ఏఎస్ రావు..
ఆయన..
బంగారు చెంచా
నోట్లో పెట్టుకుని పుట్టలేదు..
అయితే
కొన్ని వేల మందికి
బంగారు భవిష్యత్తు
అందించిన స్థితప్రజ్ఞుడు..
ఒకనాడు..
నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళని
దుర్భర స్థితిని
అనుభవించిన వాడు..
తదనంతర రోజుల్లో
వందల ఇళ్ళల్లో వేల మంది
కడుపు నింపిన మానవతామూర్తి..
ఒక్కోరోజున
కాలేకడుపుకి మండే బుగ్గి..
అనుకున్న జీవితంలో
కాళ్లను కడుపులో పొదుగుకుని పడుకుని..
ఆకాశం వైపు చూస్తూ
ఎన్ని రాత్రులు గడిపాడో..
అలా చూస్తూనే
ఆ పసివయసు కలల్లో ..
నింగికి నిచ్చెనలు వేసిన
స్వాప్నికుడు…
అయితే..అందరిలా
ఈ అయ్యగారి సాంబశివరావు
కలలు గని ఊరుకోలేదు..
తెలిసీ తెలియని వయసులో
కన్న కలలే కదా అనుకుని
మర్చిపోలేదు..
వాటిని నిజం చేసుకున్నాడు..
ఆ క్రమంలో తాను ఎదిగాడు..
ఒక్కడిగా కాదు..
ఒక మహాశక్తిగా..
ఒక గొప్ప వ్యవస్థగా..
తాను పుట్టిన దేశానికే
శాస్త్రవిజ్ఞాన రంగంలో
వెన్నెముకగా..
అయ్యగారి సాంబశివరావు
ఉరఫ్..ఎ ఎస్ రావు..
ఆయన జీవితం
ఒక కథ కాదు..
చరిత్ర..
ఆయన గమనం..
సాదాసీదా కాదు..
కష్టాల గోదా..
ఆయన ఎదుగుదల
ఒక ప్రయాణం కాదు..
మహాప్రస్థానం..
పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో నూట పదకొండు
సంవత్సరాల క్రితం
ఇదే రోజున..
అంటే సెప్టెంబర్ 20.. 1911న అయ్యగారి వెంకటాచలం ..
సుందరమ్మ దంపతులకు పుత్రోదయం..
శాస్త్ర విజ్ఞాన రంగంలో
ఆనాటికి జగతికి తెలియని
సూర్యోదయం జరిగింది..
ఆ బుడతడే సాంబశివరావు..
బాల్యం కష్టాల కొలిమి..
సగం కాలం ఆకలితోనే చెలిమి.
బడికి వెళ్ళినా అందరిలా
మడత నలగని బట్టలతో బడికి
పోలేదు ఈ అయ్యగారి బిడ్డ..
తినడానికి నాలుగు మెతుకులే ఉండని ఇంట్లో..
అమ్మని సతాయించకుండా..
అట్టలు కూడా లేని చిరిగిన..
అక్షరాలు చెరిగిన..
పేజీలు చెదరిన పుస్తకాలు ముందేసుకుని
ఒక మూల బుద్దిగా కూర్చుని
అక్షరాలతోనే బొజ్జ నింపుకున్నాడు..
పుస్తకాల నుంచి జ్ఞానాన్ని తోడుకొని తాగి దాహం తీర్చుకుని ఆ పుస్తకాలనే దిండుగా చేసుకుని
పడుకున్న జీవితం
తర్వాతి కాలంలో
ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా..
తెచ్చుకున్నా నిరాడంబరంగానే జీవితాన్ని గడిపిన తత్వవేత్త.
తణుకు హైస్కూల్లో
వారాలతో చదువు..
అవమానాలతో గుండెబరువు..
కష్టాలతో కడుపు చెరువు..
కుదుట పడని జీవితం..
అయినా కుంటుపడని
విద్యాభ్యాసం..!
ఈలోగా విజయనగరంలో
ఉచిత భోజనం..
ఉచిత వసతితో చదువు అన్న
వర్తమానంతో చారిత్రక మహారాజా కళాశాల ప్రవేశం..
