– ఎంపీ వద్దిరాజు డిమాండ్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పదవీ కాలంలో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. హైదరాబాద్ మెట్రో,మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం (ఏంఏంటీఏస్) రెండింటి రెండవ దశల ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రవిచంద్ర కోరారు.రాజ్యసభలో శుక్రవారం జీరో అవర్ లో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య తెలంగాణ ప్రజల దైనందిన జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయన్నారు.
కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు సజావుగా ఉండడం,చేపట్టిన సంస్కరణలు, మంత్రి కే.టీ.రామారావు కృషితో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో ఐటీ, ఫార్మా రంగాలు పురోభివృద్ధి చెంది హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదాల్చిందని ఎంపీ రవిచంద్ర వివరించారు. దీంతో, వాహనాల సంఖ్యతో పాటు రాకపోకలు బాగా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తమ పార్టీ పాలనలో నగరంలో రద్దీ బాగా ఉన్న చోట్ల రోడ్ల విస్తరణ,ఫ్లైఓవర్స్, అండర్ పాసుల నిర్మాణాలు జరిగాయని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
రోజురోజుకు వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిందని వివరించారు. ట్రాఫిక్ సమస్య కారణంగా వాహనదారులు, ప్రయాణీకులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తున్నదని ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల దైనందిన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ సమస్య సత్వర పరిష్కారానికి గాను పెండింగులో ఉన్న మెట్రో ఫేజ్ -||, ఏంఏంటీఏస్ ఫేజ్-|| ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.