అంతకు ముందు
ఆమె ఏదైతే మనకేమి..
తను స్వచ్ఛమైన తులసి..
శంకరుని ఆభరణమై..
విశ్వనాధుని వశీకరణమై..
పూర్ణోదయ
విజయతోరణమై..
అచ్చ తెనుగు సినిమాకి
అసలు సిసలైన వ్యాకరణమై..!
ఆరడుగుల మంజుభార్గవి..
మునుపు నగేష్ తో కూడి సోగ్గాడు శోభనాద్రిని ఇడుముల పాల్జేసినా..
ఎన్టీవోడి పాటకు తగినట్టు
ఆడిన అందాల సురభామిని..
చాటుతూ కళలన్ని
ఒకటేనని..
ఆమె సొంపులు
వాంపు పాత్రలకే పరిమితం..
అయితే కళాతపస్వి కన్నుపడి ఫలించిన
ఆమె తపస్సు..
శంకరాభరణంతో
అంతులేని యశస్సు..!
నటవారసత్వం లేకపోయినా
కళాసరస్వతి ఆశీస్సులు
మెండుగా..
అందుకే శంకరాభరణంలో
మెరిసింది తెర నిండుగా..
తులసిగా ఎగసి..
సంప్రదాయంతో మెరిసి..
ఈ జన్మకిది చాలని మురిసి..
చాన్నాళ్లు సినిమాకి దూరం..
మళ్లీ వచ్చింది
ఆలీకి అమ్మగా..
అమ్మతనాన్ని నిండారా
ఒలకబోసింది కమ్మగా..!
నిజంగా శంకరాభరణం
మంజుభార్గవి
అభినయ పరాకాష్ట..
ఆమె నృత్యం
ఆ సినిమాకి పెద్ద ప్లస్సన్నది
జగమెరిగిన సత్యం..
రాగం తానం పల్లవి…
నా మదిలోన కదలాడి
కడతేరమన్నవి..
అదరగొడితే బాలు గళం..
ఆమె నర్తన సుమంగళం..!
పురోహితుడికి నత్తి..
మనకి భక్తి..
పనికిరావని తల్లి జమీందారుకి తార్చితే
తనను చెరచినందుకు మించి
తన ఇష్టదైవం ఫోటోని తన్నినందుకు ఆగ్రహించి..
ఒక్క వేటుతో కామాంధుని
పరిమార్చి ఆతడి రక్తంతో
శాస్త్రి పాదాలు ప్రక్షాళన చేసిన సన్నివేశంలో
ఆమె అభినయ భార్గవి..
ప్రేక్షకలోకం ఆనందభైరవి..!
కొడుకులో గురువుని చూసి ఉప్పొంగిన నాట్యమయూరి
సీతాపతి నాపై నీకభిమానము లేదా..
ఆంటూ మురిసిన వైనం..
నాదాత్మకుడవై
నాలోన చెలగి..
నా ప్రాణదీపమై
నాలోన వెలిగే..
అక్కడ మాటలు లేని మౌనం
మంజుభార్గవి వంతు..
జనం నీరాజనంతో
ఆమె జీవితం
శతమానం భవతు..!
శృతిలయలే
జననీజనకులు కాగా..
భావాల రాగాల తాళాల తేలి
శ్రీచరణ మందార మధుపమై..
మంజుభార్గవి..
తెలుగు సినిమా యవనికపై
తులసిగా సదా
గుర్తుండిపోయే
సింధుభైరవి..!
– సురేష్
9948546286
7995666286