* రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో జగన్ మైండ్ బ్లాంక్
* సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు అబద్ధాలతో ప్రచారాలు
* గత ప్రభుత్వంలో హాస్టళ్లను, గురుకులాలను గాలికొదిలేశారు
* పరకామణి చోరీ చిన్న నేరమా..?
* వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఖాయం : మంత్రి సవిత
* సోమందేపల్లి జెడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
సోమందేపల్లి/శ్రీసత్యసాయి : రాష్ట్రంలో జగన్ తప్ప ప్రజలంతా కూటమి పాలనతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 18 నెలల కాలంలోనే సీఎం చంద్రబాబునాయుడు తన అనుభవంతో రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో, జగన్ మైండ్ బ్లాంకై అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో గాడి తప్పిన విద్యా వ్యవస్థను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గాడిన పెడుతున్నారన్నారు.
ఒకవైపు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తూనే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తల్లికి వందనం పథకం అమలుతో పాటు విద్యామిత్ర కిట్లు అందజేశామన్నారు. సోమందేపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పెద్దపీట వేస్తోందన్నారు.
ఉచిత ఇసుక, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఫ్రీ బస్, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ల..ఇలా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనంతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా మిత్ర కిట్లు అందజేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. త్వరలో అర్హులైన పేదలందరి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. జగన్ హయాంలో నిలిచిపోయిన ఇళ్లకు నిధులందజేసి, నూతన గృహా ప్రవేశాలు కూడా చేపట్టామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్ అందజేస్తున్నామన్నారు. రాజధాని అమరావతిని, పోలవరం పనులు చేపట్టామని, శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తప్పా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి సవిత తెలిపారు.
హాస్టళ్లను, గురుకులాలను గాలికొదిలేసిన జగన్ జగన్ అసమర్థ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల డైట్, కాస్మోటిక్ బిల్లులు సైతం చెల్లించలేదన్నారు. చివరికి పోయిన బల్బు మార్పుకోడానికి కూడా నిధులివ్వలేదన్నారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించిన బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లు 70 నుంచి 80 శాతం పూర్తయినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హాస్టళ్ల మరమ్మతులతో పాటు డైట్, కాస్మోటిక్ బకాయిలు సైతం చెల్లించామన్నారు. ఇదే సోమందేపల్లిలోని బాలికల హాస్టల్ కు నిధులిచ్చి అభివృద్ధి చేశామన్నారు. త్వరలో సోమందేపల్లిలో బీసీ బాలుర హాస్టల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదు ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చేసి, మూడు ముక్కలాట ఆడారని మంత్రి సవిత మండిపడ్డారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిపోయిందన్నారు. రాజధాని అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదని మంత్రి స్పష్టంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తోందన్నారు. భావి తరాలకు అభివృద్ధి చెందిన రాజధానిని అందివ్వాలని సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఖాయం పరకామణి చోరీ ఘటనపై జగన్ వ్యాఖ్యలను మంత్రి సవిత తప్పుబట్టారు. పరకామణి చోరీ చిన్న దొంగతనం అనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
భక్తుల మనోభాలను దెబ్బతీసేలా చోరీలు జరగడంపై క్షమించరాని నేరమన్నారు. పరకామణి చోరీ జగన్ కు చిన్న దొంగతనం కావొచ్చని, కాని కోర్టులకు ఇది పెద్ద నేరమేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడున్న 11 సీట్లు కూడా గల్లంతై, గుండా సున్నా మిగలడం తథ్యమన్నారు. మెగా పీటీఎం సూపర్ సక్సెస్ గాడి తప్పిన విద్యా వ్యవస్థను సక్రమ మార్గంలో పెట్టడానికి మంత్రి లోకేష్ రేయింబవళ్లు పనిచేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు చర్యలు తీసుకొంటున్నారన్నారు. ఇప్పటి వరకూ మూడు మెగా పేరెంట్స్ మీటింగ్ లను నిర్వహించామన్నారు.
పాఠశాలల నిర్వహణతో పాటు విద్యార్థుల విద్యా ప్రగతిని కూడా తల్లిదండ్రులు తెలుసుకోడానికి ఈ మెగా పీటీఎం ఎంతోగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ సమావేశాల నిర్వహణపై విద్యార్థుల్లో తలిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోందని మంత్రి సవిత వెల్లడించారు. మెగా పీటీఎం సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మంత్రి సవిత భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనందరావు, సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, ఆయా కార్పొరేషన్ డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

