– బీఆర్ఎస్ ఆఫీస్‌లో బతుకమ్మ పాటల విడుదల
– బతుకమ్మ ఆడిన బీఆర్ఎస్ మహిళా నేతలు
-తొలిసారి కవిత ఆన.. ఆనవాళ్లు లేకుండానే బతుకమ్మ సంబరం
(మార్తి సుబ్రహ్మణ్యం)
అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు కళ్లెదుటే కనిపిస్తాయి. కానీ అవి నిఝంగా నిజాలే! చూసి మనమూ ఆశ్చర్యపోవాలంతే! ‘తెలంగాణ పితామహుడు’ కేసీఆర్ ప్రాణం పోసిన టీఆర్ఎస్/బీఆర్ఎస్లో, బతుకమ్మ మాట-పాట వినిపించినా.. బొమ్మ కనిపించినా, అది ఖచ్చితంగా కవితక్కనే-కవితక్కదే అయి తీరాలి.
గతంలో గులాబీ గళధారులు చెప్పినట్లు అసలు బతుకమ్మను బయటకు తీసి, దాని విశిష్ఠతను ప్రపంచానికి పరిచయం చేసి, బతుకమ్మను ‘ప్రమోట్’ చేసిందే కల్వకుంట్ల కవితనాయె. ఇంకా చెప్పాలంటే దుబాయ్‌లోని బుర్జు ఖలీఫాపై కేసీఆర్‌తో కూడిన బతుకమ్మను ఆవిష్కరించిన వీరానారి. మరి అంతటి పవర్ఫుల్ నాయకురాలు లేకుండానే.. ఆమె ఆన.. ఆనవాళ్లు లేకుండానే.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో, బతకమ్మ సంబరాలు జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారా? నో.. నెవ్వర్! కానీ విజయవంతంగా జరిగాయి!! అదే ఆశ్చర్యం. ముందే చెప్పినట్లు.. కొన్ని ఆశ్చర్యాలను అలా చూస్తుండాలంతే!
తెలంగాణ ఉద్యమంలో అందరిదీ ఒక పోరాటమైతే.. కవితక్కది భిన్నమైన సాంస్కృతిక పోరాటం. నిజానికి ఆమె పార్టీలో అడుగుపెట్టేవరకూ కవిత కేవలం కేసీఆర్ బిడ్డగానే ప్రపంచానికి తెలుసు. ఏమాటకామాట.. ఎంట్రీ కేసీఆర్ బిడ్డగానే ఇచ్చినప్పటికీ, తర్వాత తానేమిటో నిరూపించుకున్న నాయకురాలామె. అనర్గళ ప్రసంగం, పదునైన ప్రసంగాలు, సూటి విమర్శలు..ఆంథ్రా వారి ఆచారాలు-కట్టుబొట్లపై విమర్శనాస్త్రాలు. సేమ్ టు సేమ్ కేసీఆర్ అన్నట్టు! కేటీఆరూ అంతే!! వారికి తెలంగాణ అన్నీ నేర్పింది. తెలంగాణను చూసి వారూ నేర్చుకున్నారు. కాకపోతే కేసీఆరు పేరు అక్కరకొచ్చిందంతే.
ఆ క్రమంలో ఆమె మస్తిష్కం నుంచి ఆవిర్భవించిన ఆలోచనే బతుకమ్మ. నిజానికి అప్పటివరకూ బతుకమ్మ పండగ దసరాల్లో తెలంగాణ పల్లెలకు మాత్రమే పరితమైన ఓ జ్ఞాపకం. నిజాం వందిమాగధ రజాకార్లు చెరపట్టిన, మహిళల ఆవేదనను గుర్తు చేసుకుని.. అందరూ బతకాలని కోరుకునే పండగ. ఆ పాటల్లో మానవ సంబంధాలు, జీవితాలు దర్శనమిస్తాయి.
అందులో తెలంగాణ భాష తియ్యదనం ఉంది. బతుకును పూజించే పండగయిన బతుకమ్మ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు చిరునామా. అలాంటి ఉత్కృష్టమైన తెలంగాణ పండగను, కవిత రాజకీయ వ్యూహంతో తన సొంతం చేసుకున్నారు. ఉద్యమ సమయంలో దానిని జనం మధ్యకు చేర్చారు. అలా సెంటిమెంటును, ఉద్యమానికి అనుబంధం-అనుసంధానం చేసి భావోద్వేగాలను వెదజల్లారు. బతుకమ్మను మర్చిపోయిన నేటి తరంతో బతుకమ్మ ఆడించారు. అప్పట్లో కాలేజీ యువ త గద్దర్ తెలంగాణ పాటలకు ఉర్రూతలూగిపోతే, మహిళలు బతుకమ్మ చుట్టూ నాట్యమాడారంటే పాట ప్రభావం ఎంతో సుస్పష్టం.
ఇక అక్కడి నుంచి ఐటీ యువతకు సైతం బతుకమ్మ ఆడటం అలవాలటయింది. అది నిస్సందేహంగా కవిత ప్రభావమేనన్నది నిష్ఠుర నిజం. హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్లు ఉండే కాలనీల్లోనూ వారితో బతుకమ్మ ఆడించేలా చేసిన ప్రభావం అది. చివరాఖరకు అది.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆంధ్రా మహిళలు సైతం బతుకమ్మ ఆడి, అమ్మవారికి బోనం సమర్పించేంత ప్రభావం అప్పుడు!
అంతేనా? దుబాయ్‌లో బుర్జు ఖలీఫా ఖరీదైన సెంటర్. దానిపై కేసీఆర్ బొమ్మతో బతుకమ్మను ఆవిష్కరించిన కవిత.. తెలంగాణలో ‘తానూ విస్మరించడానికి వీల్లేని నాయకురాలిన’ని నిరూపించుకున్నారు. అంటే కవిత ఉద్థానం ఒక్క రాత్రితోనో, కేసీఆర్ బిడ్డ అన్న వారసత్వంతోనే వచ్చింది కాదన్నది సుస్పష్టం.
అలాంటి కవితక్క ఇప్పుడు బీఆర్ఎస్కు ఏమీ కాని అనాధ. ఆ పార్టీతో.. బతుకమ్మ ఆడిన అక్కడి నేతలతో ఏ బంధం లేని నాయకురాలు. తాను ‘ప్రమోట్’ చేసిన బతుకమ్మను.. తాను శాసించిన పార్టీ ఆఫీసులోనే వేరే అక్కలు ఆడుతుంటే అర్ధనిమీలితనేత్రాలతో ఆవేదనాభరితురాలై ప్రేక్షకపాత్ర పోషించాల్సిన వైచిత్రి.
బతుకమ్మ సందర్భంగా.. తెలంగాణ సీఎం రేవంత్ సర్కారు వైఫల్యాలను జనబాహుళ్యంలోకి తీసుకువె ళ్లేందుకు, గులాబీ పార్టీ మూడు పాటలను రూపొందించింది. ఆ సీడీలను పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించి బతుకమ్మ ఆడి పండగ చేసుకున్నారు. ఆ పండగలో కవితక్కలేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఒకప్పుడు కవితక్కతో ఆడి పాడేందుకు పోటీ పడిన ఆ మహిళలే.. మొన్నామధ్య, అదే కవితక్క తిరుగుబాటుపై విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో విధేయతకు ప్రాతిపదిక అంటూ ఉండదు. ఆ ప్రకారంగా.. కవితక్క ఆన.. ఆనవాళ్లు.. ఊసు.. ఉత్సాహం లేని బతుకమ్మ సందడికి, టీఆర్ఎస్ భవన్ వేదికయింది.