– బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
ఖమ్మం: రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిపోయిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షానికి చెందిన వారిని బెదిరించడం,ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ “డైవర్షన్పాలిటిక్స్”చేస్తున్నారన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసం ఆవరణలో గురువారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ రవిచంద్ర మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాలను పట్టుకు తిరుగుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పూర్తిగా విస్మరించారన్నారు.
యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తున్నదని,పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీని గాలికొదిలేశారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బహిరంగ సభ నుంచి ఇప్పటిదాకా ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు
స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
అన్ని వర్గాల ప్రజల బాగోగులు,శ్రేయస్సును ఎల్లప్పుడూ కాంక్షించే కేసీఆర్ తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలల్లోనే మహిళలు, బీసీలకు చట్టసభల్లో 33 శాతం చొప్పున రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరుతూ తీర్మానించి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.