– ఎవరా అరుణా‘నందం’.. ఏమా కథ?
– లేడీడాన్ కోసం పోలీసులపై ఒత్తిడి చేసిన ఆ ప్రభుత్వ ‘పెద్ద అధికారి’ని వదిలేసినట్లేనా?
– ఆమె కోసం ఆయన పోలీసు అధికారులకు ఫోన్లు?
– అరుణ భర్త పెరోల్ కోసం హోం సెక్రటరీకి ఫోన్ చేసిన వారిపై చర్యలేవీ?
– ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యేల పాత్ర
– పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించిన అరుణ?
– అందులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రముడిదే కీలక పాత్ర?
– ఇప్పటికే ఆయన కాబోయే మంత్రి అంటూ సోషల్‌మీడియాలో హడావిడి
– అరుణను వెంట పెట్టుకుని పెరోల్ పిటిషన్‌పై సంతకం కోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన ఎవరా యాదవ ప్రముఖుడు?
– ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కులం కార్డుతో పనులు చక్కబెట్టుకోవడం ఆయన ప్రత్యేకత
– అరుణ అంశంపై శాసనమండలిలో నోరెత్తని వైసీపీ
– పోలీసుల వైఫల్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– ఇదో ‘పవర్’ఫుల్ స్టోరీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
తన ప్రియుడికి పెరోల్ ఇప్పించేందుకు ఎమ్మెల్యే, మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారులపై ఒత్తిళ్లు చేసి అందులో తొలిదశ
విజయం సాధించిన నెల్లూరు కి‘లేడీ’ అరుణ.. అందుకు తనకు సహకరించిన పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేల పేర్లను విచారణలో వెల్లడించిందన్న సోషల్‌మీడియా కథనాలు హాట్‌టాపిక్‌గా మారాయి.
అందులో ప్రభుత్వ ‘పెద్ద అధికారి’ ఒకరు అరుణకు బాసటగా నిలిచారని, ఆమె కోసం పోలీసులకు లెక్కలేనన్ని సార్లు ఫోన్లు చేసినట్లు సోషల్‌మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో గూడూరు విద్యాసంస్థకు చెందిన ఓ యాదవ ప్రముఖుడు చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ప్రముఖుడికి అత్యంత సన్నిహితురాలైన అరుణను.. ఆయనే వెంటబెట్టుకుని నెల్లూరు ఎమ్మెల్యేల వద్దకు తీసుకువెళ్లి పెరోల్‌కు సిఫార్సు లేఖలు రాయించినట్లు అటు నెల్లూరు టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది.తొలినుంచి అరుణ సదరు యాదవ ప్రముఖుడితో సన్నిహితంగా ఉందేదంటున్నారు.
కాగా అరుణ చెల్లెలు కూడా ఆయన వద్ద పనిచేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కులపరంగా బాగా పలుకుబడి ఉన్న సదరు ప్రముఖుడే.. అరుణను ఓ ప్రభుత్వ ‘పెద్ద అధికారి’కి
పరిచయం చేశారన్న చర్చ జరుగుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కులం కార్డుతో పనులు చక్కబెట్టడంలో సదరు ప్రముఖుడు మొనగాడని, అందుకు ఆమె కూడా సహకరించేదన్న ప్రచారం నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తోంది.
అరుణను పోలీసులు విచారిస్తున్న సందర్భంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రభుత్వ ‘పెద్ద అధికారి’ ఆమె కోసం తన
పలుకుబడిని వినియోగించి, పోలీసులపై ఒత్తిళ్లు చేశారని, ఆ మేరకు ఆమె కోసం పలువురు అధికారులకు లెక్కలేనన్ని ఫోన్లు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ నేపథ్యంలోనే సదరు ప్రభుత్వ ‘పెద్ద అధికారి’ హోంశాఖ అధికారికి ఫోన్ చేసి.. పెరోల్‌పై సంతకం పెట్టాల్సిందిగా కోరినట్లు అటు నిఘా వర్గాలు కూడా తేల్చినట్లు చెబుతున్నారు. అసలు అరుణ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చింది? ఎన్నిసార్లు సదరు ప్రభుత్వ పెద్ద అధికారిని కలిసిందనే విషయాన్ని సచివాలయ రికార్డులు, సిసి టివి పుటేజీలు చూస్తే బట్టబయలవుతాయంటున్నారు. అయితే పోలీసులు ఇప్పటివరకూ ఆ పనిచేయకపోవడంపైనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కాగా పోలీసుల విచారణలో.. తన హవా సాగేందుకు సహకరించిన ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, ప్రభుత్వ పెద్ద అధికారి పేర్లను వెల్లడించినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే పాత్ర ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.
అరుణతో అంటకాగిన సదరు మాజీ ఎమ్మెల్యే ప్రదర్శించిన అత్యుత్సాహం.. చివరకు ఆయన కుటుంబంలో కలతలకు కారణమయిందంటున్నారు. కాగా వైసీపీ నుంచి టీడీపీలో చే రిన ఒక ప్రముఖుడు అరుణ ప్రియుడిని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లిక్కర్, ఇసుక వ్యాపారులను బెదిరించేందుకు పావుగా వాడారని అటు నెల్లూరు టీడీపీ నేతలు చెబుతుండగా.. అరుణ సైతం పోలీసుల విచారణలో అదే చెప్పినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా అరుణకు అన్నిరకాలుగా సహకరించిన సదరు ప్రభుత్వ ‘పెద్ద అధికారి’, జగన్ జమానాలో విద్యుత్ వ్యవహారాలను వెలిగించిన సూత్రధారి. విద్యుత్ ఒప్పందాల్లో ఆయనే కీలకపాత్ర పోషించారన్న పేరుంది. అందరివాడన్న పేరుతో.. వందలకోట్లకు పడగలెత్తిన సదరు అధికారి, అవసరమైతే ప్రభుత్వానికే అప్పు ఇవ్వగల స్థాయిలో ఉన్నారన్న వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తుంటాయి. కూటమి ప్రభుత్వంలో కూడా విద్యుత్‌ను వెలిగిస్తున్న సదరు ప్రభుత్వ ‘పెద్ద అధికారి’, మరోసారి తన పదవిని పొడిగించుకునే లాబీలో బిజీగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే రాష్ట్రంలో సంచలనం కలిగించిన కి‘లేడీ’ అరుణ వ్యవహారంలో ఆమెకు దన్నుగా ఉన్న ఆ ప్రభుత్వ ‘పెద్ద అధికారి’పై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. అసలు అరుణ ప్రియుడికి పెరోల్ పిటిషన్‌పై సంతకం
చేసేందుకు ఎవరు కారణమన్న విచారణతోపాటు.. అరుణ నుంచి సదరు ప్రభుత్వ పెద్ద అధికారికి- ప్రభుత్వ పెద్ద అధికారి నుంచి అరుణకు ఎన్ని ఫోన్లు వెళ్లాయన్న విచారణ చే యని పోలీసుల వైఫల్యం విమర్శలకు దారితీసింది.
అయితే విచిత్రంగా శాసనమండలిలో తమకు ఉన్న బలంతో..అనేక అంశాలు ప్రస్తావిస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా అరుణ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం.