(బాలు అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారం చూస్తూ అశ్రునయనాలతో.. ఐదేళ్ల క్రితం.. సెప్టెంబర్ 25న నేను రాసిన ఈ నాలుగు మాటలు..చదవండి)
అక్కడ..ఆ క్షణాన
నేను చూస్తున్నది
చితిమంట కాదు..
పాటల పూదోట..
అసలది మంట కాదు..
తమ అభిమానగాయకునికి
కోట్లాది మంది ఒక్కటై
పట్టిన హారతి..
పాటలతో పరమపదానికి బాటలు వేసిన.. వేసుకున్న
సంగీత స్రష్ట..తుది మజిలీగా
అక్కడ చేరాడు..
అయితే అది శాశ్వత
విశ్రాంతి కాదు..
మళ్ళీ పుట్టి మరోసారి
మరిన్ని తరాలను అలరించేందుకు
భువికి వచ్చేలోగా
చిన్న విరామం..
ఒక విరామం..
మళ్ళీ ఆగమనం జరిగే వరకు
అక్కడ ఆగదేమో
స్వరాల సమాగమం..
సుస్వర గీతాల సంగమం..
అభిమానుల హృదయంగమం!
ఇక చదవండి కవిత..
నా హృదయ కలత..
* * *
డెబ్భై అయిదు
సంవత్సరాల జీవితం..
యాభై అయిదు వసంతాల
సినీ ప్రయాణం..
నలభై వేల పాటలు ..
వందలాది పర్యటనలు..
వేలాది కచేరీలు..
కోట్లాది అభిమానులు..
పాటే జీవితం..
సంగీతమే ప్రపంచం..!
సినిమా కోసం నువ్వు పుట్టావా
నీ కోసమే సినిమా పుట్టిందా..
నువ్వు లేని ఆ రంగాన్ని ఊహించగలమా..
నీ పాట వినిపించని ప్రపంచాన్ని నిర్మించగలమా..
నీ గమనం రాగమయం
నీ జీవితం వేద సారం
నీ స్వరం సంగీత మథనం
నీ మాట తేట తెనుగు ఊట..
నీ పాట నీ పాటవం..
పాడుతా తీయగాలో
నీ ప్రతి మాట ఓ సంగీత పాఠం
ఆపాత మధురాలు
నీ అనుభవాల కలబోతలు..!
ఎన్ని ఉదంతాలు..
ఎన్నెన్ని దృష్టాంతాలు..
నీ అనుభవాలు
నీ ముందు తరం గాయకుల
రచయితల,సంగీత దర్శకుల
నటీనటుల ప్రాభవాలు..
నీ సంగీత పరిజ్ఞానం
నీ గాన ప్రజ్ఞానం
నీ సినిమా విజ్ఞానం..
ఏం చేసినా అందే నీ ధ్యానం
అందుకే నువ్వంటే
మాకింత ఆరాధనం!
నీ బ్రతుకు సాగరసంగమం
నీ గాత్రం శంకరాభరణం
నీ గొంతు అన్నమయ్యకు
త్యాగయ్యకు ఆలవాలం
తిరిగిరాని లోకాలకు
నీ పయనం..
ఇక నీ పాటలతోనే
మా సహజీవనం..
ఒక్కడై పుట్టావేమో
ఒక్కడుగా పోలేదు..
నీ వెంట వేలాది గీతాలు
నీ పాటతోనే
ముడిపడి ఉన్న
మా జీవితాలు..
– ఎలిశెట్టి సురేష్ కుమార్
7995666286
9948546286