– నిబంధనలకు అధికారుల పాతర
– దశాబ్దాల నుంచి ఏపీటీఎస్‌కే ఆ బాధ్యతలు
– ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంటు పేరుతో టెండర్
– స్టాంప్స్ శాఖకు ఏం యంత్రాంగం ఉంది?
– గతంలో టీడీపీ సర్కారు విధానాలకు పాతరేసిన అధికారులు
– అడ్డగోలు నిబంధనలతో కూటమికి అప్రతిష్ఠ
– టెండర్ నిబంధనలో పారదర్శకతకు పాతరేసిన అధికారులు
– అయిన వారికోసమే నిబంధనలు అటకెక్కించిన అధికారులు
– ఆ కంపెనీ కోసమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మార్కుల పెంపు?
– అందుకు ఇతర రాష్ట్రాలో ఇచ్చే మార్కులు 20, 25 మాత్రమే
– కానీ ఇక్కడ మాత్రం 45కు పెంచేసిన అధికారులు
– ఆ పేరుతో పాత కంపెనీకి ఎక్కువ మార్కులు వేసే పన్నాగం?
– మళ్లీ పాత కంపెనీకే కట్టబెట్టే మాయోపాయం?
– నిబంధనలు పాటించాలన్న సీఎం ఆదేశాలు బేఖాతర్
– ఆ కంపెనీపై అపార ప్రేమ ఎవరికి? ఎందుకు?
– రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ 250 కోట్ల టెండర్లో గందరగోళం
– నిబంధనలు ఉల్లంఘించిన సర్కారుపై కోర్టుకెక్కిన కంపెనీలు
– తప్పు అధికారులది.. శిక్ష ప్రభుత్వానికా?
– పాత స్టాంప్స్ ఐజీ వీరపాండ్యన్పై ఒత్తిడి చేసిందెవరు?
– కొత్త ఐజీ అంబేద్కర్ ఏం చేయబోతున్నారు?
– అధికారుల టెండర్.. వండర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
అవినీతికి దూరంగా ఉండాలని.. ప్రతి విషయంలో పారదర్శకత పాటించాలని.. పార్టీ నాయకులయినా-అధికారులయినా కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని.. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమన్న స్పృహతో ప్రతి క్షణం గుర్తుంచుకుని పనిచేయాలని, సీఎం చంద్రబాబునాయుడు చెవినిల్లు కట్టుకుని చెబుతున్నారు. అక్రమార్కులను క్షమించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ప్రతిపక్ష వైసీపీ, దాని మీడియా ఒళ్లంతా కళ్లు చేసుకుని కూటమిని అప్రతిష్ఠాలు చేసే ఏకైక అజెండాతో పనిచేస్తోంది కాబట్టి!
కానీ అధికారుల తీరు మారడం లేదు. వారి శైలిలో మార్పు కూడా కనిపించడం లేదు. కూటమి ప్రతిష్ఠను కాపాడాలన్న ధ్యాస భూతద్దం వేసినా కనిపించడం లేదు. పైగా ధిక్కారపర్వం! గత జగన్ సర్కారు మాదిరిగానే అడ్డగోలు విధానాలు!! ఫలితంగా తప్పు అధికారులది. శిక్ష మాత్రం కూటమి ప్రభుత్వానికి!!!
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, సిసి టివి కెమెరాలు, ల్యాప్టాపులు, కుర్చీలు, సిసి టివీ కెమెరాలు, ఏసీలకు సంబంధించిన టెండర్లలో అధికారులు చేసిన తప్పు ఇప్పుడు కోర్టుకెక్కింది. టెండరు నిబంధనలు అటకెక్కించి, మళ్లీ పాత కాంట్రాక్టరుకే పట్టం కట్టి ‘స్టాంప్స్’లో.. మరోసారి ‘అక్షర’ కిరణం వెలిగించాలన్న మాయోపాయంతో రూపొందించిన టెండరు నిబంధనలు బూమెరాంగయి.. చివరకు కోర్టుకెక్కేందుకు కారణమయింది. ఆ కథేమిటో చూద్దాం రండి.
