– డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనరషిప్ విధానం ద్వారా ప్రైవేట్ వైద్య కళాశాలలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రముఖ వైద్యుడు, ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 16 వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో పేదలకు వైద్య విద్య దూరమవాల్సిందేనా? అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ దివంగత ఎన్టీ రామారావు నాడు ప్రైవేట్ రంగంలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తే, నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగంలో ప్రకటించిన 10 వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ఆర్థిక లబ్ధి, రాజకీయ లబ్ధి కోసం అనుమాయులకు కేటాయించాలని భావించటం క్షంతవ్యం కాదన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కళాశాలల్లో, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులల్లో రిజర్వేషన్లు అమలు కావని నీట్ పరీక్షలో 16 శాతం మార్కులు పొందిన వారికి కూడా లక్షలాది రూపాయల డొనేషన్ తో ఎంబిబిఎస్ సీట్లు కేటాయిస్తూ ప్రతిభకు పాతరేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్.ఆర్.సి.పి. విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పి. చైతన్య, ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజరజీ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి యశ్వంత్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, బిసి జన మహా సభ కన్వీనర్ ఉగ్గం సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. ప్రముఖ వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణ కమిటీని త్వరలో ప్రకటిస్తామని అందులో విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మేధావులు స్వచ్ఛంద సంస్థల నేతలు ఉంటారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రకటించారు.