– అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ధన్యవాదాలు
– వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి: దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ నూతన సంస్కరణల వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటివరకు ఉన్న18 శాతం జీఎస్టీని తొలగించినందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే జీఎస్టీ నూతన సంస్కరణల కారణంగా క్యాన్సర్, అరుదైన ఇతర వ్యాధుల (33 రకాల) మందులు, సర్జరీలకు సంబంధించిన పరికరాల ధరలు కూడా తగ్గినట్టు తెలిపారు. వ్యాక్సిన్లు, హెచ్ ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్జిక్ కిట్ల రేట్లు కూడా తగ్గాయని తెలిపారు.
వీటి అవసరం కలిగిన వారికి ఆర్థికంగా ఉపశమనం కలుగనుందని ఆదివారం మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వ నూతన జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ శాసనసభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన ప్రసంగాలు, ఏకగ్రీవ తీర్మానానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గవర్నమెంట్ అమలు చేసే బీమా విధానానికి 2018 నుంచే జీఎస్టీ మినహాయించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రoలో త్వరలో అమలు చేయబోయే నూతన యూనివర్సల్ హెల్త్ పాలసీతో అదనoగా ఆర్థిక భారం పడదని తెలిపారు.
చిరు వ్యాపారులకూ ఊతం
”కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుల శ్లాబులను తగ్గించాలనే నిర్ణయం సాహసోపేతమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరట కలిగిస్తుంది. ప్రధానంగా చిరు వ్యాపారులకు పన్నుల భారం లేకుండా వారి ఆర్థిక ప్రగతికి ఊతమిస్తూ తీసుకున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సాహసోపేత నిర్ణయం అభినందనీయం.
కేంద్రంలో ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం పేద, సామాన్య,మ మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని, ఈ నిర్ణయంతో మరో సారి స్పష్టమైంది.” అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు