– లోక్ సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం
– ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర వెల్లడి
తిరుపతి : లోక్ సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ నెల 14,15 న ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు, శాసనసభ కమిటీల జాతీయ సదస్సు” నిర్వహణపై స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు శుక్రవారం మద్యాహ్నం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ సూర్య దేవర పాత్రికేయులతో మాట్లాడారు. పార్లమెంటులో మహిళా స్వశక్తీకరణ కమిటీ ఒక జాయింట్ కమిటీ అని, ఇందులో 20 మంది లోక్ సభ సభ్యులు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారన్నారు. సాధారణంగా లోక్ సభ సభ్యుల్లో ఒకరు కమిటీకి ఛైర్ పర్సన్ గా ఉంటారని, ప్రస్తుతం పురందేశ్వరి ఈ కమిటీకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ, ముగ్గురు శాసన మండలి సభ్యులు, తొమ్మిది మంది శాసన సభ్యులతో పాటు, మన రాష్ట్రంలో సంయుక్త కమిటీ గౌరు చరితా రెడ్డి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారన్నారు.
గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంత తాముగా పని చేసుకుంటూ ఉండేదని, మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎలా పనిచేస్తున్నాయని ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకువెళ్లి అక్కడ జరుగు విషయాలను తెలుసుకునేవారన్నారు. ఆ రాష్ట్రం లో జరుగు కమిటీలలో వాళ్ళు అవకాశం ఇస్తే చర్చించి వాటిపై అవగాహన కల్పించుకుంటున్నట్టు తెలిపారు. ఈ లోపాన్ని పూరించడానికి లోక్ సభ స్పీకర్ ఈ సంవత్సరం కొత్తగా ఒక ఒరవడి మొదలెట్టారన్నారు. దేశంలో ఉన్న అన్ని కమిటీల్లో ఒకొక్క సబ్జెక్ట్ మీద ఒక రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్లతో కలిసి చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు.
ఈ క్రమంలో మొట్టమొదటి 2 నెలల క్రితం ఎస్టిమేట్ కమిటీ మీటింగ్ మహారాష్ట్ర లో గతనెలలో ఎస్.సి, ఎస్.టి కమిటీ మీటింగ్ భువనేశ్వర్లో జరిగిందని, మూడో సమావేశం మహిళా స్వశక్తీకరణ, మహిళా కమిటీల సంక్షేమ సమావేశం మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మధ్య జరగాలని, ముఖ్యమంత్రి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో లోక్ సభ ఆమోదం తెలిపిందన్నారు. లోక్ సభ మార్గదర్శకత్వంలో రెండు రోజుల పాటు సభలు ఉంటాయని తెలిపారు.
లోక్ సభ స్పీకర్ స్వయంగా ప్రారంభ సమావేశానికి, ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని, మన రాష్ట్రం నుండి మొదటి రోజు 14 వ తారీకు ఉదయం 10:30 కి సమావేశం ప్రారంభమౌతుందన్నారు. 15వ తారీకు ఉదయం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ హాజరవుతారనన్నారు.