1900-10 దశాబ్దిలో కర్ణాటక సంగీతం కొన్ని కారణాలవల్ల జనాదరణకు దూరమైపోయింది. ఆ దశలో మహారాజపురం విశ్వనాద అయ్యర్, అరియక్కుడి రామానుజ అయ్యంగార్, చెంబై వెద్దియనాద బాగవదర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జీ.ఎన్.బాలసుబ్రమణియన్ ఈ ఐదుగురూ పంచప్రాణాలై కర్ణాటక సంగీతానికి కొత్త జీవితాన్నిచ్చారు; తమ మేధతో, ప్రతిభతో కర్ణాటక సంగీతానికి విభవాన్ని తీసుకువచ్చారు. ఈ ఐదుగురి తరువాత కర్ణాటక సంగీతంలో ఒక పెను విప్లవం వచ్చింది. ఆ విప్లవం పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ! బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతపు వెల్లువయ్యారు; జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రవహించారు.
‘కర్ణాటక సంగీత సంగతి’ బాలమురళీకృష్ణ. సాహిత్యాన్ని చంపకుండా, జిడ్డు లేకుండా గొప్పగా పాడగలిగిన వారు బాలమురళి. తొలిదశలో జీ.ఎన్. బాలసుబ్రమణియన్ శైలిని ఆదర్శంగా తీసుకున్నారు; అటుపై తనదైన తీరులో విజృంభించారు; కర్ణాటక సంగీతాన్ని తన గానంతో ఉజ్జ్వలనం చేశారు. కాల క్రమంలో కర్ణాటక సంగీత గానానికి అత్యవసరమైన ఆదర్శమయ్యారు బాలమురళి. కర్ణాటక సంగీత వైతాళికుడు బాలమురళీకృష్ణ. బాలమురళీకృష్ణది పురుషగాత్రం (baritone). వారి పురుష గాత్రంలో, వారి పురుష గాత్రంతో కర్ణాటక సంగీతం ఉన్నతమైన ఇంపును, సొంపును సంతరించుకుంది. హిందూస్థానీ గాయకులలోనూ, ఇంగ్లిష్ గాయకులలోనూ ‘స్వర సమం’ (తాళ సమం కాదు) ఉంటుంది. దక్షిణాది గాయకుల్లో స్వర సమం అరుదైందే. ఆ స్వర సమం బాలమురళి గానంలో ఉంటుంది.
బాలమురళి పురుష గాత్రమూ, స్వర సమమూ కర్ణాటక సంగీత గానానికి మిన్న అయిన వన్నెను తీసుకు వచ్చాయి. సంగీతంలో బాలమురళి ఎన్నో ప్రయోగాలు చేశారు. తన ప్రయోగశీలత్వంతో కొత్త రాగాల్ని కనిపెట్టారు. తాళ గతి సూక్ష్మ భేదాలను కూడా దర్శించి అమలులోకి తెచ్చారు. బాలమురళి సంగీత స్రష్ట , ద్రష్ట. గాత్ర సంగీతమే కాదు వైఅలిన్ (violin) వంటి కొన్ని వాయిద్యాలను బహునేర్పుతో వాయించేవారు బాలమురళి. ఒక దశలో బాలమురళి పాడేది కర్ణాటక సంగీతం కాదని సెమ్మంగుడి శ్రీనివాస అయ్యార్ మద్రాస్ హైకోర్ట్‌లో కేసు వేశారు! ఆ కేసులో బాలమురళి విజయం సాధించారు. బాలమురళి విజయం కర్ణాటక సంగీతం విజయం. బాలమురళి స్ఫూర్తిగా కర్ణాటక సంగీతంలో పలువురు గాయకులు వచ్చారు. వారివల్ల కర్ణాటక సంగీతంలోకి విశేషమైన మేధ వచ్చింది.
బాలమురళి వేదిక ఎక్కగానే సరస్వతి వారిని అవహిస్తుంది. వారు సంగీతం పాడుతారు అని చెప్పడం కన్నా ‘సంగీతం బాలమురళితో తనను తాను పాడుకుంటుంది’ అని అవగతం చేసుకోవడం సరైనది ఔతుంది. మామూలుగా శాస్త్రీయ సంగీత గాయకులు కఠోరమైన సాధన చేస్తారు; బాలమురళి చెయ్యరు. సభలో పాడడానికి కూర్చున్నాక, గళం విప్పాక వారి నుంచి సంగీతం ప్రవహిస్తుంది. ఆదిభట్ల నారాయణ దాసు తన హరిశ్చంద్రోపాఖ్యానంలో “నా నాల్క యద్దంబున బూని నిన్నే చూచుకో” అని అమ్మవారిని కోరుకుంటారు. మఱి బాలమురళి కూడా అలా అమ్మవారిని కోరుకున్నారేమో? బాలమురళిలో సంగీత సరస్వతి తనను తాను చూసుకుంటూ ఉంటుందేమో?! ఒక బాలమేధావిగా బాలమురళి తన సంగీత పయనాన్ని మొదలు పెట్టారు.
వేలాది కచేరీలుగా వారి గాన గమనం సాగి, సాగి పలు ఎత్తులను ఆలింగనం చేసుకుంది. లోక గానంలో, గాన లోకంలో బాలమురళి ఒక శిష్టమైన, విశిష్టమైన గమకం! మనదేశంలో ఒకదశలో హిందూస్థానీ శాస్త్రీయ సంగీత గాయకులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఆ దశలో బాలమురళి తన మేధ, ప్రతిభ, ప్రజ్ఞ, ప్రౌఢిమతో హిందూస్థానీ శాస్త్రీయ సంగీత గాయకులు ఆమిర్ ఖాన్, అజయ్ చక్రవర్తి, భీమ్సేన్ జోషీ వంటి ఉద్దండులకు సమ ఉజ్జీ అయ్యారు. వాళ్లతో జుగల్ బందీలు చేసి రసజ్ఞుల చేత షాబాష్ (శెహబాష్ లేదా శభాష్ అనడం సరికాదు) అనిపించుకున్నారు.
