ఇది విజయగాథే..
అయితే ఈ కథలో విజయం మాత్రమే కాదు.. అంతకు మించి చాలా..
ఒక మహిళ పోరాటం.. కూతురి కోసం ఓ తండ్రి పడిన ఆరాటం.. ఆ ఇద్దరి పంతం..
విజయం కోసం ఆమె ఎదుర్కొన్న సవాళ్లు..
అన్నిటినీ మించి ఒక మహిళ ధీరోదాత్త జీవితం..!
ఇంతకీ అసలు ఏం జరిగింది?
ఆమె ఎలా గెలిచింది?
ఆ గెలుపుతో ఏమేమి సాధించింది?
అదంతా చరిత్ర.. ఆధునిక పురాణం..
నిజానికి చరిత్ర కూడా సరిగ్గా చూపని ఘనత..
ఒక స్త్రీమూర్తి అందుకున్న గొప్ప విజయం..
తన చరిత్రను తాను రాసుకోవడమే గాక
చరిత్రనే తిరగరాసిన గొప్ప స్ఫూర్తిదాయక కథనం..
మొత్తంగా అయ్యసోమయాజుల లలిత జీవిత చరిత్ర!
ఆమెకు పదిహేనో ఏటనే పెళ్లి జరిగింది.. 19వ శతాబ్దం తొలిరోజుల్లో అది మామూలే..
ఇంకో మూడేళ్ళకే బొట్టు చెదిరింది.. ఆ కాలంలో అది కూడా మామూలే..
అప్పటికి ముక్కుపచ్చలారని ఆ ఇంతి ఒడిలో నాలుగు నెలల పసికందు..
ఆ రోజుల్లో చాలా మంది బాలవితంతువులు.. అలాగే ఇళ్లలో మగ్గిపోయేవారు..
కానీ..లలిత జీవితం అలా సాగిపోలేదు.. నాలుగు గోడలకే పరిమితమైపోలేదు..
భర్త మరణంతో ఆమె కథ ఇంట్లోనే ముగిసిపోలేదు..
నిజం..ఒక గొప్ప చరిత్రకు అప్పుడే శ్రీకారం జరిగింది.
లలిత తండ్రి.. ఎలక్ట్రికల్ ఇంజనీర్పప్పు సుబ్బారావు తన కూతురుని మామూలుగా
ఓదార్చి ఊరుకోలేదు..
కూతురు తెలివైనదని తండ్రిగా ఆయనకు తెలుసు..
ఒకరోజున ఆమె చెయ్యి పట్టుకుని ఆయన గిండి ఇంజనీరింగ్ కళాశాలలో
అడుగుపెట్టారు.అక్కడ అందరూ ఆ తండ్రీకూతుళ్లను ఆశ్చర్యంగా చూసారు..
ఎందుకంటే ఆ కళాశాలలో ఆడపిల్ల కనిపించడం అదే మొదటిసారి..కాసేపటి తర్వాత లలిత ఆ కళాశాలలో అడ్మిషన్ తీసుకుని ప్రిన్సిపాల్ గది నుంచి బయటికి వచ్చింది.
కట్ చేస్తే..
1943లో అదే కళాశాల నుంచి,
అదే లలిత..చేతిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టాతో సగర్వంగా బయటికి నడిచింది.
ఆ రోజుల్లో ఆ విజయానికి ప్రచారం లేదు..సన్మానాలు అంతకంటే లేవు.. అసలు గుర్తింపే లేదు.
అయితే లలిత ఏదీ పట్టించుకోలేదు.. స్త్రీలు పెద్దగా చదువుకోని.. అసలు ఆడదాన్ని
బయటకే రానివ్వని.. నాటి సమాజంలో.. వితంతువులు మరీ దిగ్బంధాలలో ఉండే ఆ కాలంలో.. అయ్యలసోమయాజుల లలిత..పప్పు వారి అమ్మాయి..
భారత దేశంలోనే తొలి మహిళా ఇంజనీర్..
ఆమె ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు..
అచిరకాలంలోనే.. ఆమె దేశంలోనే అతి పెద్ద డ్యాం
బాక్రానంగల్ కు విద్యుత్ పంపిణీ లైన్లు వేసిన ఘనత సొంతం చేసుకున్నారు.
ఆ విజయం తర్వాత లలిత కలకత్తాలోని ఎఇఐలో చేరి అక్కడ మూడు దశాబ్దాల
పాటు విశేష సేవలు అందించారు..
ఇక్కడ మరో విషయం చెపుకోక తప్పదు..
ఇంత గెలిచినా.. ఇన్ని సాధించినా నాటి కట్టుబాట్లను అనుసరించి లలిత కార్యస్థలాన్ని సందర్శించింది చాలా తక్కువ.. వితంతులు ప్రయాణాలు చెయ్యడానికి లేదు కదా.. ఆమె నాటి సంప్రదాయాన్ని గౌరవించింది..
తనకు బదులుగా తన మేధస్సుని ఫీల్డ్ కి పంపుతూ వచ్చింది. వ్యవస్థను మన్నిస్తూనే తన నిరసనను కార్యసాధనలో తన విజయాల ద్వారా
నిరసనను చూపించింది..
నినాదాలు లేవు..
రోడ్డెక్కి తిరగబడలేదు..
ఇదేంటని కనీసం
ప్రశ్నించలేదు కూడా..
నిదానమే విధానం..
విజయాలే సమాధానం..
పనిలోనే అవధానం..!
ఈలోగా..న్యూయార్క్ లో ప్రపంచ మహిళా ఇంజనీర్లు.. శాస్త్రవేత్తల సమ్మేళనం..
నిండుగా చీర కట్టుకుని అక్కడ ఒకే ఒక్క మహిళా ఇంజనీర్.. ఆమె మన లలిత..
అప్పటికీ మన దేశంలో చాలా మందికి ఆమె పేరే తెలియలేదు..
అయినా ఆ మహాతల్లి తాను భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తన పరిచయంతో మాత్రమే గాక కట్టుబాటును జయించిన..కట్టుబొట్టుతో.. ఆపై మేధస్సుతో ఘనంగా చాటింది..
అది 1966..
లండన్లోని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సంస్థలో పూర్తి స్థాయి సభ్యురాలిగా చేరింది..
అపుడు ఆమె ఘనత దేశంలోనే గాక ప్రపంచం మొత్తానికి తెలిసింది.
పురుషులు మాత్రమే ఉండే ఇంజినీరింగ్ ఉద్యోగంలో ఆమె ఉంది..!
ఉండడం మాత్రమేనా? పురుషుల్ని మించి విజయాలు సాధించింది.. భారత స్త్రీ శక్తికి ఆనాడే ప్రతీకగా నిలిచింది..
కట్టుబాట్లను ఎదిరించలేదు..
అలాగని వాటికి లొంగిపోలేదు..
వితంతుగా కృంగిపోలేదు..
సాధారణ స్త్రీగా ఉండిపోలేదు..
వంటింటి కుందేలుగా మిగిలిపోలేదు..
నిశ్శబ్దంగా యుద్ధం..
అంతకంటే నిశ్శబ్దంగా చదువు,
ఇంకా నిశ్శబ్దంగా విజయాలు..
అన్నీ లలితంగానే..
కష్టసుఖాల..మిళితంగానే..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
7995666286
9948546286