సాంబశివరావు జీవితంలో
ఇంకో గొప్ప సన్నివేశం..!
విద్యలనగరం నుంచి
బెనారస్ విశ్వవిద్యాలయానికి
చేరిన చదువుల బండి..
అక్కడా ముప్పుతిప్పలు పడి..
ఒకనాటికి ప్రతిష్ఠాత్మక
స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వరకు సాగింది..
అక్కడ ఇంజనీరింగ్ పట్టాతో ఎక్కేసాడు చదువులమ్మ
చెట్టు పైకొమ్మ..
ఆ తర్వాతి రోజుల్లో అదే సాంబశివరావు తానుగా..
తనే ఒక మహావృక్షంగా
ఎదిగి ఒకటి కాదు..వంద కాదు..వెయ్యి కూడా కాదు..
పదివేల కుటుంబాలకు ప్రత్యక్షంగా..
లక్షల కుటుంబాలకు పరోక్షంగా నీడనివ్వడం ఒక చరిత్ర..
భారతదేశ చరిత్రలో
ఈ చరిత్ర ఒక ప్రధాన
అంతర్భాగం కూడా!
అమెరికా నుంచి రాక..
ఓమి బాబా.. సివి రామన్ లతో పరిచయం..ఆ ఇద్దరితో కలిసి పని చెయ్యడం..
ఇదంతా మరోచరిత్ర..
ఈ ప్రయాణం దేశ తొలి
అణు రియాక్టర్
తయారీలో కీలకం..
ఆ ప్రయోగంలో రావు విజ్ఞానం తలమానికం..!
తదుపరి..
1967లో రావు మస్తిష్కంలో పుట్టిన ఒక ఆలోచన..
ఆ ఏడాది ఏప్రిల్ 11 నాటికి
కార్యరూపం దాల్చి ఒక సంస్థ
భాగ్యనగరం సనత్ నగర్లో
ఒక చిన్న షెడ్డులో ఊపిరి పోసుకుంది..అదే..అదే..
ECIL..
1970 నాటికి ఆ సంస్థ సొంత భవనంలోకి మారింది.
అప్పటికి అందులో ఉద్యోగుల
సంఖ్య పదివేలు..దేశంలోని గొప్ప సంస్థల్లో ఒకటిగా..
దేశం గొప్పను
పెంచిన సంస్థగా సాంబశివరావు నేతృత్వంలో
ఎదిగింది.టీవీలు..కంప్యూటర్లు
మాత్రమే గాక ఓటింగ్ యంత్రాలతో సహా వంద రకాల యంత్రాలకు పుట్టినిల్లు ECIL..
హైదరాబాద్ నగరంలో సాంబశివరావు గౌరవార్థం
ఎ ఎస్ రావు నగర్ కూడా
ఆవిర్భవించింది..అటామిక్ ఎనర్జీ.. ఇసిఐఎల్..ఎన్ ఎఫ్ సి,
టి ఎఫ్ ఆర్ ఉద్యోగుల
ప్రయోజనార్ధం 1976లో
ECIL employees cooperative house నిర్మాణ
సొసైటీ లిమిటెడ్ ఏర్పాటులో
రావు కీలక పాత్ర పోషించారు.
శాస్త్ర రంగంలో సాంబశివరావు చేసిన విశేష కృషిని గుర్తించిన
భారత ప్రభుత్వం ఆయనకు
శాంతి స్వరూప్ భట్నాగర్
అవార్డుతో పాటు ఇచ్చి సత్కరించింది..
దేశ శాస్త్ర విజ్ఞాన రంగంలో
తనదైన ముద్ర వేయడమే గాక
ఆర్థిక అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించిన సాంబశివరావు..
గొప్ప శాస్త్రవేత్త ..
పారిశ్రామికవేత్త
మాత్రమే కాదు..అంతకు మించి
గొప్ప మానవతావాది..
మంచి యజమాని..
నిత్య కృషీవలుడు..
చివరగా..
పద్మభూషణుడు!
ఇంకా మించి..
గొప్ప పౌరుడు..
ఎన్ని ఉన్నా..
ఎన్నెన్ని విజయాలు సాధించినా..
నిరాడంబరుడు..
మహోన్నత వ్యక్తి..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
7995666286
9948546286