– పొలాల్లో కెమికల్స్ వ్యర్ధాలు పారబోసిన క్రెబ్స్ కెమికల్
– కేకేఆర్ ట్యాంకర్ల ద్వారా రవాణా
– దానిపై ‘సూర్య’ కథనం
– స్వయంగా పరిశీలించిన పీసీబీ చైర్మన్ కృష్ణయ్య
– విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమ ఫిర్యాదు
– క్రెబ్స్‌పై చర్యలు తీసుకోవాలని లేఖ
– హైకోర్టులోనూ కేసు
– ఆ తర్వాత రంగంలోకి క్రెబ్స్ రాయబారులు
– చక్రం తిప్పిన నాటి పీసీబీ ఇంజనీర్?
– కేసు తీవ్రత తగ్గించేందుకు పావులు కదిపిన వైనం
– ఆయన నాటి సీనియర్ ఐఏఎస్ క్లాస్మేట్
– రిటైరయినా మళ్లీ పీసీబీలో చేరే యత్నం
– ఉద్యోగుల వ్యతిరేకతతో ఆగిన ప్రతిపాదిన
– పీసీబీ పెద్దలకు ఆయనే సలహాదారట
– దానితో బెజవాడ చేరిన రాయబారం కథ
– క్రెబ్స్‌ను వదిలేయాలని పీసీబీకి ఎమ్మెల్యే ఒత్తిడి
– విశాఖ ఫార్మా, కెమికల్ కంపెనీలను శాసించిన మాజీ అధికారి
– మెంబర్ సెక్రటరీ అధికారాలకు కత్తెర?
– అందుకే ఆయన ఆఫీసుకు రావడం లేదా?
(సుబ్బు)
ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీలో చర్చనీయాశంగా మారిన క్రెబ్స్ కెమికల్ వ్యవహారంలో తెరవెనుక ఏం జరిగింది? అప్పట్లో ఆ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిందెవరు? అప్పట్లో పీసీబీలో చక్రం తిప్పిన రిటైర్డు ఇంజనీరు పాత్రేమిటి? విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ.. ముందు ఫిర్యాదు చేసిన అదే కంపెనీని, మళ్లీ వదిలేయాలన్న ఒత్తిడి వెనుక ఎవరున్నారు? ఇదీ ఇప్పుడు అసెంబ్లీ, పీసీబీ వర్గాల్లో హాట్ టాపిక్.
క్రెబ్స్ కెమికల్ కంపెనీ తాను ఉత్పిత్తి చేసిన వ్యర్థ రసాయనాలను శుద్ధి చే యకుండా, గన్నవరం సమీపంలోని ఓ గ్రామంలోని పొలాల్లో పారబోసిన వైనం మీడియాలో రచ్చయింది. దానిపై తొలిసారి ‘సూర్య ’లో కథనం వెలువడగా, అటు పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య కూడా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి క్రెబ్స్కు నోటీసులిచ్చి, కంపెనీని క్లోజ్ చేయించారు.
దానికంటే ముందు ఈ ఉల్లంఘనపై ‘సూర్య ’లో కథనం రావడంతో స్పందించిన విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ దానిపై అసెంబ్లీలో ప్రస్తావించగా, తనయుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని పీసీబీని కోరారు. ఆ తర్వాత పీసీబీ ఆ కంపెనీని క్లోజ్ చేయడం తెలిసిందే.
ఈ మధ్యలో నెల్లూరుకు చెందిన ఓ మంత్రిగారి సమీప బంధువును కంపెనీ రంగంలోకి దింపింది. ఆయన స్వయంగా పీసీబీ ప్రముఖుడి వద్దకు వెళ్లి, కంపెనీని తిరిగి తెరిపించాలని, కంపెనీ మూతపడటంతో కార్మికుల రోడ్డున పడ్డారని అభ్యర్ధించినట్లు తెలిసింది.
