీష్‌ను సమన్వయం కోసం నియమించడమయినా.. ఢిల్లీలో ఏపీ భవన్.. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేయడమయినా లోకేష్ చూపిన ముందుచూపు ప్రశంసనీయం. లోకేష్ తీరు చూస్తే.. నాడు హిమాచల్‌ప్రదేశ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి చేర్చాలన్న చంద్రబాబు తపన కనిపించింది! అంటే నాడు తండ్రి..నేడు తనయుడు!! ట్రెడిషన్ కంటిన్యూ!!!
అంతేనా?.. ఆర్టీజీఎస్లో పనిచేసే వారిని ఇళ్లకు పంపించకుండా, రాత్రి కూడా ఆ ఉద్యోగులతో పనిచే యించి, ‘ఫలితం’ రాబట్టిన లోకేష్‌లోని పరిపాలనాదక్షుడిని.. నేపాల్ సంఘటన బయట ప్రపంచానికి పరిచయం చేసింది. హేట్సాఫ్ టు లోకేష్! కష్టపడ్డవాడికే ఫలితం దక్కుతుంది!! చరిత్ర కూడా అలాంటి చరితార్ధులనే గుర్తుంచుకుంటుంది!!!
* * *
నిజంగా నేపాల్ ఘటన రాజకీయ కోణంలో ఆలోచిస్తే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఒక మంచి అవకాశం. అధికారం లేకపోయినా తానూ ప్రజల గురించి ఆలోచిస్తానన్న సంకేతాలిచ్చేందుకు, జగన్‌కు వచ్చిన అద్భుత-అరుదైన అవకాశం అది.
జగన్ కూడా .. నాటి విపక్ష నేత చంద్రబాబునాయుడు మాదిరిగా, సొంత ఖర్చులతో హిమాచల్‌ప్రదే శ్ బాధితులను విమానాలు, బస్సులో గమ్యస్థానాలకు చేర్చినట్లే.. జగన్ కూడా నే పాల్లో చిక్కుకున్న తెలుగువారిని సొంత ఖర్చుతో విమానాలు-బస్సులు ఏర్పాటుచేసి బాధితుల హృదయాలను కొల్లగొట్టవచ్చు. అందుకు ఆయన దగ్గర వేలకోట్ల రూపాయల సంపద ఉంది. జగన్ ఏమీ పేదవాడు కాదు. ఏరోజు బియ్యం ఆరోజు తెచ్చుకునే కడుపేద కానేకాదు.
ఆ పనిచేస్తే బాధితులతోపాటు, ప్రజలు కూడా.. గతంలో బాబును నెత్తినపెట్టుకున్నట్లే, గుండెల్లో పెట్టుకుంటారు. ఇలాంటి సేవా కార్యక్రమాలే విభజన తర్వాత టీడీపీ విజయశంఖారావానికి కారణమయింది. ప్రజల్లో స్వార్థపరులు ఉండవచ్చు. కానీ చేసిన మేలు మర్చిపోయేంత కృతఝ్ఞలు ఉండకపోవచ్చు.
కానీ జగన్ ఆ పనిచేయలేదు. బాధితులకోసం డబ్బు ఖర్చు పెట్టాలన్న సాహసం చేయలేదు. ఢిల్లీకి చేరిన బాధితులను సొంత ఖర్చులతో విమానంలోనో, బస్సుల్లోనో గమ్యస్ధానాలకు చేర్చాలన్న కనీస ఆలోచన రాలేదు. జగన్ దగ్గర పోగుపడిన సంపదతో పోలిస్తే ఆ ఖర్చులన్నీ పిపీలకం.. పిసరంత! కానీ జగన్ పక్కా రాజకీయ వ్యాపారస్తుడు! ‘అలా చేస్తే మనకు ఏం లాభం’ అన్నదే ఆయన కోణమంతా! !
ఇన్నెందుకు? ఏదైనా.. ఎవరికైనా.. సమాజం మీద ప్రేమ ఉండాలి. ‘‘మనకు ప్రజలు చాలా ఇచ్చారు. మనం ప్రజలకు ఏమిచ్చాం’’ అనే అంకితభావనం ఉండాలి. అదే జగన్-లోకేష్‌కు తేడా! అందుకే లోకేష్ జననేతగా మారారు. జగన్ పిసినారి నేతగా మరోసారి ముద్రపడ్డారు!! మీకు అర్ధమవుతోందా..?