ఒక కర్ణాటక సంగీత గాయకుడుగా బాలమురళి జాతీయ, అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని, ఖ్యాతిని పొందారు. కర్ణాటక సంగీత గాయకుడు, సంగీతజ్ఞుడు మాత్రమే కాదు బాలమురళి ఒక శాస్త్రీయ సంగీత పరిశోధకుడు కూడా. విశేషమైన సంగీత కళాకారుడు మాత్రమే కాదు వారు ఒక కవి కూడా. అద్భుతమైన కీర్తనలు రాశారు. తెలుగు, తమిళ్ష్, కన్నడం, సంస్కృతం భాషల్లో కీర్తనలు రాశారు. వారి రచనలు కొన్ని ‘సూర్యకాంతి’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. అందులో వారు రాసిన వర్ణాలు, కృతులు, తిల్లానాలు కూడా ఉన్నాయి. వారు మంచి వచనం కూడా రాశారు. అంత త్యాగయ్య కూడా 72 మేళకర్త రాగాలు అన్నిటిలోనూ కృతులు రాయలేదు.
బాలమురళి తన 15 సంవత్సరాల వయసుకే 72 మేళకర్త రాగాలకూ కృతులు రాశారు! మేధ… మేధ… మేధ... బాలమురళి అన్న మేధ కర్ణాటక సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది. బాలమురళి కర్ణాటక సంగీతాన్ని, గాన విధానాన్ని చేపట్టిన తీరు మేధాత్మకం; మహోన్నతం. కర్ణాటక సంగీతం రాగ, స్వర, తాళ మయంగా మాత్రమే ఉన్న దశలో వాటితో పాటు భావ మయంగానూ పాడారు బాలమురళి. స్వరాల్ని మాత్రమే కాదు సాహిత్యాన్నీ పాడారు బాలమురళి. విద్వత్తో పాటు విజ్ఞతతోనూ పాడారు బాలమురళి.
వారు కర్ణాటక సంగీత గానానికి ఎల్లలు లేని రంజకత్వాన్ని తీసుకువచ్చారు. కర్ణాటక సంగీత గానంలోకి పెద్ద స్థాయిలో మేధ చొచ్చుకుని రావడానికి బాలమురళి స్ఫూర్తి; ప్రేరణ. బాలమురళి బెంగాలీ రవీంద్ర సంగీతాన్నీ గొప్పగా పాడారు. బాలమురళి పాడిన భద్రాచల రామదాసు కీర్తనలు ప్రశస్తమైనవి. అన్నమయ్య కీర్తనల్నీ ప్రశస్తంగా పాడారు బాలమురళి. బాలమురళి సినిమా పాటలూ పాడారు. బాలమురళి పాడిన తెలుగు, సంస్కృతం, తమిళ్ష్, కన్నడం భాషల సినిమా పాటలన్నీ గొప్పగా రాణించాయి. హంసగీతె అన్న కన్నడం సినిమాలో పాడినందుకు ఉత్తమ జాతీయ గాయకుడుగానూ, మధ్వాచార్య అన్న కన్నడం సినిమాకు సంగీతం చేసి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగానూ కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను అందుకున్నారు.
గాయకుడుగాను, సంగీత దర్శకుడుగానూ జాతీయ ప్రభుత్వ పురస్కారాల్ని అందుకున్నారు బాలమురళి! బాలమురళి సినిమా నటుడు కూడా. ఈ వ్యాస రచయిత తన చిన్నప్పుడు ఒక సందర్భంలో సభా మర్యాదకు విరుద్ధంగా గొప్ప గానంగా పరిగణించబడిన ఓ పేరున్న గాయకుడి పాటకు పెద్దగా నవ్వేస్తే బాలమురళి చటుక్కున చూసి మెచ్చుకోలుగా చేతితో సైగ చెయ్యడం ఆశ్చర్యాన్నిస్తుంది. ఈ సంఘటన బాలమురళి తత్త్వాన్ని, తీరును తెలియజేస్తుంది.
బాలమురళి విజయవాడను విడిచి మద్రాసుకు చేరి అక్కడే నివసించడంవల్ల వారికీ, సంగీతానికీ ఎనలేని మేలు జరిగింది. ఆంధ్రలోనే ఉండి ఉంటే బాలమురళి ఈ మేరకు రాణించి ఉండేవారు కాదు. 25,000కు పైగా కచేరీలు చేశారు బాలమురళి. ఎన్నెన్నో పురస్కారాల్ని, పలు రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాల్ని, పలు బిరుదుల్ని పొందారు; పద్మవిభూషనణ్ పురస్కారాన్నీ అందుకున్నారు బాలమురళి. ఉన్నప్పుడే వారికి భారతరత్న వచ్చి ఉంటే బావుండేది. భవిష్యత్తులో బాలమురళీకృష్ణకు తప్పకుండా భారతరత్న పురస్కారం వస్తుంది. తెలుగు జాతికి, భారతదేశానికి గర్వకారణం బాలమురళీకృష్ణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజిల్లిన తొలి దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీత గాయకుడు బాలమురళీకృష్ణ. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ‘సంగీత నిజ విద్వత్సరళి!’

– రోచిష్మాన్
9444012279