– సమర్థ నీటి నిర్వహణతోనే అభివృద్ధి సాధ్యం
– ప్రాధాన్యత క్రమంలో రాయలసీమ-ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి
– సాగు నీటి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన గత పాలకులు
– నదుల అనుసంధానంతోనే అందరికీ లబ్ది
– పీపీపీ విధానమంటే ప్రైవేటీకరణ కాదు
– అసెంబ్లీలో సాగునీటి రంగంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
– గత పాలకుల నీటి డ్రామాలను సభలో ప్రదర్శించిన సీఎం
అమరావతి: సమర్థ నీటి నిర్వహణ తో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందనేది వివరించారు. అలాగే భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నామనేది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇరిగేషన్ రంగానికి సంబంధించిన అంశంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో పాటు.. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగంలో ఆడిన డ్రామాలపై రూపొందించిన వీడియోను ముఖ్యమంత్రి సభలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”ఏపీలో 1.06 కోట్ల ఎకరాలకు నీటిని అందిస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం ఐదేళ్లలో రూ. 60 వేల కోట్లను జలవనరుల శాఖకు ఖర్చు చేస్తాం. 94 శాతం రిజర్వాయర్లలో నీళ్లు నింపిన జలవనరుల శాఖకు అభినందనలు. 1040 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. వాటర్ యూజర్స్ కమిటీలకు కూడా కూటమి అధికారంలోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించి ప్రతినిధుల్ని నియమించాం. రాష్ట్రంలో భూగర్భ జలాలను కూడా పెంచడానికి చర్యలు చేపట్టాం. ఈసారి 2.1 శాతం వర్షపాతం తక్కువగా పడింది.
అయినా నీటి నిర్వహణ వల్ల గతంతో పోలిస్తే 1.5 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం 8.43 మీటర్ల మేర భూగర్భజలాలు ఉన్నాయి. భూగర్భంలో 697 టీఎంసీల నీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను నింపాలి. భూగర్భ జలాలను రీఛార్జి చేసుకోవాలి. నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుంటే కరవు అనే మాట రాష్ట్రంలో ఉండదు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూటమి తీసుకుంటుంది.” అని సీఎం చెప్పారు.
గత పాలకులు పట్టిసీమ వద్దన్నారు… పోలవరాన్ని నాశనం చేశారు
“రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. జూన్ 2 తేదీ కంటే ముందే 7 ముంపు మండలాలను కలపాలని ప్రధానిని కోరాను. పార్లమెంటు సమావేశాని కంటే ముందు ముంపు మండలాలు కలుపుతూ ఆర్డినెన్సును తెచ్చాం. ఆ నిర్ణయంతోనే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లింది. భూసేకరణ, కాంట్రాక్టుల వివాదాలు, కుడి కాలువ లాంటి సమస్యలను దాటుకుని 2019 నాటికి 72 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశాం.
స్పిల్ వే, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్ పనులు, కుడి కాలువ పనులు వంద శాతం పూర్తి చేశాం. గతంలో రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించాం. గత పాలకుల అసమర్థత వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకు పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక… మళ్లీ రూ. 1000 కోట్లతో కొత్తగా మళ్లీ నిర్మిస్తున్నాం. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పనుల్ని రూ. 960 కోట్లతో చేపడుతున్నాం. దీనిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం. రూ.894 కోట్ల నిధులు నిర్వాసితులకు నిధులు ఇచ్చాం.
2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు 3.84 శాతం మాత్రమే. 2021కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 7 ఏళ్లు వెనక్కు నెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లింది మనమే. ఐదేళ్ల పాటు పోలవరం పనులను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తాం. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 439 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించాం. పొదుపు చేసిన నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించి నీరిచ్చాం. గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను వినియోగించలేదు.
ప్రజాధనంతో కట్టిన పట్టిసీమను వాడకుండా వదిలేశారు. టీడీపీ ప్రభుత్వంలో పట్టిసీమ కట్టారని… దాని తాము వాడడం ఏంటనే అహంభావంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రెండేళ్ల పాటు అసలు నీటిని తరలించలేదు. మూడో ఏడాది కరువు వస్తే.. ఇంకా నీటిని విడుదల చేయకుంటే తంతారని పట్టిసీమ ప్రాజెక్టును వినియోగించారు. బేషజంతో ప్రభుత్వ ఆస్తులను వినియోగించకుండా ప్రజలను, రైతులను నష్టపరిచే ప్రయత్నం చేశారు. టీడీపీకి పేరు వస్తుందనే పట్టిసీమను ఐదేళ్లలో వినియోగించలేదు. ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో మొదలుపెట్టి విధ్వంసంతోనే ఓడిపోయారు.” అని చంద్రబాబు వివరించారు.
