– సిజిహెచ్ఎస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.విద్య
గుంటూరు: ‘ స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ‘ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 న గుంటూరు నగరంపాలెం లోని సిజిహెచ్ఎస్ (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం) వెల్ నెస్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సిజిహెచ్ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. విద్య గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.
సిజిహెచ్ఎస్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్ అర్కా క్యాన్సర్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ముప్పై ఏళ్ళు నిండిన మహిళలకు పాప్ స్మియర్ పరీక్ష, బ్రెస్ట్ పరీక్ష చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. క్యాన్సర్ వైవిధ్యాల ఉనికిని ముందే పసిగట్టటానికి ఈ పరీక్షలు ఎంతో దోహద పడతాయని విద్య తెలిపారు.
మహిళల్లో గర్భాశయ, రొమ్ము కాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా, అవి ప్రమాదకరంగా మారక ముందే వివాహమైన ప్రతి మహిళ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ విద్య విజ్ఞప్తి చేసారు. గురువారం జరిగిన స్వచ్చత ర్యాలీ లో పాల్గొన్న మహిళలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు