– టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేనే బయటపెట్టారు
– జూదగృహాలను పోలీస్ అధికారులే ప్రోత్సహిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం వెల్లడి
– గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు తెస్తారు?
– ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ పచ్చి అబద్దం
– గూగుల్‌తో దీనిపై ప్రకటన చేయించగలరా?
– గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధులతో మరణ మృదంగం
– హాస్టళ్ళలో జ్వరాలు, పచ్చకామెర్లతో విద్యార్ధుల మరణాలు
– సమ్మెలో పీహెచ్సీ, సీహెచ్‌సీ వైద్యులు
– కాకినాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్రజిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
కాకినాడ: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి విక్రయాలు, జూదగృహాల నిర్వహణ, సివిల్ పంచాయతీలతో ప్రజలను దోచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు.
ప్రజా సమస్యల కన్నా లేని గొప్పలు చెప్పుకోవడానికే కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మద్దతు, రాష్ట్రంలో జనసేనతో అవగాహన ఉంది, ఎవరూ తమను ఏమీ చేయలేరనే ధీమాతో తెలుగుదేశం పార్టీ ఉంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నుంచి ఉత్తరాంధ్రలోని పరవాడ వరకు నకిలీ మద్యం దందా నడుస్తోంది. కుటీర పరిశ్రమ మాదిరిగా ఈ నకిలీ మద్యం దందాను నడుపుతున్నారు.
తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనపార్టీకే చెందిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపైన చేసిన ఆరోపణలను పత్రికల్లో చూస్తున్నాం. ఎంపీ చిన్ని ప్రోత్సాహంతో ఆయన అనుచరులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని సాక్షాత్తు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే వెల్లడించారు. అంటే అటు నకిలీ మద్యం, ఇటు గంజాయి అమ్మకాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనేది బయటపడింది.
ఇక ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రభుత్వంలో పేకాట శిబిరాల నిర్వహణపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలంటూ ఏకంగా లిఖితపూర్వకంగా లేఖ రాశారు. జూదం ఆడటం, ఆడించడం, ప్రోత్సహించడం, కొందరు పెద్దలు పేకాట శిబిరాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్ళను అధికారులకు అందిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి, దీనిపై విచారణ జరిపి, నిజానిజాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా డిప్యూటీ సీఎం విడుదల చేసిన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో జూదశిబిరాలపై ఆందోళన చెందుతూ ఒక డిప్యూటీ సీఎం లేఖ రాసి, పోలీస్ అధికారులను నివేదిక కోరారంటేనే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం ఎస్పీకి రాసిన లేఖలో డిఎస్పీపై ఆరోపణలు వస్తున్నాయని, జూదం, ప్రైవేటు పంచాయతీల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని పలువురు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనేందుకు, జూద గృహాలను పోలీసులే ప్రోత్సహిస్తున్నారనేందుకు డిప్యూటీ సీఎం రాసిన లేఖే నిదర్శనం.
‘పేకాట మా ప్రాంతంలో ఊపిరి, సుప్రీంకోర్టు సైతం దీనిని తప్పుపట్టలేదు, పదమూడు ముక్కల ఆటలు ఆడవచ్చు’ అంటూ అదే ప్రాంతానికి చెందిన డిప్యూటీ స్పీకర్ తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయని చెప్పారో, ఆ అధికారి మంచి వ్యక్తి అని డిప్యూటీ స్పీకర్ కితాబు ఇచ్చినట్లుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. నవకల్పనలు అంటే గంజాయి, నకిలీ మద్యం, పేకాట, పందాలు, సివిల్ పంచాయతీలు… ఇవేనా? ప్రజలు అడిగేవాటికి సమాధానం చెప్పకుండా, తనకు తోచినవే వినాలనే స్థాయికి సీఎం చంద్రబాబు వచ్చేశారు.
2020లోనే ఆనాడు సీఎంగా వైయస్ జగన్ విశాఖలో డేటా సెంటర్ పెట్టేందుకు ఆదానీతో ఒప్పందం చేసుకుంది. 3900 కిలోమీటర్ల మేర సముద్రంలో కేబుల్ లైన్ వేయాల్సి ఉన్నందున వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో 2021 మార్చి 9న చర్చలు జరిపింది. 2023 మే 3న సీఎంగా వైయస్ జగన్ ఆదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆదానీ డేటా సెంటర్ అనే మాట వాడకుండా, గూగుల్ డేటా సెంటర్‌ను తామే విశాఖకు తీసుకువచ్చామంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకుంటున్నారు. ఇదే అంశంలో ఆదానీ సంస్థల అధినేత గౌతం ఆదానీ ఒక ట్వీట్ చేశారు. ‘గూగుల్‌తో కలిసి విశాఖ లాంటి చోట ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌తో డేటా సెంటర్‌ను నిర్మాణం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం, దీనివల్ల ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందంటూ’ ఆయన ట్వీట్ చేశారు.
గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని నారా లోకేష్ ప్రకటించారు. దీనిని గూగుల్ ఎక్కడా ధ్రువీకరించడం లేదు. నిజంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి. ప్రజలను మోసం చేయవద్దు, యువతను భ్రమల్లో పెట్టవద్దని మాత్రమే కోరుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌కు ఉన్న ఉద్యోగుల సంఖ్య గత జూన్ 30వ తేదీ నాటికి 1,87,103 మంది. 2024 సంవత్సరం ఆఖరి నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య 1,83,000 అంటే కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే పెరిగారు.
దీనికి మంత్రి నారా లోకేష్ చెప్పేదానికి ఎక్కడా పొంతన లేదు. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్, పోర్ట్, ఇతర అన్ని రంగాలు కలిపినా కూడా 2 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలే ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క డేటా సెంటర్ ద్వారా ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని నారా లోకేష్ చెప్పడం మోసం కాదా? మొదటి సారి రాష్ట్ర చరిత్రలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలో ఉన్నాయి. ఆ ఆసుపత్రులను పిలిచి మాట్లాడే తీరిక కూటమి పెద్దలకు లేదు.
రూ.3వేల కోట్ల బకాయిలు ఉంటే, రూ.250 కోట్లు రిలీజ్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలా రిలీజ్ చేస్తే ఈ ఆసుపత్రులు ఎందుకు సమ్మె చేస్తున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పేదల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పిహెచ్సీలు, సీహెచ్‌సీ వైద్యులు పోరుబాటలో ఉన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హాస్టళ్ళలో విద్యార్ధులు రోగాల బారిపడి మరణిస్తున్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్యం పూర్తిగా పడకేసింది.