– దుర్గ గుడి చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ
– ఆ పదవి ఆశించిన పవన్ ఓఎస్డీ తండ్రి సుబ్బారాయుడు
– రెండు నెలల క్రితమే జనసేనలో చేరిన ఆడిటర్ సుబ్బారాయుడు
– ఆయనకు చైర్మన్ పదవి సిఫార్సు చేసిన పవన్
– దానిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాపు సంఘాలు
– జిల్లా నేతలతో చర్చల తర్వాత బొర్రాను ఖరారు చేసిన కూటమి
– దాని బదులు హైదరాబాద్ టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనసేనకు సర్దుబాటు
– దానిని తెలంగాణ జనసేన నేత శంకర్‌గౌడ్‌కు ఖరారు
– ఇక కాపులకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రూట్ క్లియర్
(సుబ్బు)
అమరావతి: ప్రతిష్ఠాత్మకమెనై విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నియామకంపై ఉత్కంఠ వీడింది. ఈ దేవాలయ చైర్మన్ పదవి కోసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ-జనసేన దళపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సిఫార్సుల్లో.. ఎవరి మాట ఎవరి నెగ్గుతుందన్న ఉత్కంఠకు కూటమి లౌక్యంగా తెరదించింది. బాలకృష్ణ సిఫార్సు చేసిన బొర్రా రాధాకృష్ణకు దుర్గ గుడి చైర్మన్, హైదరాబాద్ హిమాయత్‌నగర్ టీటీడీ లోకల్ అడ్వైజరీ చైర్మన్ పదవిని పవన్ ప్రధాన అనుచరుడికి ఇచ్చి సమస్యను లౌక్యంగా పరిష్కరించింది.
కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు చైర్మన్ పదవులు ప్రకటించింది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం చైర్మన్‌గా బీజేపీకి చెందిన పోతుగుంట రమేష్‌నాయుడు, శ్రీకాళహస్తీస్వరస్వామి దేవాలయ చైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్, శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవాలయ చైర్మన్‌గా వి.సురేంద్రబాబు (మణినాయుడు), వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా ముదునూరి వెంకట్రాజును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో విజయవాడ కనక దుర్గ దేవాలయ చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ)ని నియమించింది. అయితే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల చైర్మన్ నియామకాలు ఒక ఎత్తయితే, విజయవాడ కనకదుర్గ దేవాలయ చైర్మన్ నియామకం మరో ఎత్తుగా మారింది. ఈ ఆలయ చైర్మన్ కోసం ఏకంగా బాలకృష్ణ-పవన్ కల్యాణ్ తమ సన్నిహితులకు సిఫార్సు చేయడమే దానికి కారణం. అటు బీజేపీ జిల్లా అద్యక్షుడు శ్రీరాం పేరును కూడా ఆ పార్టీ సిఫార్సు చేసింది.
పవన్ కల్యాణ్ తన వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కృష్ణతేజ మామ, ఆడిటర్- వైశ్య వర్గానికి చెందిన సుబ్బారాయుడు పేరు సిఫార్సు చేశారు. నిజానికి ఆయన రెండు నెలల క్రితమే జనసేనలో చేరారు. ఫలితంగా కాపుల్లో కూడా సుబ్బారాయుడు పేరు సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తమయింది. విజయవాడలో జనసేన జెండా మోసిన ఎంతోమంది కాపు నేతలు ఉండగా, తన వద్ద పనిచేసే అధికారి మామ గారి పేరును పవన్ సిఫార్సు చేయడం, కాపు సంఘాలకు మింగుడుపడలేదు. ఈ వ్యవహారం అటు తిరిగి కూటమి నాయకత్వానికి చేరింది.
బాలకృష్ణ-పవన్ ఇద్దరూ కీలకమైన నేతలే. ఎవరిని అసంతృప్తికి గురిచేసినా ఇబ్బందే. దానితో మధ్యే మార్గంగా.. దుర్గగుడి చైర్మన్‌ను బాలకృష్ణ సిఫార్సు చేసిన రాధాకృష్ణకు ఇచ్చి, ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ టీటీడీ లోకల్ బాడీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా, పవన్‌కు అత్యంత విధేయుడైన జనసేన తెలంగాణ నేత నేమూరి శంకర్‌గౌడ్‌కు ఇచ్చింది. పైగా శంకర్‌గౌడ్ జనసేన ఆవిర్భావం నుంచీ పవన్ వెంట నడుస్తున్నారు. జనసేన తెలంగాణ బాధ్యతను కూడా ఆయనకే కట్టబెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంలో పవన్ సూచించిన ఆడిటర్ సుబ్బారాయుడుపై కాపువర్గంలో పెల్లుబికిన వ్యతిరేకత కథ సుఖాంతం కావడానికి దోహదపడింది. అదే సమయంలో అటు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడం ద్వారా, పొత్తు ధర్మం నెరవేర్చినట్టయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని యువనేత లోకేష్ చాకచక్యంగా పరిష్కరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కాపులకే!
తాజాగా విజయవాడలోని అతి పెద్ద దేవాలయమయిన దుర్గగుడి చైర్మన్ పదవిని, కమ్మ సామాజికవర్గానికి కేటాయించటంతో.. ఇక ఎన్డీఆర్ జిల్లా టీడీపీ అద్యక్ష పదవి, కాపులకు ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఇప్పటివరకూ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా కమ్మ వర్గానికే ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దుర్గగుడి చైర్మన్ పదవిని కమ్మ వర్గానికి కేటాయిచటంతో.. కులసమీకరణ కోణంతోపాటు, కాపు వర్గాన్ని మెప్పించేందుకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వడం అనివార్యంగా మారింది.
విజయవాడలో దశాబ్దాల నుంచి నెలకొన్న కమ్మ-కాపు రాజకీయాలు.. తాజాగా జనసేనతో పొత్తు నేపథ్యంలో, జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కులసమీకరణ కోణంలో నిర్ణయించి, సామాజికన్యాయం చేయడం కూటమి బాధ్యత అని కాపు సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు.