– గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117తో 10 లక్షల మంది పేదలు విద్యకు దూరం
– ప్రత్యామ్నాయంగా వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని తీసుకువచ్చాం
– ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం
– శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల వెలుపల నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వంద పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు. రాష్ట్రంలోని 42వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదేవిధమైన పరిస్థితి తీసుకువచ్చేలా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.
శాసనసభలో గత ప్రభుత్వం విడుదల జిఓ 117పై నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… ప్రాథమిక విద్యకు గొడ్డలిపోటులా పరిణమించిన జిఓ నెం.117, జిఓ నెం. 85లను 13-5-2025న రద్దుచేశాం. వాటి స్థానంలో వన్ క్లాస్ – వన్ టీచర్ ఉండేలా జి.ఓ. నెం.19,20,21 ద్వారా చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెం.117 కారణంగా 10లక్షలమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల లెర్నింగ్ అవుట్ కమ్స్ లో రాష్ట్రం వెనుకబడింది.
ప్రాథమిక విద్యకు తీవ్రనష్టం కలిగించే 117 జిఓ రద్దుచేయాలని పాదయాత్రలో పలువురు ఉపాధ్యాయులు నన్ను కోరారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నతాధికారులతో 33 సమావేశాలు ఏర్పాటుచేసి, జిఓ నెం. 117 రద్దుచేసి, ప్రత్యామ్నాయ జిఓలు తెచ్చాం. అందుకు ప్రత్నామ్నాయంగా వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకముందు కేవలం 1398 స్కూళ్లలో మాత్రమే వన్ క్లాస్ – వన్ టీచర్ ఉండగా, మేం వచ్చాక 9620 పాఠశాలలకు పెంచాం. అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించి గతంలో కేవలం 124 మాత్రమే ఉండగా, ప్రజాప్రభుత్వం వచ్చాక 729 పాఠశాలలను అప్ గ్రేడ్ చేశాం.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను దేశానికే మోడల్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. మన బడి – మన భవిష్యత్తు కింద ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి దాతల ద్వారా పారదర్శక విధానంలో ఎస్ఎంసిల పర్యవేక్షణతో వివిధ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
దాతలు అందజేసే నిధులను బట్టి ఆయా పాఠశాలలకు వారి పేర్లు పెట్టే ప్రతిపాదన కూడా ఉంది. పాఠశాలలకు ఇప్పటికే స్టార్ రేటింగ్ ఏర్పాటుచేశాం. వన్ స్టార్, 2స్టార్ పాఠశాలలను మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత శాసనసభ్యులపై ఉంది. మౌలిక సదుపాయాలతోపాటు అటెండెన్స్, ఎగ్జామ్స్, పెర్ఫార్మెన్స్, లెర్నింగ్ అవుట్ కమ్స్ పై కూడా శ్రద్ధ పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలల కన్నా మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషిచేస్తున్నాం.
విద్యార్థులు చదివే ప్రాథమిక పాఠశాలలు కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంటే రవాణా ఖర్చు కింద నెలకు రూ.600 చొప్పున 10నెలల పాటు తల్లిదండ్రుల అకౌంట్ లో జమచేస్తాం. ఈ ఏడాది దాదాపు 70వేల మంది విద్యార్థులకు ఈ రవాణా చార్జిలను అందజేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.