ఆ తర్వాత అప్పట్లో పీసీబీని శాసించిన ఓ ఇంజనీర్ రంగప్రవేశం చేయడంతో తీవ్రత తగ్గింది. కంపెనీని బయటపడ వేసేందుకు ఆయన కొన్ని చిట్కాలు చెప్పారు. అంటే మొత్తం ధ్వంసమయిన పొలం విస్తీర్ణాన్ని తగ్గించి, నష్టనివారణ చేపట్టేలా సదరు ఇంజనీరు మార్గం సూచించారట. పీసీబీ పెద్దలు కూడా కంపెనీకి అదే సూచించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
దానితో రాంకీతోపాటు, మరో కంపెనీ నుంచి కొటేషన్ తీసుకున్న పీసీబీ, దానిని రాంకీకి ఇచ్చేందుకు సిద్ధమయినట్లు సమాచారం. అయితే రాంకీ కొటేషన్ దాదాపు 11 కోట్లపై వరకూ ఉన్నందున, మరో కంపెనీ వేసిన 4 కోట్ల కొటేషన్ ప్రకారం నష్టనివారణ చేపడతామని కంపెనీ ప్రతిపాదించిందట. మధ్యేమార్గంగా యూనివర్శిటీ వారితో పరిశోధన చేయించి, చివరకు దానిని కూడా కాదని.. హైదరాబాద్‌లోని ఒక సంస్థతో పనులు చేయించుకోవాలని పీసీబీ సూచించినట్లు పీసీబీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
అయితే కంపెనీల్లో ఏదైనా ప్రమాదం గానీ, ఉల్లంఘనలు గానీ జరిగితే పీసీబీ వాటికి నోటీసులిచ్చి, మూసివేస్తుంది. మళ్లీ సదరు కంపెనీ యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడం, ఇకపై అలా జరగకుండా చూస్తామని చెప్పి పెనాల్టీ చెల్లించి, తిరిగి కంపెనీలను ఓపెన్ చేయించుకోవడం సహజంగా జరిగేదే. సాధారణంగా ఒక కంపెనీకి క్లోజర్ ఆర్డర్ ఇచ్చిన నెలరోజుల తర్వాత, మళ్లీ వాటిని తెరిపిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పీసీబీకి సహజమే.
కానీ క్రెబ్స్ విషయంలో మాత్రం నిర్ణయాన్ని నెలలపాటు సాగదీయడం వెనక.. రిటైరయిన ఓ ఇంజనీరు హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఆయనే పీసీబీలో చక్రం తిప్పారని, పీసీబీ పెద్దలకు ఆయనే ప్రధాన సలహాదారుగా వ్యవహారించారన్న ప్రచారం బహిరంగానే వినిపించేది. తన రహస్యాలు తెలుసుకున్నారన్న ఆగ్రహంతో, పీసీబీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీతో చెప్పి అకారణంగా తొలగించారన్న విమర్శలూ లేకపోలేదు.
ఇటీవలి వరకూ ఆ శాఖలో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి తనకు క్లాస్మేట్ కావడం, నిరంతరం సచివాలయంలోని ఆయన పేషీలో గడపడంతో పీసీబీ పెద్దలు కూడా, సదరు ఇంజనీరుకు ప్రాధాన్యం ఇచ్చేవారని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా కొద్దినెలల క్రితం రిటైరయిన సదరు ఇంజనీరును తిరిగి పీసీబీ కన్సల్టెంటుగా తీసుకువచ్చేందుకు, పైస్థాయిలో సిఫార్సు చేసిన వైనం పీసీబీ ఉద్యోగుల వ్యతిరేకతకు కారణమయింది. పదవిలో ఉన్నంతవరకూ తమను దారుణంగా వేధించిన ఆయన మళ్లీ వస్తే తాము ధర్నాలు చేస్తామని, ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వకుండా రిటైరయిన వారిని ఎలా తెస్తారని తిరగబడ్డంత పనిచేశారు. దానితో ఆ ప్రతిపాదన విరమించుకోవలసి వచ్చింది.
కాగా ఇప్పటి ఓ సీనియర్ ఇంజనీరును కులం పేరుతో దూషించిన నాటి సీనియర్ ఇంజనీర్‌పై.. జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల సంఘం కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అప్పట్లో ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. దాన్ని బట్టి సదరు రిటైరయిన ఇంజనీరుకు పీసీబీలో ఎంత పట్టుందో.. పీసీబీ పెద్దలను ఏ స్థాయిలో ప్రభావితం చేసేవారన్నది స్పష్టమవుతుందని పీసీబీ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
అలా క్రెబ్స్ కెమికల్స్ కేసు తీవ్రత తగ్గించి, పీసీబీ పెద్దల వద్ద తనకున్న పలుకుబడి వినియోగించి కంపెనీని బయటపడేయాలన్న సదరు మాజీ ఇంజనీర్ కథ మీడియాలో రావడం అడ్డం తిరిగింది.
ఎమ్మెల్యే వద్దకు రాయబారానికి వచ్చిన కంపెనీ ప్రతినిధులు బెజవాడ బందురు రోడ్డులోపల ఉండే ఒక పెద్ద హోటల్లో బస చేశారు. అక్కడి నుంచే బొండా ఉమ వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో పీసీబీ ప్రముఖుడితోపాటు, అనకాపల్లికి చెందిన ఓ కీలక నేత పేరిట రాయ‘బేరాలు’ నిడిచినట్లు అప్పట్లో పీసీబీ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
మెంబర్ సెక్రటరీ ఎక్కడ?
