– రెండు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ రక్త మార్పిడి సేవల విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో “రక్త సేకరణ-సద్వినియోగం” అనే అంశంపై మంగళవారం నుండి రెండు రోజులపాటు నిర్వహించే జాతీయస్థాయి సదస్సును వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కేంద్ర ప్రభుత్వ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతాశర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మేఘా ప్రవీన్ ఖోబ్రాగడే, నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ క్రిషన్ కుమార్, డబ్ల్యూహెచ్వో ఇండియా కంట్రీ ఆఫీస్ నుండి డాక్టర్ మాధుర్ గుప్తా, ఏపీ శాక్స్ పీడీ డాక్టర్ కె. నీలకంఠారెడ్డి పాల్గొంటారు.
సదస్సు లక్ష్యాలు
ఎంతో విలువైన రక్తాన్ని అవసరమయ్యే సమయంలో వినియోగించడం, రక్తం, రక్తం ఉత్పత్తుల వినియోగంలో సురక్షిత విధానాల్ని అవలంబించడం, రక్త సేకరణ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం, శిక్షణా కార్యక్రమాల ద్వారా రక్త మార్పిడి సేవల నాణ్యతను పెంచడం, నూటికి నూరు శాతం స్వచ్ఛంద రక్తదానాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా యువత, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి కీలకాంశాలపై నిపుణులు మాట్లాడతారు.
రక్తదానంపై అవగాహనా కార్యక్రమాలు
రాష్ట్ర రక్తమార్పిడి మండలిని బలోపేతం చేయడం, రక్తదానంపై ప్రతి జిల్లాలో శిబిరాల్ని నిర్వహించి యువతకు ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించి రక్తదానం చేసేందుకు ముందుకొచ్చేలా వారిని చైతన్యపర్చడం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్ని నిర్వహించడం, ఆధునిక పరీక్షా పరికరాల్ని సమకూర్చుకోవడం, శీతలీకరణ సౌకర్యాలతో రక్త కేంద్రాల్ని అప్గ్రేడ్ చేయడం, రక్తదానంపై ముఖ్యంగా మహిళల్లో అపోహల్ని తొలగించడం వంటి చర్యల్ని చేపట్టే దిశగా ఏపీశాక్స్ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ బ్యాంకుల్ని బలోపేతం చేసిన ఏపిశాక్స్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన రక్తాన్ని సరఫరా చేసేందుకు కృషి చేస్తోంది