విజయవాడ: పశ్చిమ నియోజక వర్గం జోజి నగర్ లో 42 ఇళ్లను కోర్టు ఆదేశాలతో కూల్చివేత వ్యవహారం రెండు రోజులుగా నడుస్తోంది. జీవిత కాల కష్టాన్ని ఒక్కరోజులో నేలమట్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమే అసలు దోషిగా కనిపిస్తుంది. కోర్టు ద్వారా భూమిని స్వాధీనం చేసుకున్న లక్ష్మీ రామా కో ఆపరేటివ్ సొసైటీ తాము చట్ట ప్రకారం భూమిని స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది. 1982లో రెండున్నర ఎకరాల భూమిని రెండున్నర లక్షల రూపాయల ఖరీదుతో కొనుగోలు ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ కోసం రూ. 79 వేలు చెల్లించామని, తర్వాత భూమి యజమానులు ఇస్మాయిల్, అతని కుమారుడు మజీద్ వేరొకరికి అమ్మారని సొసైటీ ప్రతినిధి హరి శుక్రవారం చెప్పారు.
84 నుంచి కోర్టులో వివాదం ఉందని 95లో అగ్రిమెంట్ ప్రకారం మిగిలిన మొత్తం కోర్టుకు చెల్లించినట్టు చెప్పారు. వివాదం కోర్టులో ఉన్న సమయంలోనే భూమి చేతులు మారిపోయింది. ఆ తర్వాత హై కోర్టు, సుప్రీం కోర్టు వరకు వివాదం నడిచిందని, కింద కోర్టు తీర్పు ప్రకారమే భూమి తమకు వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో భూమి యజమానులు వాటిని ఫ్లాట్లుగా వేసి అమ్మేశారని 2014 తర్వాత వాటిలో ఇళ్ల నిర్మాణం జరిగిందని చెబుతున్నారు. భూమి వ్యవహారం కోర్టులో ఉందని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నోటీసులో కూడా ఉందని సొసైటీ చెబుతోంది.
ఈ మొత్తం వ్యవహారం చూశాక భూమి యజమానులు ఒకరితో అగ్రిమెంట్ చేసుకుని, దానిని రద్దు చేసుకోకుండా, వివాదం ఎటు తేలక ముందే ఇతరులకు స్థలం అమ్మేశారు. 42 మంది 1995 నుంచి 25- 30ఏళ్లలో దశల వారీగా ఇళ్ళు కట్టుకున్నారు. ఆ ఇళ్ల కొనుగోలుకు చట్ట ప్రకారం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రభుత్వ ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ స్థలాల్లో టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతితో ఇల్లు కట్టుకుని మునిసిపల్ కార్పొరేషన్ కు పన్నులు చెల్లిస్తున్నారు. కరెంట్ కనెక్షన్ ఇచ్చారు.
నీటి కుళాయి కనెక్షన్ ఇచ్చారు.vmc ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కోర్టు వివాదంలో ఉన్న భూమిలో జరుగుతున్నాయని ప్రభుత్వ శాఖలకు తెలియదా, కోర్టులు అంటే వాటికి లెక్క లేదు అనుకోవాలా? 40 ఏళ్ల క్రితం రెండున్నర లక్షలు విలువ చేసే రెండున్నర ఎకరాల భూమి విలువ కోట్లలో ఉంటుంది.
ఆ భూమిలో కట్టిన ఇళ్లు కూల్చివేసి అగ్రిమెంట్ చేసుకున్న వారికి స్వాధీనం చేసుకునే క్రమంలో బాధితులు నష్ట పోవడానికి కారణమైన ప్రభుత్వ శాఖలు, అధికారుల మీద కేసులు నమోదు చేయాలి కదా..! ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇళ్ల నిర్మాణానికి డెవలప్మెంట్ ఫీజులు వసూలు చేసి, పన్నులు కట్టించుకున్నపుడు నష్టపోయిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా…! ఇక్కడ భూమి క్రయ విక్రయాల మీద వివాదం ఉంది, కొంటే నష్టం జరుగుతుంది అని అప్రమత్తం చేయని సబ్ రిజిస్టర్, వివాదాస్పద భూమిలో నిర్మాణానికి అనుమతి ఇచ్చిన టౌన్ ప్లానింగ్, కార్పొరేషన్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా…! అవేమీ జరగవు. ప్రభుత్వం చేసే రిజిస్ట్రేషన్, అనుమతి మంజూరు, పన్ను వసూళ్లకు విలువ లేదని, వివాద రహిత ఆస్తులను కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం రుజువు చేస్తుంది. భూమి కొనే ముందు న్యాయ వివాదాలు లేవని స్పష్టం చేసుకున్న తర్వాత కొనడం మేలు.