ఏపీ రిజి్రస్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, విజయవాడలోని హెడ్డాఫీసుకు.. కంప్యూటర్లు, ల్యాప్టాపులు, స్కానర్లు, సిసి టీవీ కెమెరాలు ఏసీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు, వివిధ రకాల డివైజులు, సర్వర్లు, కంప్యూటర్ టేబుళ్లు. ఇతర వస్తువుల కొనుగోలు కోసం ఈనెల 18న టెండరు పిలిచింది. అందులో ప్రస్తుతం స్టాంప్స్ శాఖలో ఉన్న 31 రకాల వస్తువులను తీసుకుని, వాటి స్థానంలో మరికొన్ని అదనంగా వస్తువులను ఏర్పాటుచేయాలని టెండరులో పేర్కొన్నారు.
నిబంధనలకు అధికారుల పాతర
నిజానికి టెండరు విలువ ఎంతన్నది జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జీఎఫ్ఆర్) ప్రకారం పేర్కొని తీరాలి. ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వేల్యూ (ఈసీవీ) నిబంధన ప్రకారం బిడ్ వేల్యూ ఎంతన్నది కూడా పేర్కొనాలి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ టెండరు 200 కోట్ల నుంచి 4000 కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చని, 4 కోట్ల రూపాయలు ఈఎండి నిర్ణయించడమే దానికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.
కానీ టెండరు ప్రకటనలో ఇవేమీ లేవు. ఈ నిబంధన ప్రకారం టెండరుకు 15 నుంచి 30 రోజుల గడువు ఇవ్వాలి. కానీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంటు మాత్రం.. ఆ ప్రక్రియను 15 రోజుల్లోనే ముగించాలని నిర్దేశించడం వివాదానికి, అనుమానాలకు తెరలేపింది. అసలు అంత హడావిడిగా టెండరు సమయాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఎక్కువ సమయం ఇస్తే అనుభవం- సామర్థ్యం ఉన్న కంపెనీలు కూడా టెండరు వేస్తాయి కదా? గతానికి భిన్నంగా టెండరులో పాల్గొనే కంపెనీలు, తమ సామర్ధ్యం నిరూపించుకునే సర్టిఫికెట్లను స్వయంగా తీసుకురావాలని టెండరు నిబంధధన లో పొందుపరిచారు.
ఎందుకంత తొందర?.. ఎవరి కోసం?
సహజంగా ఐటి కంపెనీలు శని, ఆదివారాలు పనిచేయవు. అమరావతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలు కూడా ఆ రెండురోజులు పనిచేయవు. పైగా ఆదివారాలు, మధ్యలో దసరా శెలవులు. మరి ఆయా కంపెనీల అనుభవం ధృవీకరించే సర్టిఫికెట్లు ఇచ్చే సాఫ్ట్వేర్ అండ్ టెక్ సంస్థలు, ఆ తక్కువ సమయంలో టెండరులో పాల్గొనే కంపెనీలకు ఎలా అర్హతఐ సర్టిఫికెట్లు ఇస్తాయి ? గతంలో ఇలాంటి వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించుకునే వెసులుబాటు ఉండేది. ఇన్-పర్సన్ ద్వారా వేసే అవకాశం ఉండేది.
కానీ ఈసారి మాత్రం కంపెనీ ప్రతినిధి స్వయంగా వచ్చి, బిడ్ దాఖలు చేయాలన్న నిబంధన వివాదాస్పదంగా మారింది. అంటే ఇదంతా తాము ముందస్తుగా ఎంపిక చేసుకున్న ఒక కంపెనీ కోసం.. ఇంకా సూటిగా చెప్పాలంటే గత కాంట్రాక్టరుకు మళ్లీ టెండరు దక్కించే మాయోపాయంలో భాగమేనన్నది పోటీదారుల ఆరోపణ. ఇదంతా మళ్లీ ‘అక్షర’ కిరణాల కోసమేనన్నది జరుగుతున్న ప్రచారం. సు‘ధీరత్వం’.. ‘ప్రదీప’త్వమేనట!