కాగా ఈ మొత్తం పరిణామాల్లో పీసీబీ మెంబర్ సెక్రటరీ ఎక్కడా కనిపించకపోవడం, అంతా చైర్మన్ కృష్ణయ్య ఒక్కరే క్రియాశీలపాత్ర పోషిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్న అధికారికి గతంలో మరో నాలుగుశాఖలు అదనంగా ఉండటంతో, ఆయన పీసీబీపై దృష్టి సారించలేకపోయారు. ఫలితంగా చైర్మన్ ఒక్కరే అంతా తానై వ్యవహరిస్తూ వచ్చారు.
కానీ తాజా బదిలీల్లో మెంబబర్ సెక్రటరీకి పూరిస్థాయి పీసీబీ బాధ్యతలు అప్పగించినా, ఇప్పటివరకూ బాధ్యతలు స్వీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పీసీబీ వర్గాల సమాచారం ప్రకారం.. మెంబర్ సెక్రటరీ అధికారాలకు కోతపెడుతూ కొద్ది నెలల క్రితం ఉత్తర్వులు తెచ్చుకున్న క్రమంలో , ఆ అసంతృప్తితోనే ఆయన పీసీబీకి రావడం లేదన్న చర్చ పీసీబీలో జరుగుతోంది.
నిజానికి గత ఏడాదిన్నర క్రితం వరకూ పీసీబీలో మెంబర్ సెక్రటరీనే సర్వాధికారిగా వ్యవహరించేవారు. శ్రీధర్, విజయకుమార్ మెంబర్ సెక్రటరీగా ఉన్నంతవరకూ, చైర్మన్ పాత్ర నామమాత్రంగా ఉండేదని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. విజయకుమార్ బోర్డును శాసించిన వైనాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మెంబర్ సెక్రటరీ పాత్ర నామమాత్రంగా మారిందని, బహుశా ఆ అసంతృప్తితోనే ఆయన ఆఫీసుకు రాకపోవచ్చంటున్నారు.
బొండా తీరుపై విస్మయం
కాగా గతంలో పవన్ కల్యాణ్ పుణ్యాన బీజేపీ బదులు టీడీపీ టికెట్ తెచ్చుకున్న బొండా ఉమ, ఇప్పుడు ఆ కృతజ్ఞత మరిచి.. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో లోపాలు బయటపెట్టడంపై, జనసేన సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘అప్పట్లో బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు సెంట్రల్ సీటు కోసం బీజేపీ పట్టుపట్టింది. దానితో అది కాపుల సంప్రదాయ స్థానమని కాపు నేతలు బొండా కోసం పవన్‌కల్యాణ్ వద్దకు వెళ్లారు. వారి అభ్యర్ధన మన్నించి ఆ సీటును బొండా ఉమకు వదిలేయాలని పవన్‌గారు పెద్ద మనసుతో జనసేన నేతల ద్వారా చెప్పించారు. అటు సోము వీర్రాజు గారు కూడా అంతే పెద్ద మనసుతో ఆ సీటును, బీజేపీ వదులుకుని కేవలం బొండా కోసం టీడీపీకి ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి పవన్‌గారిని విమర్శించడం భావ్యమా?ఇదేనా కృతజ్ఞత’’ అంటూ జనసేన సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ ఆకస్మిక తనిఖీలెప్పుడు?
కాగా ఏదైనా సమస్య, ఫిర్యాదు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించి, సరైన సమయంలో సంఘటనా స్థలానికి వెళ్లి చర్యల కొరడా ఝళిపించే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పీసీబీ కార్యాలయంతోపాటు, విశాఖలోని బడా ఫార్మా-కెమికల్ కంపెనీల్లోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తే మరింత ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రధానంగా పీసీబీ కార్యాలయం పనితీరు, గత ప్రభుత్వం వరకూ కొనసాగిన విధానం- అమలుచేసిన జీఓలు-బోర్డు తీర్మానాలతోపాటు.. కూటమి వచ్చిన తర్వాత వచ్చిన జీఓలు, బోర్డు తీర్మానాలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పీసీబీ ఉద్యోగులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు, వారికి ఇస్తున్న జీతాలు- ప్రమోషన్లు-జీతాల్లో వ్యత్యాసాలు- అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వెట్టిచాకిరీ-వె తలపై అధికారులు లేకుండా.. వవన్ స్వయంగా వారిని విచారిస్తే పీసీబీ ప్రక్షాళనకు మార్గం సుగమం అవుతుందంటున్నారు.