హంద్రీ-నీవాతో సీమలో హర్షం
“1987లో ఎన్టీఆర్ సంకల్పించిన హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల నీటిని తరలించి చిట్టచివరి ప్రాంతానికి తీసుకెళ్లాం. వంద రోజుల్లోనే రూ. 3800 కోట్లను మంజూరు చేసి 3850 క్యూసెక్కుల నీటిని పారిస్తున్నాం. పులివెందుల చెరువుకు కూడా నీటిని కూటమి ప్రభుత్వమే ఇస్తోంది. హంద్రీ-నీవాపై ఇప్పటి వరకూ రూ.13 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టాం. 40 టీఎంసీల మేర నీటిని తరలించుకోవచ్చు. 497 చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నాం. రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటిని నింపేలా ప్రణాళికలు చేసుకున్నాం.
ఆగస్టు 30 తేదీన కుప్పానికి నీళ్లిచ్చి జలహారతి ఇవ్వటంతో నా జన్మ సార్ధకం అయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు వేరు శనగ విత్తనాలు వేస్తే ఖర్చు కూడా రాని పరిస్థితి ఉండేది. నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. అలాంటి ప్రాంతానికి నీటిని తరలించేలా చేశాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉత్తరాంధ్ర-రాయలసీమ అభివృద్ధే లక్ష్యం…
“ఉత్తరాంధ్రలో రూ.185 కోట్ల ఖర్చు చేస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పనులు పూర్తి అవుతాయి. తోటపల్లి తారకరామ తీర్ధసాగర్, మహేంద్ర తనయ, హిర మండలం, వంశధార-నాగావళి మద్దువలస, నాగావళి-చంపావతి, జంఝావతి, గండిగెడ్డ ప్రాజెక్టులు రూ.2097 కోట్లు వ్యయం అవుతుంది. కొత్త ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలకు నీరివ్వటంతో పాటు ఇప్పటికే ఉన్న 2 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. రెండేళ్లలో వీటిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తాం.
రాయలసీమలో అప్పర్ పెన్నా, పేరూరు రిజర్వాయర్, భైరవానితిప్ప హంద్రీనీవా నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, నీవా బ్రాంచ్ కెనాల్, కల్యాణి డ్యామ్ తో పాటు గాలేరు నగరి ద్వారా కడప… రాజంపేట వరకూ నీళ్ళు తీసుకెళ్తాం. మొత్తం రూ. 7803 కోట్లను ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాయలసీమకు నీళ్లిచ్చి రతనాల సీమగా మారుస్తాం.” అని సీఎం వెల్లడించారు.
గత పాలకులు నీటి వ్యవస్థలను దెబ్బ తీశారు
“ఎత్తిపోతల ప్రాజెక్టులను ధ్వంసం చేసింది గత ప్రభుత్వం. 613 స్కీములు డీఫంక్ట్ అయ్యాయి. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పరిస్థితి ఉన్నా ఇవ్వలేకపోయింది. ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద 8.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలోనే 2.97 లక్షల ఎకరాలు స్థిరీకరించాం. రూ.725 కోట్లు వ్యయం చేసి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఈ ఏడాదే ఆపరేషన్ లోకి తీసుకువచ్చి నీళ్లిస్తాం. 2019-24 మధ్య సాగునీటి రంగాన్ని ధ్వంసం చేశారు. కాలువలు, వరదగట్లు దెబ్బతిన్నాయి.
ఫించ, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం బాధితుల్ని పరామర్శించ లేదు. గుండ్లకమ్మ గేటు కొట్టుకు పోయింది. ఆ గేటును కూడా పెట్టలేకపోయారు. ప్రాజెక్టులను నిర్మించటం ఎంత ముఖ్యమో దాన్ని నిర్వహించటం కూడా అంతే ముఖ్యం. డ్యాములు, గేట్ల నిర్వహణకు ఓ మాన్యువల్ తయారు చేశాం. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ చేశాం. కానీ గత పాలకులు ఐదేళ్లూ దాన్ని పక్కన పెట్టేశారు.
ప్రాజెక్టులను ధ్వంసం చేశారు. తుంగభద్ర గేట్లు దెబ్బతిన్నాయి. దానిని పునరుద్దరిస్తున్నాం. శ్రీశైలం డ్యామ్ లో స్పిల్ వే ప్రొటెక్షన్ కోసం రూ.204 కోట్లు, ధవళేశ్వరం బ్యారేజీ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గుండ్లకమ్మ గేట్లు పూర్తి చేశాం. సోమశిల ప్రాజెక్టులో మరమ్మత్తులు కూడా వచ్చే సీజన్ నాటికి పూర్తి చేస్తాం.” అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వాళ్లు చేసిన తప్పులకు మేం ఫైన్లు కట్టాం
“విధ్వంసమైన రాజకీయాలు చేస్తూ ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి. చిత్తూరు జిల్లాలో త్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మిస్తామని రూ. 2144 కోట్ల అంచనాతో ప్రాజెక్టు టేకప్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని… ఎన్జీటీ జరిమానా వేసింది. వాళ్లు చేసిన తప్పుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.25 కోట్లు జరిమానా కట్టాల్సి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఎన్జీటీ పనులు నిలిపేసింది.
నిలిచిపోయిన ప్రాజెక్టు కోసం రూ. 923 కోట్ల ఖర్చు పెట్టారు. వెలిగొండలో పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు డ్రామాలు ఆడారు. మేం దాన్ని పూర్తి చేస్తాం. రూ.2059 కోట్లను ఖర్చు చేసి వచ్చే ఏడాది జూలై నాటికి వెలిగొండ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రకొండ పాలెం తదితర ప్రాంతాలకు నీళ్లిస్తాం. వరికెపుడిశెల ప్రాజెక్టుకు త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం.” అని చంద్రబాబు చెప్పారు.
నదుల అనుసంధానం చేసి తీరతాం
“దేశంలో నదుల అనుసంధానం చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందని చెబితే సురేశ్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపడతారు. ఆ తర్వాత గంగా కావేరిని అనుసంధానించే ప్రక్రియ చేపడతారు. అందుకే దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కృష్ణా-గోదావరి నదుల నుంచి ఈ సీజన్ లో ఇప్పటికి వరకూ 3782 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా వెళ్లాయి. ఒక్క గోదావరి నుంచే 2882 టీఎంసీల నీరు, కృష్ణా నుంచి 892 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. గోదావరి నుంచి రోజూ 50 టీఎంసీలు, కృష్ణాలో రోజూ 24 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి కలిసిపోతున్నాయి.
ఈ ఏడాది మొత్తంగా గోదావరి నుంచే 5 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని అంచనా. ఇలాంటి సమయంలో 200 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి బనకచర్లకు తీసుకెళ్తే… రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అన్ని రాష్ట్రాలు అంతర్గతంగా తమ రాష్ట్రాల్లోని నదులు అనుసంధానం పూర్తి చేస్తే ప్రపంచానికే ఆహార ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వంశధారలో వరద వస్తే పెన్నా నది ద్వారా సోమశిల, కండలేరులో నీటి నిల్వ చేసుకునేలా పరిస్థితి వస్తుంది. వంశదార- నాగావళి నదులను అనుసంధానిస్తాం.
గోదావరి నుంచి కృష్ణా నీళ్లను పొదుపు చేసుకుని ఇతర ప్రాంతాలకు వాడుకోవచ్చు. కావాల్సింది విద్వేషాలు కాదని పోరుగు రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి. సముద్రంలోకి వెళ్లే నీళ్లు సద్వినియోగం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలకే ప్రయోజనం కలుగుతుంది. నీళ్లు సద్వినియోగం చేసుకుంటేనే మన అభివృద్ధి సాధ్యం. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీళ్లిస్తేనే ఎక్కువ తృప్తి కలుగుతుంది.” అని సీఎం చెప్పారు.
భూగర్బమే జలాశయం
“భూగర్భాన్ని జలాశయంగా మార్చుకుని ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో 202 గ్రామాల్లో 20 మీటర్ల కంటే దిగువన నీరుంది. ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. ఏపీ రిమ్స్ పోర్టల్ ద్వారా అవేర్ ద్వారా రియల్ టైమ్ లో నీటి నిల్వలు ఇతర అంశాలపై సమాచారం సేకరిస్తున్నాం.
సెన్సార్ల ద్వారా రిజర్వాయర్లలో నీటి నిల్వల్ని, రెయిన్ గేజ్ లు ద్వారా వర్షపు నీరు, సాయిల్ మాయిశ్చర్ లాంటి అంశాలను తెలుసుకుంటున్నాం. రిజర్వాయర్లు , ఫ్లడ్ మేనేజ్మెంట్, గ్రౌండ్ వాటర్ తో రియల్ టైమ్ లోనే సమర్ధ నీటి నిర్వహణ చేస్తున్నాం. సాగునీటికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి భద్రత కల్పిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇది కియా కార్ల ఫ్యాక్టరీవిషయంలో నిజమైంది.
బెదిరింపులతో సంస్కరణలు ఆగవు
“మెడికల్ కాలేజీలపై కూటమి తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికీ నష్టం జరగదు. గతంలో మెడికల్ కాలేజీలు పెట్టి పేమెంట్ కోటా పెట్టారు. ప్రభుత్వంలో మేనేజ్మెంట్ అన్నారు. పీపీపీకి ఇస్తే సమర్ధవంతంగా సేవలు అందుతాయి అన్ని సీట్లు ఉంటాయి. నాణ్యత ఉంటుంది. పేదలకూ ఉచిత సేవలు అందుతాయి. హైవేలను పీపీపీ విధానంలో నిర్మించారు. అలా అని ఆ హైవేలను నిర్మించిన వారికి ఇచ్చేసినట్టా…? ఆ ఆస్తి ప్రభుత్వానిదే. ప్రభుత్వమే వాటి యజమాని. నిర్మాణం చేపట్టి… రోడ్లను మెయిన్ టెన్ చేసి… గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఎవరు అడ్డం పడినా మంచి నిర్ణయాలను ఆపేది లేదు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.