ఈ నెల 18న టెండర్లను పిలిచిన రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అధికారులు.. అందుకు వచ్చేనెల 3ను చివరి తేదీగా నిర్ణయించారు. 15 రోజుల్లోపు ప్రీ మిడ్ గడువు ఇచ్చారు. అయితే ఈ మధ్యలో వచ్చే దసరా సెలవులు, ప్రభుత్వ-సాఫ్ట్వేర్ సంస్థలకు ఇచ్చే శని-ఆదివారాలు సెలవులు పనిచేయవన్న వాస్తవాలను, నాటి అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడమే విమర్శలకు తావిస్తోంది.
‘అక్షర’ కిరణాల కోసమేనా ఈ అడ్డగోలు నిబంధనలు?
టెండరులో పాల్గొన్న కంపెనీల సందేహాలు, వారి ప్రశ్నలకు ఈనెల 25న సమాధానం ఇస్తారట. ఆ తర్వాత టెక్నికల్-ఫైనాన్షియల్ బిడ్లు తెరుస్తారట. ఆలోగానే కాగల కార్యం గంధర్వులు తీర్చే ఏర్పాట్లు చేశారట. ఈసారి గతానికంటే భిన్నంగా 4 కోట్ల ఈఎండి చెల్లించాలన్న నిబంధన కూడా విమర్శలకు గురవుతోంది.
పోనీ టెండరులో పాల్గొన్న కంపెనీలేమైనా చిన్నా చితకవా అంటే అదీ కాదు. వివిధ రాష్ట్రాల్లో లబ్ధప్రతిష్ఠమైన కంపెనీలే. వాటిని పక్కనపెట్టి.. మళ్లీ ‘స్టాంప్స్’లో ఆ ఇద్దరి ‘అక్షర’ కిరణాలు వెలిగించేందుకే.. అధికారులు నిబంధనలకు పాతరేసి, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా టెండరు నిబంధనలు మార్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కన్సార్టియం భాగస్వాములను అనుమతించడం, కాల్‌సెంటర్ అనుభవం కోసం అసమంజసమైన షరతులు, పెరుగుతున్న పాజిటివ్ నెట్‌వర్త్ వంటి అర్హత ప్రమాణాలు.. పోటీలు పరిమతం చేస్తాయని, ఇవి న్యాయమైన పోటీని అడ్డుకుంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంత? ఏమిటని టెండరులో చెప్పరా?.. కమిటీ ఏదీ?
కాగా ఏ ప్రభుత్వ శాఖ టెండరు వేసినా.. జనర ల్ ఫైనాన్షియల్ రూల్ (జీఎఫ్ఆర్) 168 ప్రకారం, దాని రేటు ఎంతన్నది టెండరు నోటీసులో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్టిమేటెడ్ కాంట్రాక్టు వేల్యూ (ఈసీవీ) ప్రకారం ఎంతన్నది స్పష్టం చేయాలి. కానీ రిజిట్రషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు ఈసారి, తమ టెండరులో ఇవేమీ పేర్కొనకపోవడం వల్ల.. మళ్లీ పాత కంపెనీకే కాంట్రాక్టు కట్టబెట్టే మాయోపాయానికి తెరలేపిందన్న ఆరోపణలు మూటకట్టుకునేందుకు కారణమయింది. ఇదంతా చూస్తే ఆ శాఖపై ‘అక్షర’ కిరణం పట్టెన్నది స్పష్టమవుతోంది.
పైగా 50 కోట్ల రూపాయలకు పైబబడిన ఈ-ప్రొక్యూర్మెంట్ వ్యవహారంలో.. ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్, సంబంధభిత శాఖ హెచ్ఓడీ కన్వీనర్‌గా , ఫైనాన్స్ సెక్రటరీ, ఐటి సెక్రటరీ, ఒక ఐటి నిపుణుడు ఉన్న కమిటీ స్క్రూటినీ చేయాలి. కానీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు ఇచ్చిన టెండరులో ఇవేమీ లేవంటూ, టెండరులో పాల్గొన్న ఒక కంపెనీ కోర్టు కెక్కింది. అంటే అధికారుల తప్పిదానికి కూటమి సర్కారు శిక్ష అనుభవించాల్సి వస్తోందన్నమాట.
