– శాసన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: స్టాఫ్ నర్సుల నియమాకాల్లో సీహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు)లకు వెయిటేజ్ ఇస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. శాసనసభలో మంగళవారం సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్రంలో 9,640 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు విలేజ్ హెల్త్ క్లినిక్కులలో పనిచేస్తున్నారు.
వీరికి నెలకు వేతనం కింద రూ.25 వేలు చెల్లిస్తున్నాం. పనితీరు ప్రతిపాదికన మరో రూ.15వేల వరకు ప్రోత్సాహకంగా చెల్లింపులు జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే వీరికి చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి’ అని మంత్రి వివరించారు.
కేంద్రానికి లేఖ
‘ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మినహా మే, 2025 వరకు ప్రోత్సాహాకాల చెల్లింపులు జరిగాయి. గతంలో మాదిరిగా కాకుండా.. తక్కువ వ్యవధిలోనే వీరికి ప్రోత్సాహాకాల మొత్తాన్ని అందచేస్తున్నాం. 2024 నుంచి వీరికి ప్రావిడెంటు ఫండ్ చెల్లింపునకు వీలుగా అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావడంలేదు. వీటిని మంజూరు చేయాలని ఈ ఏడాది జూన్లో కేంద్రానికి లేఖ రాశాం.
జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద విధానంలో వనిచేసే వీరి సేవలను క్రమబద్ధీకరించాలన్న నిబంధన ఏదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వపరంగా శాశ్వత విధానంలో జరిగే స్టాఫ్ నర్సుల నియామకాలప్పుడు సీహెచ్ లకు వెయిటేజ్ ఇస్తాం. గ్రామాల్లో వీరు అందించేందుకు సంతృప్తికరంగానే ఉన్నాయి’ అని మంత్రి సత్యకుమార్ వివరించారు