– కోర్టుకు వెళ్లొద్దని విజ్ఞప్తులు ఎందుకు చేస్తున్నారు ?
– అలా అయితే ఎందుకు షెడ్యూలు ప్రకటించారు?.
– ఎవరిని మోసం చేద్దామని ప్రకటించారు?.
– బీహార్, మహారాష్టలో జరిగింది తెలిసిన తరువాత కూడా తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?
– ఒక వేళ ఎన్నికలు రద్దు అయితే అభ్యర్థులు పెట్టుకున్న ఖర్చుకు ఎవరు బాద్యులు?.
– ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా
– అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంకు మద్దతు పలికిన తరువాత మళ్లీ అఫిడవిట్ ఎందుకు?
– హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులతో ఎంపీ. ఈటల రాజేందర్ సమీక్ష
కమలాపూర్: నిన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది. కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చినట్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నాం. అసెంబ్లీ కౌన్సిల్లో తీర్మానాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ నిర్ణయం తీసుకున్నందుకు మేమందరం హర్షద్వానాలు వ్యక్తం చేశాము. 42% రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు.
గ్రామాల్లో వార్డ్ మెంబర్లు సర్పంచులు, మండలాల్లో ఎంపీటీసీలు ఎంపీపీలు, జిల్లాలో జడ్పిటిసిలు జడ్పీ చైర్మన్లు ప్రజలకు అందుబాటులో ఉంటారు. రెండు సంవత్సరాలు అవుతున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడుగా మారిపోయాయి. ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచడం కోసం వెంటనే ఎన్నికలు జరపాలని అనేకసార్లు డిమాండ్ చేశాము.
నిన్న ప్రకటించిన రిజర్వేషన్ల లిస్టులో.. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం..
కొన్ని తండాలలో బీసీలు, ఓసీలు లేకపోయినా బిసి రిజర్వేషన్లు ఆ గ్రామానికి ప్రకటించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో తూర్పు తండా, లుణావత్ తండా, మాన్ తండా, జైత్రంత తండా, బడవత్ తండా, గోన్యతండా, బాలాజీనగర్ గ్రామపంచాయితలలో.. ఎస్టీలు తప్ప బీసీలు లేరు. కానీ బీసీలకు రిజర్వ్ చేశారు.
మాడుగులపల్లి మండలం అంబాపురం గ్రామంలోఎస్సీలు లేరు కానీ ఎస్సీకి రిజర్వ్ చేశారు. అడవిదేవులపల్లి మండలంలో సాంపుల్ తండా బీసీ లేకున్న బీసీకి కేటాయించారు. కామారెడ్డి జిల్లా నుస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామపంచాయతీని ఎస్టీకి రిజర్వేషన్ చేశారు కానీ అక్కడ లేరు.
నిర్మల్ జిల్లా మామిడ మండలంలో వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో ఎస్సీలు మాత్రమే ఉన్నారు కానీ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగడితండా 829 ఓట్లు ఉంటే అందరూ ఎస్టీలే కానీ సర్పంచ్ బిసి మహిళకు కేటాయించారు. ఇలా 14 ప్రాంతాల్లో సంఘటనలు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చాయి..
హుజరాబాద్ నియోజకవర్గంలో సీతంపేట గ్రామంలో ఒకటో రెండో ఓసి కుటుంబాలు ఉంటాయి. అందరూ యాదవ ముదిరాజ్ ఉంటారు. కానీ ఆ గ్రామంలో ఓసికి కేటాయించారు. కమలాపూర్ మండలం గుండేడు ఒకటి రెండు కుటుంబాలు వైశ్య కుటుంబాలు ఉంటాయి అక్కడ కూడా ఓసి కి కేటాయించారు.. ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లిలో ఒకటో రెండో కుటుంబాలు ఉంటే అక్కడ కూడా ఓసికి కేటాయించారు.
వాగొడ్డురామనపల్లెలో ముదిరాజులు పెరిక యాదవులు ఉంటారు కానీ ఆ గ్రామాన్ని కూడా ఓసీకి కేటాయించారు. హుజురాబాద్ నియోజకవర్గంతొమ్మిది పది గ్రామాలలో ఇలాంటి తప్పులు జరిగాయి. అంటే 119 నియోజకవర్గాల్లో 80 పైగా రూరల్ నియోజకవర్గాలలో ఎన్ని తప్పులు దొర్లి ఉంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికాలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని ప్రకటన చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
బీహార్‌లో 2023లో బీసీ రిజర్వేషన్లు 65 శాతానికి పెంచారు. సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. మహారాష్ట్రలో 2021 లో వికాస్ కిషన్ రావు గవాలి సుప్రీంకోర్టుకు పోతే 5 జిల్లాల జరిగిన ఎన్నికలు రద్దు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేసినం, కులగణన చేసినం, బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై ఎంపెరికల్ డాటా సేకరించినం. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానాలు తప్పు పట్టమని అన్నారు. సంతోషం దానికి మేమేమి వ్యతిరేకించడం లేదు.
కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు పొన్నం ప్రభాకర్ వారి సహచరులు ఎవరూ కూడా కోర్టుకు వెళ్లకండి సహకరించండి అని అప్పిల్ చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను.. మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళితే వచ్చిన నష్టం ఏంటి ?
మీరే అంటున్నారు ఎంపరికల్ డేటా సేకరించాము. డెడికేషన్ కమిషన్ వేసాము… రెండు సభలలో యునానిమస్ గా తీర్మానం చేసినం. ఇంత చేసి చేసిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్లొద్దు అని అంటున్నారు అంటే దానినిబట్టే అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్లిన కోర్టులో ఇది నిలువదు అనే భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూలు ప్రకటించారు. ఎవరిని మోసం చేద్దామని ప్రకటించారు.
నిన్న మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 8వ తేదీ కోర్టు నిర్ణయం ప్రకారమే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. అంటే ఎక్కడో మీరు చేసింది తప్పు అనే విషయం మీ అంతరాత్మకు తెలుసు. ఇంత తెలిసిన తరువాత కూడా ఇది కోర్టులో నిలవదు అని తెలిసిన తర్వాత ఎలా ప్రకటించారు.
ఈ రాష్ట్రంలో 1,12,000 మంది వార్డు మెంబర్లు, 12765 మంది సర్పంచులు, సుమారు 5800 ఎంపీటీసీలు, 650 మంది జెడ్పిటిసిలకు సుమారు 5 లక్షల మంది పోటీ చేస్తారు. పోటీలో ఉన్న లక్షలమంది.. వార్డు మెంబర్ తో సహా అంతో ఇంతో ఖర్చు పెట్టుకుంటారు. ఎన్నికల నిబంధనలు ఎన్ని ఉన్నా డబ్బులు పంచి పెట్టవద్దు అని చెప్పిన ఎన్నికల సమయంలో గ్రామాల్లో దావతులు సహజం, డబ్బులు ఖర్చు పెట్టడం ఆగడం లేదు.
నా బాధ ఏంటంటే.. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల్లో పోటీ చేసే వారందరూ ఖర్చుకు సిద్ధమయ్యారు. దసరా పండుగ నిన్నటి నుంచి ఉత్సాహం మొదలైంది డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకుంటే దీనికి బాధ్యులు ఎవరు?
ప్రభుత్వపరంగా చెప్పాల్సింది ఏంటంటే.. మీరే ప్రెస్ మీట్ పెట్టి ఎనిమిదవ తేదీ వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు నిర్ణయం వెలువడించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పాలి తప్ప అదరాబాదరగా షెడ్యూల్ ప్రకటించి ఇబ్బందులు పెట్టవద్దు. ఇంత పెద్ద గంభీరమైన విషయంలో.. బీహార్ మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలిసిన తర్వాత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇలా మాట్లాడుతున్నానని నేను దేనికి వ్యతిరేకం కాదు. మీరు తీసుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్‌కు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాము మేము బీసీలకు రావాల్సినవి కావాలని కోరుతున్నాము. తప్పకుండా వెంటనే ఎన్నికలు జరపాలని కూడా కోరుతున్నాము.
ఇలా మాట్లాడుతున్నామని బురదజల్లే ప్రయత్నం చేయవద్దు. దాడి చేసే ప్రయత్నం బందు పెట్టి.. నిజాయితీగా మీ అంతరంగం ప్రకారం ప్రజలకు సూచన చేసి మార్గదర్శన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
అన్నిటికంటే అత్యున్నతమైనవి చట్టసభలు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు పవిత్రతకు నిలయమైనవి చట్టసభలు. అసెంబ్లీ వేదిక మీద భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన తర్వాత, మళ్లీ అఫిడవిట్ సమర్పించాల్సిన కర్మ ఎందుకు పట్టిందో వారే సమాధానం చెప్పాలి. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అనుభవం లేకపోతే ఎలా ఉంటుందో దీనికి నిదర్శనం. నేర్చుకునే ప్రయత్నం చేయండి.
ఎన్నికల కమిషన్ లో పనిచేసిన వారు, న్యాయ కోవిదులు, అనేకమంది అనుభవజ్ఞలు వీరు చేసిన పని చూసి నవ్వుకుంటున్నారు, మోసం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజలకు నిజమైందో చెప్పే బాధ్యత మీ పైన ఉంది అని మనవి చేస్తున్నాను.
ప్రభుత్వం ముందుకు వచ్చి మేము షెడ్యూల్ ప్రకటించాము రిజర్వేషన్లు యధావిధిగా ఉంటాయి ఎన్నికలు ఎలా విధిగా జరుగుతాయి.. మీరు ఎవరి మాట నమ్మాల్సిన అక్కర్లేదు దానికి పూర్తి బాధ్యత మాదే అని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను.
2023- 24 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే బాగుండేది..
కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం చేశారు కాబట్టి ఈ రిజర్వేషన్లు తప్పులతడకలా ఉంది. రిజర్వేషన్లు ఇన్ని తప్పులు దొర్లడం బాధ్యతారహిత్యానికి నిదర్శనం. అణగారిన వర్గాలకు ఎలాంటి నష్టం జరిగినా మా పార్టీ నేను అండగా ఉంటాము.