ఫిర్యాదులపై స్పందించని స్పెషల్ సీఎస్
కాగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ పిలిచిన ఈ టెండరు అవకతవకలపై స్పెషల్ సీఎస్‌కు ఫిర్యాదు వచ్చినా, ఆయన ఎలాంటి చర్య తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ టెండరుకు సంబంధించిన అడ్డగోలు నిబంధనలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెవిన్యూ డిపార్టుమెంట్‌కు సెప్టెంబర్ 21న వివరాణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదంటున్నారు.
ఏపీటీఎస్‌ను ఎందుకు తప్పించినట్లు?
చంద్రబాబునాయుడు సీఎం కాకముందు వరకూ టెండర్లలో ఇష్టారాజ్యం ఉండేది. ఆయా శాఖలే టెండర్లు పిలుచుకుని, తమకు కావలసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేవి. అయితే బాబు సీఎం అయిన తర్వాత వాటిలోని లొసుగులు-అవినీతిని గుర్తించి.. అన్ని కొనుగోళ్లకు సంబంధించి ఏపీటీఎఎస్ ద్వారానే చేయాలని జీఓ ఎంఎస్ నెంబర్ 4043/15-6-1998న ఉత్తర్వులు జారీ చేశారు.
మరోసారి టీడీపీ ప్రభుత్వమే జీఓ ఎఎంఎస్ నెంబర్ 12న 8-6-2015న మరో ఉత్తర్వు జారీ చేసింది. కారణం.. ప్రభుత్వ శాఖలకు ఇవన్నీ పరిశీలించి, పర్యవేక్షించే సామర్థ్యం-యంత్రాంగం- సాంకేతిక నిపుణులు ఉండరన్న ముందుచూపు! ఈ జీఓనే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అనుసరించాయి.
టెండర్ ప్రొక్యూర్మెంట్ను ఏపిటీఎస్ వాల్యుయేట్ చేసి, దానికి సంబంధించిన సాంకేతిక సమస్య పరిష్కరిసుంది. ఆ మేరకు దానికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ విచిత్రంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదే శాలకు భిన్నంగా.. అదే కూటమి ప్రభుత్వంలో, అధికారులు అందుకు భిన్నంగా.. రిజిట్రషన్స్ అండ్ స్టాంప్స్ ్య శాఖ సొంతంగా ఈ టెండరు నోటీసు ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఇది కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుచేసేందుకు, అధికారులు తీసుకున్న అడ్డగోలు నిర్ణయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మార్కు పేరుతో పాత కంపెనీకే పట్టం?
కాగా టెండరులో రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముసుగులో, మళ్లీ పాత ‘అక్షర’ కిరణాన్ని వెలిగించాలన్న మాయోపాయం అధికారుల్లో కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అదెలాగంటే.. టెండరులో పాల్గొన్న కంపెనీలు, ఫైనాన్షియల్-టెక్నికల్ బిడ్లలో అర్హత సాధించినప్పటికీ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎక్కువ మార్కులు సాధిస్తేనే, టెండరు దక్కుతుందన్న నిబంధన రూపొందించారు. దానికోసం 45 మార్కులు కేటాయించారు. సహజంగా మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో అయితే 20-25 మార్కులే కేటాయించారు.
కానీ ఏపీలో మాత్రం అధికారులు ఏకంగా 45 మార్కులు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా తమకు నచ్చిన ‘అక్షర’ కిరణాల కోసమేనని, బిడ్డింగ్ వేసిన ఆ కంపెనీ అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్న పేరుతో ఎక్కువ మార్కులు వేయడం ద్వారా, ఆ టెండరుకు దానికి దక్కించాలన్నదే అససలు వ్యూహమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెవిన్యూ మంత్రి అనగాని ఏం చేస్తారో?
