– మంత్రి నారాయణ వెల్లడి
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైంది… స్వచ్ఛమైన తాగు నీరు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందులున్నా….స్వచ్చంద్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను ఏడాదిలోగా తొలగించాలని సీఎం నన్ను ఆదేశించారు. ఇప్పటివరకూ 81 లక్షల టన్నుల చెత్త తొలగించాం. సీఎం ఇచ్చిన టార్గెట్ అక్టోబర్ రెండో తేదీకి ముందుగానే 85 లక్షల టన్నుల తొలగిస్తాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మున్సిపాలిటీల్లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని 2014 లో నిర్ణయించాం. ఇప్పటికే ఉన్న రెండు ప్లాంట్ లకు అదనంగా త్వరలో కొత్తగా ఆరు ప్లాంట్ ల నిర్మాణం ప్రారంభం కానుంది.
ఈ ప్లాంట్ లు అందుబాటులోకి వస్తె ప్రతి రోజూ వచ్చే 7000 టన్నుల చెత్త లో 6500 టన్నుల చెత్త విద్యుత్ గా మారిపోతుంది. ఇది జరిగితే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అవుతుంది. రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటి నుంచి వచ్చే నీటిని ట్రీట్ మెంట్ ప్లాంట్ ల ద్వారా ట్రీట్ చేసిన బయటకు పంపిస్తాం. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ 100 శాతం స్వచ్ఛమైన తాగు నీరు కుళాయిల ద్వారా అందిస్తాం. కార్పోరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పనిచేస్తారని కోరుకుంటున్నాను అని మంత్రి నారాయణ అన్నారు.