ఓ మనిషీ..ఎందుకొచ్చినవీ మారణాయుధాలు..
అవి చాలవన్నట్టు అణ్వాయుధాలు..
పొద్దున లేస్తే తీవ్రవాదం..
పొద్దు పొడిస్తే ఉగ్రవాదం..
పాలకుల అతివాదం..
మౌనంగా ప్రజల ఆమోదం..
దౌర్జన్యం..కాఠిన్యం..
హింస..ప్రతిహింస
ఇవేనా మనమెరిగిన పదాలు..
మనకు తెలిసిన పథాలు..
నెత్తుటి చారికలు..
రుధిరపు మరకలేనా
మన జెండాలపై..
అజెండాలపై..!
ఆంక్షలన్నీ కాంక్షలకు
బలయ్యే వేళ
శుభాకాంక్షలెక్కడుంటాయి.. ప్రతీకారేచ్చకు స్వేచ్చ
ఆహుతయ్యే చోట
ప్రశాంతతకు నెలవెక్కడ..?
ఈ సమరాలు
పౌరుల కోసమేనా..
శాంతికి దారుల కోసమేనా..
ఇది నిజమా
ఏ కోశానైనా..
హింసతో శాంతి..
మనశ్శాంతి
దక్కేనా లవలేశమైనా..?
ఆక్రమణ..దురాక్రమణ.. అతిక్రమణ..
ఇవేనా మానవనైజం..
అప్పుడిక ఏమైనట్టు
మనం సాధించిన నాగరికిజం.. ఐక్యరాజ్యసమితే
లౌక్యరాజ్య సమితిగా మారి
మౌన ప్రేక్షక
పాత్రధారిగా
మిగిలిన వేళ
ఎలా సాధ్యమయ్యేను సామరస్యత..?
ప్రతి మదిలో..
ప్రతి హృదిలో
ఆలోచన మొదలై..
సమాలోచనగా ఎదిగి..
దూరాలోచనగా మారి..
దురాలోచనలను
దునుమాడి..
విశ్వమంతా ఒకే గళమై.. అనర్గళమై..మంగళమై..
దిక్కులు పిక్కటిల్లేలా..
దృక్కులు మారిపోయేలా శాంతి గీతమాలపిస్తే
అదే కదా..అదే కదా
విశ్వమానవజాతీయ గీతం..!
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
7995666286
9948546286