కాగా కీలకమైన ఈ 250 కోట్ల టెండరు వ్యవహారాన్ని ‘అక్షర’ కిరణాలకు.. మళ్లీ పువ్వుల్లో పెట్టి అప్పగించేందుకు జరుగుతున్న గోల్మాల్ వ్యవహారంలో, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. నిజానికి ఇది రెవిన్యూ మంత్రి నిర్ణయంతో సంబంధం లేని అంశమైనప్పటికీ, తన శాఖలో జరిగే ఉల్లంఘనలకు సరిదిద్దే బాధ్యత మాత్రం ఆయనదే. అసలు ఈ టెండరు గత ఐజి నిర్ణయంతో జరిగిందా? లేక నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా అని తెలుసుకోవాలంటే, దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, అటు కూటమి నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మంత్రి అనగాని ఎలా స్పందిస్తారో చూడాలి!
అన్నీ అనుమానాలే!
2015లో విడుదలైన జీఓ ఎంఎస్ నెంబరు 12 ప్రకారం.. 50 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీ పరిశీలించి ఆమోదించాలి. కానీ ఈ టెండరు విషయంలో అలాంటిదేమీ జరిగినట్లు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
క్యుసిబిఎస్ విధానం ఎందుకు?
టెండరులో మూల్యాంకన విధానం క్యుసిబిఎస్ (క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్) ఆధారంగా పెట్టారు. కానీ నాన్ కన్సల్టెన్సీ సర్వీసులకు సాధారణంగా ఎల్‌సిఎస్ (లోయస్ట్ కాస్ట్ సెలక్షన్) సరిపోతుందని ప్రభుత్వ మాన్యువల్ చెబుతోంది. హార్డ్‌వేర్ రిఫ్రెష్ లాంటి పనులు క్లిష్ట సాంకేతిక కిందకు రావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
*కన్సార్టియం భాగస్వామ్యాన్ని అనుమతించగా, స్పష్టమైన బాధ్యతల వివరణ లేదు… రూ.100 కోట్ల కాల్ సెంటర్ అనుభవం తప్పనిసరిగా పెట్టడం ప్రాజెక్ట్ అవసరాలకు సంబంధం లేని షరతు.
“సానుకూల నికర విలువ పెరుగుతూ ఉండాలి” అనే కొత్త అర్హత షరతు సాధారణ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. టెక్నికల్ మూల్యాంకనంలో 40% వెయిటేజీ ఇచ్చి, గరిష్ట పరిమితి (30%)ను మించేశారు.
మొత్తం మీద… ఈ టెండర్లో అనుసరించిన ప్రక్రియ పారదర్శకత, నిష్పాక్షికత సూత్రాలకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. నవరాత్రి సెలవులు, స్పష్టత లేని నిబంధనలు, ఏపిటిఎస్ ప్రమేయం లేకపోవడం, ఉన్నతాధికారుల కమిటీ గైర్హాజరు వంటి అంశాలు మరిన్ని సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ప్రశ్న ఒక్కటే — కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ నిజంగా పారదర్శక పద్ధతిలో జరుగుతోందా? లేక విధాన ఉల్లంఘనలతో కొత్త వివాదానికి బాటలు వేస్తోందా?ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహం, అవినీతి కూటమికి శిక్షగా పరిణమిస్తుందా? అన్నదే చూడాలి.
అందరి చూపూ..అంబేద్కర్ వైపే!
కాగా మొన్నటి వరకూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా పనిచేసిన వీరపాండ్యన్ హయాంలో తీసుకున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై.. ఆయన స్థానంలో వచ్చిన అంబేద్కర్ ఎలా స్పందిస్తారో చూడాలి. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా చురుకుగా పనిచేసి, ప్రజాప్రతినిధుల స్పీడుకు బ్రేకులు వేసిన అంబేద్కర్.. తనకు సంబంధం లేని ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు? తన శాఖకు పట్టిన అవినీతి మకిలిని ఎలా వదిలిస్తారో చూడాల్సి ఉంది. నిజానికి ఈ టెండరు వ్యవహారంలో ఆయనకెలాంటి సంబంధం లేదు. కానీ టెండరు దక్కని కంపెనీలు న్యాయం కోసం కోర్టుకెక్కిన నేపథ్యంలో ..ఆయన కోర్టుకు ఏం సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంది.